శుక్రవారం, 09 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

యుపిలో కొనసాగుతున్న బుల్డోజ్‌‌రాజ్‌

05 సెప్టెంబర్, 2026

Saharanpur  mosque
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 05, 2026, 04:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- షహరాన్‌‌పూర్‌లో115 ఏళ్ల మసీదు కూల్చివేత

- ఎస్‌‌పి ఎంపి ఇక్రా హసన్‌‌ను అడ్డుకున్న అధికారులు

లక్నో : బిజెపి పాలిత ఉత్తరప్రదేశ్‌‌లో బుల్డోజ్‌‌రాజ్‌ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా షహరాన్‌‌పూర్‌‌లో 115 ఏళ్లగా ఉన్న ఒక మసీదును కూల్చివేశారు. పట్టణంలోని జిల్లా మేజిస్ట్రేట్ కార్యాలయ సముదాయంలో ఈ మసీదును భారీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు శనివారం కూల్చివేశారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌‌డిఎం), సిటీ మేజిస్ట్రేట్ సమక్షంలో ఈ కూల్చివేత కార్యక్రమం జరిగింది. కలెక్టరేట్ ప్రాంగణానికి వున్న ఐదు గేట్లకూ తాళాలు వేసి, బయటివారి లోపలకు రాకుండా అడ్డుకున్నారు. జెసిబిలు, ఇతర యంత్రాలతో మసీదును కూల్చివేశారు. ఈ కార్యక్రమం కోసం శుక్రవారం రాత్రే డంపర్లు, జేసీబీ యంత్రాలను కలెక్టరేట్ ప్రాంగణంలోకి తరలించారు.

కోర్టు ఆదేశాల మేరకే ఈ కూల్చి వేత జరిగిందని అధికారులు తెలిపారు. నగర మేజిస్ట్రేట్ కోర్టు ఆగస్టు నెలలో ఈ మసీదును చట్టవిరుద్ధమని ప్రకటించిందని, కూల్చివేతకు ఆదేశాలు జారీ చేసిందని అధికారులు చెప్పారు. బజరంగ్ దళ్ మాజీ ప్రావిన్షియల్ కోఆర్డినేటర్ వికాస్ త్యాగి చేసిన ఫిర్యాదు తరువాత ఈ కూల్చివేత ఆదేశాలు జారీ అయ్యాయి.

కాగా, షహరాన్‌‌పూర్‌ ‌పర్యటనకు వెళ్లకుండా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌‌పి) ఎంపి ఇక్రా హసన్‌‌ను అధికారులు అడ్డుకున్నారు. శనివారం గృహ నిర్భంధంలో ఉంచారు. కైరానా నియోజకవర్గ ఎంపి అయిన ఇక్ర హసన్‌ షెడ్యూల్‌ ‌ప్రకారం షహరాన్‌‌పూర్‌ ‌పర్యటన కోసం శనివారం ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరుతుండగా, భారీ సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని ఆయన్ను అడ్డుకున్నాయి. గృహ నిర్భంధం చేశాయి. తమ ఎంపిని గృహ నిర్భంధం చేయడాన్ని ఎస్‌‌పి తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో మత ప్రాతిపదికన అశాంతిని రెచ్చగొట్టడానికి బిజెపి ప్రభుత్వం నిరంతం ప్రయత్నిస్తోందని విమర్శించింది. 2027 యుపి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇది మరింత తీవ్రమైందని పేర్కొంది. ఎస్‌‌పి అధినేత అఖిలేష్ యాదవ్ ఈ ఘటనపై స్పందిస్తూ “సామరస్యాన్ని కాపాడటమే ప్రభుత్వ అతిపెద్ద బాధ్యత, కానీ ఈ బాధ్యత నుంచి బిజెపి ప్రభుత్వం తప్పుకుంటుంది” అని విమర్శించారు. ఎస్‌‌పి సీనియర్‌ ‌నాయకులు, ఘాజీపూర్ లోక్‌సభ ఎంపి అఫ్జల్ అన్సారీ ‘రాజ్యాంగ హక్కులను బిజెపి ప్రభుత్వం పూర్తిగా కాలరాస్తోంది. ఒక ఎంపిని గృహ నిర్బంధంలో ఉంచడం కంటే ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు మరొకటి ఉండదు’ అని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యను ఖండిస్తున్నామన్నారు.

మసీదు కూల్చివేత నేపథ్యంలో యుపి ప్రభుత్వంపై బిఎస్‌‌పి జాతీయ అధ్యక్షులు మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మసీదులు, ఇతర మతపరమైన ప్రదేశాలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం "తొందరపాటుతో" కూల్చివేయడాన్ని తప్పిందంగా మాయావది విమర్శించారు. ఇలాంటి కూల్చివేతలను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి, ప్రతికూల పరిణామాలను నివారించడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాయావతి ఎక్స్‌‌లో ఒక సుదీర్ఘ పోస్టు చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్