విజయవాడ సెంట్రల్‌లో రసవత్తర పోరు

May 13,2024 00:14 #Vijayawada Central

– వైసిపి అభ్యర్థి నియోజకవర్గానికి కొత్త
– టిడిపి అభ్యర్థిపై అనేక ఆరోపణలు
– ఇండియా వేదిక అభ్యర్థికి సానుకూల అంశాలు
ప్రజాశక్తి – విజయవాడ :విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్న తాజా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోలింగ్‌కు ఇక కొద్ది గంటలే మిగిలి ఉంది. ప్రధాన పార్టీలైన వైసిపి, టిడిపి అభ్యర్ధుల విజయావకాశాల కోసం ఆయా పార్టీల తరపున పెద్దఎత్తున ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమం శనివారం సాయంత్రం నుండి ఆదివారం అర్దరాత్రి వరకూ యథేచ్ఛగా సాగింది. అదే సమయంలో ఇండియా బ్లాక్‌ తరపున పోటీచేస్తున్న సిపిఎం అభ్యర్థి ప్రజల్లో ఉండి పోలింగ్‌ శాతం పెరిగేలా ఇండియా బ్లాక్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. వైసిపి తరుపున పశ్చిమ నియోజకవర్గ ఎంఎల్‌ఎ వెలంపల్లి శ్రీనివాస్‌, బిజెపి, జనసేన మద్దతుతో టిడిపి అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వరరావు, కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ ఆద్మీల కలయిక అయిన ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం అభ్యర్ధిగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు ప్రధాన పోటీలో ఉన్నారు.

నియోజకవర్గంలో రెండు లక్షల 70 వేల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధిక మంది మహిళా ఓటర్లే. సిట్టింగ్‌ వైసిపి ఎంఎల్‌ఎగా ఉన్న మల్లాది విష్ణు గత ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావుపై కవలం 25 ఓట్ల మెజార్టీతో గెలవడంతో ఈసారి గెలుపు కష్టమని భావించి.. విష్ణుకు టికెట్‌ ఇవ్వడానికి ఆ పార్టీ అధిష్టానం నిరాకరించింది. పశ్చిమలోనూ వెల్లంపల్లి పరిస్థితి కూడా అలాగే ఉండడంతో ఆయనను సెంట్రల్‌కు బదిలీ చేసింది. అయితే వెల్లంపల్లి రాకను స్థానిక నేతలు ప్రధానంగా మల్లాది విష్ణు అనుచరులు తొలినాళ్లలో బహిరంగంగానే వ్యతిరేకించారు. ఆయనకు మద్దతిచ్చేది లేదని నేతలు బహిరంగంగానే పత్రికలకెక్కారు. మరికొందరైతే …’మా కేం చేస్తారో’ చెప్పాలని వెల్లంపల్లి కార్యాలయంలోనే బేరసారాలకు దిగారు. ఇప్పటికీ ఆ అసమ్మతి కొంతమేర అయినా కొనసాగుతున్నదనే చెప్పాలి. వెల్లంపల్లిపై గత ఐదేళ్లలో అనేక ఆరోపణలు వచ్చాయి. పశ్చిమలో అభివృద్ధి పనులు ఏమీ చేపట్టలేదని తీవ్ర విమర్శలున్నాయి. అక్కడ పనికి రాని వ్యక్తి సెంట్రల్‌లో ఎలా పనికొస్తారని ఇక్కడికి ఎలా మార్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్లను, వారి ద్వారా ఓటర్లను ప్రలోభపరచారని ఇప్పటికే పత్రికల్లో ఫొటోలు సహా వార్తలొచ్చాయి. వెలంపల్లి గెలిస్తే తన రాజకీయ భవిష్యత్‌ ప్రశ్నార్ధకం అవుతుందనే ఆందోళన మల్లాది విష్ణులో ఉందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటి వరకు వారిద్దరూ కలిసి ప్రచారం చేసింది కూడా తక్కువే. వెల్లంపల్లి…తనను గెలిపిస్తే చేయబోయే పనుల గురించి ప్రజలకు ఏవిధమైన హామీ ఇవ్వలేకపోతున్నారు.

మరోవైపు బొండా ఉమా దుందుడుకుగా ఉంటారనే పేరుంది. రవాణా శాఖాధికారులు సహా పోలీస్‌, ఇతర శాఖల అధికారులపైకి దూసుకుపోవడం, భూముల కబ్జా, తనయుల దౌర్జన్యం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి. బొండాకూ అసమ్మతి బెడద వెన్నాడుతూనే ఉంది. మాజీ కార్పొరేటర్లు గండూరి మహేష్‌, మాజీ కార్పొరేటర్‌ భర్త కోసూరు సుబ్రహ్మణ్యం (మణి), మరికొందరు ఎన్నికలకు కొద్దిరోజుల ముందే సిఎం సమక్షంలో వైసిపిలో చేరారు. అంతేగాక బిజెపితో జతకట్టడంతో ముస్లిం మైనారిటీలు, దళితుల ఓట్లు ఏ మేరకు టిడిపికి పడతాయనే సందేహం ఆ పార్టీని గందరగోళంలో పడేస్తోంది. ఇటీవల సిఎంపై జరిగిన రాయి దాడి ఘటన కూడా ఆయనకు తీవ్ర తలనొప్పిగా తయారైంది.
సిపిఎం అభ్యర్ధి చిగురుపాటి బాబూరావుకు నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది. అటు వైసిపి, ఇటు టిడిపి అభ్యర్దుల నిర్వాకాలను ఆయన వివిధ రూపాల్లో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. మూడు పర్యాయాలు కార్పొరేటర్‌గా, స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా సెంట్రల్‌ నియోజకవర్గంతోపాటు నగర వ్యాప్తంగా చేపట్టిన అభివృద్ధి పనులను బాబూరావు గుర్తు చేశారు. . ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌, సిపిఐ, ఆమ్‌ఆద్మీతో పాటు రాజ్యాంగ పరిరక్షణా కమిటీ నాయకులు, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్‌, రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, విజయవాడ మాజీ మేయర్‌ మల్లికాబేగం, ప్రముఖ ఇంజినీర్‌, మాజీ ఎంపి కెఎల్‌రావు కుమారుడు కె శ్రీనివాస్‌, మాజీ ఐఎఎస్‌లు, పౌర సంఘాల నేతలు కూడా ప్రచారం చేశారు.

➡️