విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదు

Apr 25,2024 17:34 #cpm
  • సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం
    ప్రజాశక్తి-అనకాపల్లి
    అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విద్వేశపూరిత ప్రసంగాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల్లో తమ ప్రభుత్వం వద్ద ఉన్న అభివృద్ధి ప్రణాళికలు, ఎజెండాలు వెల్లడిరచకుండా ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిరం గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఉపసంహరణ ప్రకటన, సొంత గనులు కేటాయింపు వంటి ప్రాధాన్యత అంశాలను విస్మరించి అధికారంలోకి వస్తే ఒకే దేశం, ఒకే ఎన్నికలు అమలు చేస్తామని చెప్పడం ప్రజాస్వామిక హక్కులను, విలువలను దెబ్బతియ్యడమేనని పేర్కొన్నారు. పేదరికం, నిరుద్యోగ సమస్యలను పరిష్కరించకుండా రామమందిరం నిర్మాణాన్ని విజయంగా చెప్పుకోవడం బాధ్యతా రహితంగా మాట్లాడడమేనన్నారు. ఎన్నికల ప్రసంగాల్లో మత విద్వేశాలను రెచ్చగొట్టి లబ్ధిపొందడానికి బిజెపి పథకం ప్రకారం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు అప్రమత్తమై బిజెపి అభ్యర్ధి సిఎం రమేష్‌ను, ఆ పార్టీకి మద్ధతు ఇస్తున్న టిడిపి, జనసేన పార్టీలను, దానికి అంటకాగుతున్న పార్టీలను ఓడిరచడం ద్వారా దేశ ఐక్యతను, మత సామరస్యాన్ని కాపాడుకోగలమని స్పష్టంచేశారు. ఎన్నికల ప్రసంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు, ఎజెండాలు ప్రజల ముందు వుంచకుండా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలతో జిల్లా ప్రజలను పట్టిపీడిస్తున్న సమస్యలను ప్రధాన పార్టీలు విస్మరించడం సరికాదన్నారు. రక్షణ శాఖా మంత్రి ఎన్నికల ప్రచారానికి అనకాపల్లికి వస్తున్న సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ కార్మికులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమైన చర్యగా పేర్కొన్నారు. ఈ చర్య ద్వారానే ఈ ప్రాంతం పట్ల వారికి ఉన్న ప్రేమ అర్ధమౌతుందని పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపేశక్తి సిఎం రమేష్‌కి ఉందనడం పచ్చి మోసం తప్ప మరొకటికాదని స్పష్టంచేశారు. ఆయనకు చిత్తశుద్ధి వుంటే స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోడీతో ప్రకటించి, ప్లాంట్‌కు సొంత గనులు కేటాయిస్తున్నట్లు చెప్పించాలని డిమాండ్‌చేశారు. ఎంపి అభ్యర్థి ముత్యాలనాయుడుకు ఇంగ్లీష్‌ రాదని తక్కువ చేసి మాట్లాడారన్నారు. సిఎం రమేష్‌ ఇదే విషయాన్ని అనకాపల్లి జిల్లా వారికి సరిగ్గా మాట్లాడడం రాదని పదేపదే చెప్పడం అంటే అనకాపల్లి జిల్లా ప్రజలను అవమానపర్చినట్లే తప్ప మరొకటి కాదని గుర్తించాలని కోరారు. అనకాపల్లిజిల్లాకి వలస వచ్చి పచ్చని పల్లెలో విద్వేశాలు రెచ్చగొట్టాలని చూస్తున్న ఈ వలసపక్షిని ఓడించాలని జిల్లా ప్రజలకు సిపిఎం జిల్లా కమిటీ తరపున కె.లోకనాథం విజ్ఞప్తిచేశారు. జిల్లాలో ప్రధాన అంశాలేవి ప్రస్తావించకుండా విమర్శలకే పరిమితమయ్యారన్నారు. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, సిపిఎస్‌ రద్దు వంటి అశాలపైన, పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం ఉపాధి కల్పన వంటి వాటిపై తన వైఖరిని వెల్లడించకుండా తప్పదాటు వైఖరిని ప్రదర్శించారు. మూసివేసిన తుమ్మపాల, ఏటికొప్పాక, తాండవ షుగర్‌ ఫ్యాక్టరీల పునరుద్దరణ ప్రస్తావన లేకపోవడం అంటే జిల్లా ప్రజలను విస్మరించడమేనన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ వివిధ రూపాల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న కూటమి ఎంపి అభ్యర్థిపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్‌ చేస్తుందన్నారు. అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి అప్పలనర్సను గెలిపించాలిబిజెపి కూటమిని ఓడించి ఇండియా కూటమి బలపరిచిన అరకు పార్లమెంట్‌ సిపిఎం అభ్యర్థి అప్పలనర్సను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.లోకనాథం పిలుపునిచ్చారు స్థానిక సిపిఎం కార్యాలయంలో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
➡️