పంజాబ్‌లో చతుర్ముఖ పోటీ

May 12,2024 08:10 #panjaob

– రైతుల సమస్యలే ఎన్నికల ఎజెండా
– అగ్నివీర్‌, ఇండో-పాక్‌
సరిహద్దు మూత, నిరుద్యోగం, డ్రగ్స్‌ కూడా..
-కేజ్రీవాల్‌ అరెస్ట్‌ ప్రభావం సైతం
– కార్నర్‌ అవుతున్నది బిజెపియే

జె.జగదీష్‌

పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంటున్నది. చారిత్రాత్మక రైతు ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న పంజాబ్‌లో రైతు సమస్యల చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. పంజాబ్‌లో 13 లోక్‌సభ స్థానాలకు ఒకే దశలో ఏడో విడత (జూన్‌ 1) ఎన్నికలు జరగనున్నాయి. రైతుల సమస్యలపై ఆప్‌, శిరోమణి అకాలీదళ్‌ (ఎస్‌ఎడి), కాంగ్రెస్‌లు, బిజెపిని నిలదీస్తున్నాయి. పంజాబ్‌ గ్రామీణ ఓటర్లలో ఎక్కువ మంది రైతులే కాబట్టి, బిజెపిని కార్నర్‌ చేయడానికి పార్టీలు రైతుల ఆందోళనను ఎజెండా చేశాయి. ఇప్పటికే అనేక గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి బిజెపి నాయకులు రావడానికి వీలులేదని పోస్టర్లు వేశారు. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు రైతుల నుంచి బిజెపి నేతలు నిరసనలు ఎదుర్కొన్నారు.
ఎవరికెన్ని?
2019 ఎన్నికల్లో 13 లోక్‌సభ స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్‌, రెండు ఎస్‌ఎడి, రెండు బిజెపి, ఆప్‌ ఒకటి గెలుచుకున్నాయి. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ విజయ దుందుభి మోగించింది. అప్పటికే ఎంపిగా ఉన్న భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఆయన సిఎం అవ్వడంతో ఖాళీ అయిన సంగ్రూర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్‌ ఓటమి చెందింది. ఆ ఎన్నికల్లో శిరోమణి అకాలీ దళ్‌ (అమృత్‌సర్‌) నేత సిమ్రంజిత్‌ సింగ్‌ మాన్‌ గెలుపొందారు. 2023లో జలంధర్‌ కాంగ్రెస్‌ ఎంపి సంతోఖ్‌ సింగ్‌ మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఆప్‌ తరఫున సుశీల్‌ కుమార్‌ రింఖు భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన ఇటీవల బిజెపిలో చేరి జలంధర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

విడిగానే ఆప్‌, కాంగ్రెస్‌,ఎస్‌ఎడి, బిజెపి
పంజాబ్‌లో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఆప్‌, కాంగ్రెస్‌, బిజెపి, ఎస్‌ఎడి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఆప్‌, కాంగ్రెస్‌ మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని ఆయా పార్టీల నాయకులు ప్రకటించారు. పంజాబ్‌లో ఉభయ పార్టీల నడుమ ఎలాంటి శత్రుత్వమూ లేదు. బిజెపి, ఎస్‌ఎడి రెండూ అన్ని స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. కాగా ఎన్నికల వేళ రాజీనామాలు కాంగ్రెస్‌ పార్టీకి నష్టం కానున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి, రాహుల్‌, ప్రియాంక గాంధీలకు అత్యంత దగ్గర వ్యక్తి లుధియానా సిట్టింగ్‌ ఎంపి రవ్‌నీత్‌ సింగ్‌ బిట్టు బిజెపిలో చేరారు. కాంగ్రెస్‌ నేత విక్రమ్‌జిత్‌ సింగ్‌ చౌదరి, ఆయన తల్లి కరమ్‌జిత్‌ కౌర్‌ చౌదరి, తేజిందర్‌ సింగ్‌ బిట్టు బిజెపి చేరారు. అంతకుముందు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, ఆయన భార్య, సిట్టింగ్‌ ఎంపి ప్రినీత్‌ కౌర్‌ బిజెపిలో చేరారు. కాంగ్రెస్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్‌ జంక్కర్‌ కూడా బిజెపిలో చేరారు. ఇది కాంగ్రెస్‌ పార్టీకి కాస్తంత నష్టమనే చెప్పాలి.
నాలుగు స్థానాల్లో వామపక్షాలు పోటీ
పంజాబ్‌లో నాలుగు స్థానాల్లో సిపిఎం, సిపిఐ పోటీ చేస్తున్నాయి. సిపిఎం తరపున జలంధర్‌ నుంచి కార్మిక నేత పురుషోత్తమ్‌ లాల్‌ బిల్గా బరిలో ఉన్నారు. సిపిఐ తరపున అమృత్‌సర్‌ నుంచి దస్వీందర్‌ కౌర్‌, ఖదూర్‌ సాహిబ్‌ నుంచి రైతు నేత గుర్దియాల్‌ సింగ్‌, ఫరీద్‌కోట్‌ నుంచి గుర్చరణ్‌ సింగ్‌ మాన్‌ పోటీ చేస్తున్నారు.
బెడిసికొట్టిన బిజెపి, ఎస్‌ఎడి పొత్తు వ్యూహం
ఎస్‌ఎడితో పొత్తును పునరుద్ధరించడానికి బిజెపి చర్చలు జరిపింది. రైతుల ఆందోళన ప్రారంభంతో అది కాస్తా బెడిసికొట్టింది. ప్రధాని మోడీ సభలో స్థానిక ఎంపిగా పాల్గొన్న ఎస్‌ఎడి నేత హర్‌ సిమ్రాత్‌ కౌర్‌ పై రైతులు తీవ్రంగా విమర్శలు గుప్పించారు. ఎస్‌ఎడి పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. దీంతో బిజెపితో వెళ్తే తీవ్ర నష్టం జరుగుతుందని భావించిన ఎస్‌ఎడి, పొత్తు అంశాన్ని పక్కన పెట్టింది.

అగ్నివీర్‌ పై ఆగ్రహం
సైన్యంలో అత్యధికంగా ఉన్న పంజాబీలు మోడీ సర్కారు తెచ్చిన అగ్నివీర్‌ పథకాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రావాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయట్లేదని అధికార ఆప్‌ తరచూ బిజెపిని నిలదీస్తోంది. రూ. 8 వేల కోట్లను నిలిపేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా బిజెపి విచ్ఛిన్నం చేసిందని ఆప్‌ నాయకులు చెబుతున్నారు. నిరుద్యోగం, గ్రామీణ రుణాలు కూడా రాష్ట్రంలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. అట్టారీ సరిహద్దు ద్వారా ఇండియా – పాకిస్తాన్‌ మధ్య వాణిజ్యం మూసివేయడం ప్రధాన సమస్యలలో ఒకటి. ఇది పంజాబ్‌ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. 2019లో పుల్వామా దాడి కారణంగా ఇండియా- పాక్‌ మధ్య వాణిజ్యం నిలివేశారు. ఇంటిగ్రేటెడ్‌ చెక్‌ పోస్ట్‌ (ఐసిపి)ని తిరిగి తెరవాలని వాణిజ్య సంస్థలు చాలా కాలంగా డిమాండ్‌ చేస్తున్నాయి. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ ప్రభావం ఎన్నికలపై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

➡️