సభ లోపల, బయట ప్రతిపక్షాల ఆందోళన
అమిత్ షా దాక్కోవద్దు, పార్లమెంటులో సమాధానం చెప్పండి
మహాత్మా గాంధీ విగ్రహం నుంచి మకర ద్వార్ వరకు మార్చ్
ప్రజాశక్తి - న్యూఢిల్లీ బ్యూరో : అయోధ్య రామమందిరం విరాళాల చోరీ, విద్యార్థులపై ఢిల్లీ పోలీసుల దాడికి కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్షాల చేపట్టిన ఆందోళనతో పార్లమెంట్ అట్టుడికింది. బుధవారం పార్లమెంట్ ఉభయ సభల్లోనూ, పార్లమెంట్ ఆవరణంలోనూ ప్రతిపక్షాల ఆందోళన జరిగింది. పార్లమెంట్ ఆవరణంలో ప్రతిపక్ష పార్టీల ఎంపిలు ప్రేరణా స్థల్‌లోని మహాత్మా గాంధీ విగ్రహం నుంచి మకర ద్వార్ వరకు మార్చ్ చేపట్టారు. 'దాక్కోవద్దు, పార్లమెంటులో సమాధానం చెప్పండి' అంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకి వ్యతిరేకంగా ప్లకార్డులు చేబూని నినాదాల హోరెత్తించారు. "విద్యార్థుల పట్ల తప్పు చేసిన దోషం వల్లే దేశ హోం మంత్రి ముఖం దాక్కుంటున్నారు" అని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులపై పోలీసుల దురాగతాలపై హోం మంత్రి అమిత్ షా ప్రకటన, రామ మందిర విరాళాల దుర్వినియోగంపై చర్చ, జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. “వారు పార్లమెంటును అగౌరవపరుస్తున్నారు. ఇన్ని రోజులు గడిచినా వారు సభలోకి అడుగు పెట్టడం లేదు. సభకు వచ్చి ప్రకటన ఇవ్వడంలో సమస్య ఏమిటి?” అని ప్రశ్నించారు. అమిత్ షా చెవిటివారా, మూగవారా? అని ప్రశ్నించారు.
మరోవైపు బుధవారం కూడా ప్రతిపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాల పర్వం తొక్కాయి. రెండు సభల్లో ప్రతిపక్ష ఎంపిలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రామ మందిర విరాళాల కుంభకోణంపై నిరసన తెలిపిన ప్రతిపక్ష పార్టీలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, సిపిఐ, సమాజ్‌వాదీ పార్టీలు ఎల్లప్పుడూ శ్రీరాముడిని వ్యతిరేకిస్తున్నాయని, పార్లమెంట్ ప్రాంగణంలో వారు ప్రదర్శించిన “చందా చోరీ” స్కిట్ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు.
అంతేకాకుండా, సభ సజావుగా పనిచేయడాన్ని ప్రతిపక్షం కోరుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ‘‘కేసీ వేణుగోపాల్ మంచి మనిషే, కానీ ఆయన తన పార్టీ సభ్యులకు మర్యాద పాటించాలని అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నారు’’ అని అన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. అయితే కేంద్ర మంత్రి ప్రకటనపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వమే కావలని సభను నిర్వహించేందుకు సిద్ధంగా లేదని, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంట్‌కు హాజరు కావడం లేదని అన్నారు.








కామెంట్‌లు (0)