పాలస్తీనియన్లకు వెల్లివిరిసిన సంఘీభావం

  • పాలస్తీనా అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవ సందర్భంగా పలు దేశాల్లో ర్యాలీలు

లండన్‌/టెహ్రాన్‌: పాలస్తీనియన్లకు సంఘీభావం తెలియజేయడం కోసం ఐక్యరాజ్య సమితి నవంబరు29 వ తేదీని ప్రపంచ సంఘీభావ దినంగా 1977లో ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి యేటా ఈ సంఘీభావ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాపితంగా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది సంఘీభావ దినోత్సవ సందర్భంగా క్యూబా, ఇరాన్‌, వెనిజులా, ఆఫ్రికా తదితర దేశాల్లో వేలాది మంది వీధుల్లోకి వచ్చి పాలస్తీనీయులకు సంఘీభావంగా నిలిచారు. సంఘీభావ దినం సందర్భంగా శాంతిని కోరుకునే వివిధ సంఘాలతో కూడిన కూటమి కార్యకర్తలు ప్రపంచ వ్యాపితంగా ర్యాలీలు, సభలు, సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. ఇజ్రాయిల్‌ గాజాలో యుద్ధాన్ని వెంటనే ఆపాలని వారు దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. యుద్ధానికి వెంటనే నిలిపివేయాలని, బందీలను తిరిగి అప్పగించాలని కోరుతూ ఇజ్రాయిల్‌ అంతటా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలకు శాంతి కార్యకర్తలతోబాటు ఇజ్రాయిల్‌ కమ్యూనిస్టు పార్టీ సారథ్యం వహించింది. క్యూబా అధ్యక్షుడు మిగుయెల్‌ డియాజ్‌ కానెల్‌ ఎక్స్‌్‌లో పోస్టు పెడుతూ గాజాలో ఇజ్రాయిల్‌ సాగిస్తున్న ఊచకోతను వెంటనే ఆపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఇజ్రాయిల్‌ చేస్తున్న ప్రతి దాడి అనేక మంది అమాయక పౌరుల ప్రాణాలను తీస్తుందని అన్నారు. ఐరాస చీఫ్‌ గుటెరస్‌ మాట్లాడుతూ, పాలస్తీనాకు తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.పాలస్తీనా శరణార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ప్రపంచం చాలా కాలంగా ఈ శరణార్థుల సంక్షోభాన్ని పరిష్కరించకుండా అలా వదిలేసిందని ఆయన వాపోయారు.

➡️