రెండేళ్లలో ప్రజలపై రూ.21 వేల కోట్ల భారం : సిపిఎం
ప్రజాశక్తి- ఎన్టీఆర్ జిల్లా ప్రతినిధి : విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, తగ్గించామని టిడిపి కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రెండేళ్ల విద్యుత్ ప్రగతి నివేదిక అబద్దాలు, అవాస్తవాలు, పాక్షిక సత్యాలతో కూడి ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు విమర్శించారు. రెండేళ్ల టిడిపి కూటమి ప్రభుత్వ పాలనలో రూ.21 వేల కోట్ల మేర సర్దుబాటు ఛార్జీల భారం పడిందని వివరించారు. విజయవాడలోని సిపిఎం కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. గత 24 నెలల్లో ప్రతినెలా, ప్రతి యూనిట్ విద్యుత్ పై రూ.1.88 నుండి 62 పైసల వరకు అదనంగా సర్దుబాటు ఛార్జీల భారం మోపిందని తెలిపారు. ఇప్పటికీ రెండు రకాల అదనపు సర్దుబాటు ఛార్జీల వసూళ్లు కొనసాగుతోందన్నారు. 2022-23 సంవత్సరాలకు రూ.6,072 కోట్లు, 2023-24 సంవత్సరాలకు రూ.9,412 కోట్లు, 2014-19 సంవత్సరాల కాలానికి రూ.1,400 కోట్లు, అదనంగా ప్రతి నెలా 40 పైసల చొప్పున రూ.5 వేల కోట్లు... మొత్తంగా రూ.21,885 కోట్ల మేర ట్రూ అప్, సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వం ముక్కుపిండి మరీ వసూలు చేస్తోందని వివరించారు. దీనిలో ఈ ఏడాది జనవరి నుండి యూనిట్ కు 13 పైసల చొప్పున రూ.923 కోట్లు మాత్రమే తగ్గించి ప్రజలను మభ్యపెడుతోందన్నారు. ఇది కాకుండా అదనపు లోడ్ డిపాజిట్లు, స్మార్ట్ మీటర్ల పేరుతో అధిక బిల్లులు, పలు రూపాల్లో విద్యుత్తు ఛార్జీల బాదుడు సాగుతూనే ఉందని చెప్పారు. విద్యుత్ వ్యయం యూనిట్ కు రూ5.42 నుండి రూ.4.90 కు, ఒక్కో యూనిట్ కు 52 పైసల తగ్గించామని చెబుతున్న ప్రభుత్వం... ఆ మేరకు ఛార్జీలు తగ్గించలేదని తెలిపారు. రూ.20 వేల కోట్ల భారం రాష్ట్ర ప్రభుత్వం భరించిందని చెప్పడంలో వాస్తవంలేదన్నారు. రూ.13,054 కోట్ల విద్యుత్ సబ్సిడీని పంపిణీ సంస్థలకు ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని తెలిపారు. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని గత ఎన్నికలకు ముందు టిడిపి కూటమి నేతలు పిలుపు ఇవ్వడాన్ని గుర్తు చేస్తూ, నేడు ప్రభుత్వం బలవంతంగా, ప్రజల కళ్లుగప్పి వీటిని ప్రతి ఇంటికీ బిగించడానికి పూనుకుందని, అదాని సంస్థకు దాసోహం అంటోందని విమర్శించారు. 25 ఏళ్లపాటు ఏడు వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ సరఫరా చేసే ఒప్పందాన్ని గత ప్రభుత్వంతో అదాని సంస్థ... సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకి) ద్వారా చేసుకుందని తెలిపారు. ఇందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలకు ఆ సంస్థ రూ.1,750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా కోర్టులో కేసు నమోదైన విషయాన్ని గుర్తుచేశారు. మోడీ ప్రభుత్వం ట్రంప్ ద్వారా అదానిపై కేసు లేకుండా చేయటానికి కుట్రలు పన్నుతోందన్నారు. ఈ ఒప్పందం వల్ల 25 ఏళ్లలో రూ.1,08,750 కోట్ల భారం ప్రజలపై పడుతుందని వివరించారు. విద్యుత్ భారాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సర్దుబాటు ఛార్జీల విధానాన్ని రద్దు చేయాలని, విద్యుత్ వ్యయం తగ్గిన మేరకు యూనిట్ కు 52 పైసలు ఛార్జీలు తగ్గించాలని బాబూరావు డిమాండ్ చేశారు. విద్యుత్ భారాలు, స్మార్ట్ మీటర్లపై సిపిఎం పోరు సాగిస్తుందని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)