Sep 29,2022 12:25

ఒట్టావా :   భారత్‌ వెళ్లే తమ ప్రయాణికులకు కేనడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్‌కు 10 కి.మీ దూరంలో ఉన్న భారత రాష్ట్రాలకు వెళ్లద్దని సలహాఇచ్చింది. ల్యాండ్‌మైన్‌లు, అనూహ్య భద్రతా పరిస్థితుల రిత్యా పాకిస్థాన్‌ సరిహద్దుగా కలిగిన రాష్ట్రాలైన గుజరాత్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లకు వెళ్లవద్దని కెనడా తన పౌరులకు సూచించింది. ఈమేరకు సెప్టెంబర్‌ 27న చివరిసారిగా అప్‌డేట్‌చేసిన కెనడా ప్రభుత్వం ట్రావెల్‌ అడ్వైజరీలో పేర్కొంది. దేశమంతటా తీవ్రవాద దాడుల ముప్పు, కారణంగా భారత్‌ వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అయితే కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌ను మినహాయించింది. ఉగ్రవాదం, చొరబాటుదారుల నుండి ప్రమాదం పొంచి ఉండటంతో మణిపూర్‌, అస్సాంలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. దేశంలో పెరుగుతున్న నేరాలు, భారత వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో కెనడా వెళ్లే భారతీయులు, అక్కడి విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఈ నెల 23న భారత్‌ ఒక హెచ్చరికను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒట్టావాలోని హై కమిషన్‌, టోరంటో, వాంకోవర్‌లోని భారత రాయబార కార్యాలయంలో సంబంధిత వెబ్‌సైట్‌లు లేదా పోర్టల్‌ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించింది.