‘నా సినిమాల్లో జబర్దస్త్ టైపు స్కిట్స్ ఉంటాయని కొందరు అంటుంటారు. అలా అనేవాళ్లు 10 శాతం ఉంటే 90 శాతం మంది నా సినిమాను ఎంజారు చేస్తున్నారు. గత పదేళ్లుగా కొంతమంది నా సినిమాలను విమర్శిస్తూనే ఉన్నారు. నాకూ అలవాటైపోయింది. అందుకే నా పనిచేసుకుంటున్నా. ఆడియన్సే వాళ్లకు సమాధానం చెబుతున్నారు. ఒక వేళ వాళ్లు అన్నదే నిజమైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమా వారం రోజుల్లో రూ.200 కోట్లు రాబట్టదు. నేను నా పంథా మార్చుకోను. ఇలాగే సినిమాలు చేస్తాను. నా సినిమాలను ఫ్యామిలీ మొత్తం చూసి ఎంజారు చేస్తున్నారు. ఎలాంటి వల్గారిటీ లేకుండా సినిమాలను చేస్తున్నాను. కామెడీ కోసం బూతు పదాలను వాడట్లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజు చేత కూడా కొంతవరకూ బూతులు తిట్టించాను. అది కూడా ఓ మంచి సందేశం ఇవ్వటం కోసమే. ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసి పిల్లలు ఎలా చెడిపోతున్నారనేది ఈ సినిమాలో చూపించాం.’ అని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈనెల 14న విడుదలైంది. విడుదలైన ఎనిమిదిరోజుల్లోనే రూ.218 కోట్ల గ్రాస్ వసూళ్లను సంపాదించి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.
