ముంబై : ముంబైని పొగమంచు కమ్మేసింది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం గాలి నాణ్యతలు తగ్గాయి. కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురిసింది. ఈరోజు 8 గంటలకు ముంబైలో ఎక్యూఐ 131 వద్ద నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) పేర్కొంది. ఎక్యూఐ ‘మోడరేట్’ కేటగిరిలో సిపిసిబి వర్గీకరించింది. ఇక గాలి కాలుష్యంపై ఓ నగరవాసి మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రతిరోజూ కార్లు, బైకుల నుంచి వెలువడే పొగ వల్ల తీవ్రమైన వాయు కాలుష్యం ఏర్పడుతుంది. కాలుష్య నియంత్రణకు తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకపోతే భవిష్యత్ తరాలు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది’ అని అన్నారు. అలాగే సంజరు కథురియా అనే వ్యక్తి మాట్లాడుతూ.. ‘ఒక్క ముంబై నగరంలోనే కాదు.. యావత్ దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. దీపావళి పండుగ తర్వాత కాలుష్యం తీవ్రస్థాయిలో ఉంటుంది. ఆ తర్వాత ఏర్పడే వాయుకాలుష్యం వల్ల మార్నింగ్ వాకింగ్‌కి వెళ్లడం కూడా కష్టమే. కాలుష్య నియంత్రణకు పౌరులుగా మనం సరైన చర్యలు తీసుకోవాలి’ అని ఆయన అన్నారు.
కాగా, అక్టోబర్ 27 (ఆదివారం) ముంబయిలో ఎక్యూఐ 202 వద్ద నమోదైంది. సిపిసిబి ‘పూర్’ కేటగిరిగీ వర్గీకరించింది.