ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలు
కొనసాగుతున్న నిరాహార దీక్షలు
కనీసం నీళ్లైనా తాగాలని వాంగ్‌చుక్ విజ్ఞప్తి
మద్దతు తెలిపిన సిజెపి
రాంచీ : ఉద్యోగ నియామక పరీక్షలలో అక్రమాలకు వ్యతిరేకంగా జార్ఖండ్‌లో ఆందోళనలు ఉధృతమయ్యాయి. మంగళవారం రాత్రి నుంచి మరో ఐదుగురు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. దీంతో నిరాహార దీక్ష చేస్తున్న వారి సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇప్పటికే నాలుగు రోజుల నుంచి జార్ఖండ్ లోక్తాంత్రిక్ క్రాంతికారి మోర్చా సభ్యులు దేవేంద్ర నాథ్ మహతో నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. రాంచీలోని జైపాల్ సింగ్ ముండా స్టేడియంలో ఈ దీక్షలు సాగుతున్నాయి. కాగా, నిరాహార దీక్ష చేస్తున్న దేవేంద్ర నాథ్ మహతోతో ప్రముఖ పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్ బుధవారం ఫోన్ ద్వారా మాట్లాడారు. రక్తంలో చక్కెర, రక్తపోటు స్థాయిలు పడిపోతున్నందున కనీసం నీళ్లైనా తాగాలని మహతోకు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తితో మహతో నీళ్లు తాగారు. రాష్ర్టంలో ఉద్యోగ నియామాల కోసం నిర్వహించే జెపిఎస్‌సి, జెఎస్‌ఎస్‌సి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ జార్ఖండ్‌లో విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లో సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, పరీక్షలలో జరిగిన అవకతవకలపై సిబిఐతో గానీ లేదా రాష్ర్టానికి చెందని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన స్వతంత్ర కమిటీతో గానీ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జెపిఎస్‌సి, జెఎస్‌ఎస్‌సి రిఫార్మ్స్ మంచ్ బ్యానర్ కింద మంగళవారం నుంచి ఐదుగురు నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. దీని గురించి మంచ్ ప్రతినిధి జీవన్ కుమార్ మాట్లాడుతూ “మా డిమాండ్లను నెరవెర్చాలని కోరుతూ, ఇద్దరు మహిళలతో సహా మా ఐదుగురు స్నేహితులు మంగళవారం రాత్రి నుంచి నిరాహార దీక్ష చేపట్టారు” అని తెలిపారు. అలాగే, విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా 'త్రివర్ణ పతాక యాత్ర' నిర్వహించడంపై నిర్ణయం తీసుకునేందుకు త్వరలో కోర్ కమిటీ సమావేశం జరగనుందని తెలిపారు.
జార్ఖండ్ ఆందోళనలకు మద్దతు : అభిజీత్ దీప్కే
జార్ఖండ్‌లో జరుగుతున్న ఆందోళనలకు సిజెపి వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మద్దతు ప్రకటించారు. మహారాష్ట్రలోని దీప్కే స్వస్థలం ఛత్రపతి సంభాజీనగర్‌లో బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరిగే సిజెపి వ్యూహాత్మక భేటీ ప్రారంభమయింది. దీనికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. రాంచీలో జరుగుతున్న ఆందోళనలో సిజెపి పాల్గొంటుందా అనే మీడియా ప్రశ్నకు "అవసరమైతే మేము అక్కడికి వెళ్తాము. ఈ విషయంపై నేటి సమావేశంలో చర్చిస్తాము," అని దిప్కే సమాధానమిచ్చారు. అలాగే, యువజన ఉద్యమ సంస్థ అయిన సిజెపికి ప్రస్తుతానికి రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశం ఏదీ లేదని, కేవలం సివిక్ ప్రెజర్ గ్రూప్ (పౌర ఒత్తిడి సమూహం)గా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ ఈ ఉద్యమానికి మార్గదర్శిగా కొనసాగుతున్నారని ఆయన తెలిపారు.








కామెంట్‌లు (0)