సోమవారం, 20 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

కులవ్యవస్థను సమర్థించడం అనాగరికమైన చర్య

08 జులై, 2026

sadassu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 08:43 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి-నెల్లూరు : కుల వివక్ష అనేది గడప లోపల కాదు,గడప వెలుపల..వీధుల్లోనే స్పష్టంగా కనిపిస్తోందని దళిత శోషణ్ ముక్తి మంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. బుధవారం నెల్లూరులోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం,వ్యవసాయ కార్మిక సంఘం,ఇతర ప్రజాసంఘాల సంయుక్త ఆధ్వర్యంలో 'సామాజిక శంఖారావం'పేరిట జిల్లా సదస్సు జరిగింది.కులవివక్ష లేని సమాజ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి మంగళ పుల్లయ్య అధ్యక్షత వహించగా,ముఖ్యవక్తగా వి.శ్రీనివాసరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ,కులం పేరుతో ఎక్కడైతే అణిచివేత జరుగుతుందో అక్కడ దానిని పట్టించుకోకపోవడం ఏ రకంగా న్యాయమని ప్రశ్నించారు.హిందూమతంలో ఉన్న అసమానతలను ఏ విధంగా తొలగించాలి,వివక్షను ఎలా రూపుమాపాలి అనే అంశాలపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.హిందూమతంలో అసమానతలను అంగీకరించాలని చెప్పడమే ఒక పెద్ద తిరోగమనమని,అది అనాగరికమైన చర్య అని దుయ్యబట్టారు.హిందూ మతానికి,హిందుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఆర్‌ఎస్‌ఎస్,బీజేపీలు అణగారిన కులాలను అణిచివేసేందుకు హిందుత్వ శక్తులకు ప్రాతినిధ్యం వహిస్తూ,కుల అణిచివేతను బహిరంగంగా సమర్థిస్తున్నాయన్నారు. 'గడప లోపల మాత్రమే కులం..గడప దాటి బయటకు వస్తే మనమంతా హిందువులం...బంధువులం'అన్న సరికొత్త నినాదాన్ని బీజేపీ ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు.కులవ్యవస్థలోని అసమానతలు,అణిచివేత,వివక్షలకు బీజేపీ,విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ),ఆర్‌ఎస్‌ఎస్‌లు ప్రతిరూపాలని ఆరోపించారు.ఈ మతోన్మాద సంస్థలను ఎదుర్కోకుండా కుల నిర్మూలన సాధ్యం కాదన్నారు.కుల సమస్య ముందుకు వస్తే హిందువులంతా చీలిపోతారని,అప్పుడు వారందరినీ ఓటు బ్యాంకుగా వాడుకోవడం కష్టమని భావించే బీజేపీ..కులాన్ని వెనక్కి నెట్టి మతాన్ని ముందుకు తెస్తోందని విమర్శించారు.మతం పేరుతో హిందువులను ఏకం చేసి,ఓట్లు సంపాదించి అధికారాన్ని చేజిక్కించుకోవడమే వారి వ్యూహమన్నారు.మతం అనేది వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుందని,అలాంటి వ్యక్తిగత అంశాన్ని సామాజిక అంశంగా మార్చడం,సామాజిక అంశాన్ని వ్యక్తిగత అంశంగా మార్చడం సమాజానికి విఘాతకరమన్నారు.ఆర్‌ఎస్‌ఎస్‌కు కావాల్సింది హిందూమతం గొప్పదనాన్ని కీర్తించడమో,రాముడ్ని,సీతను పూజించడమో కాదు..కేవలం పరమత ద్వేషం మాత్రమేనని విమర్శించారు.ముస్లింలను,క్రైస్తవులను ద్వేషించడం,ఇతర మతాల వారిని దేశద్రోహులుగా చిత్రీకరించి ఒంటరిని చేయడం,చివరికి వారికి ఓటు హక్కు లేకుండా చేయడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని ఆరోపించారు.దళిత క్రిస్టియన్లకు రిజర్వేషన్లు వద్దని చెప్పడం విడ్డూరంగా ఉందని,వాస్తవానికి క్రైస్తవులుగా మారిన వారిలో ఎక్కువ మంది దళిత సామాజిక వర్గానికి చెందినవారేనని గుర్తుచేశారు.పెట్టుబడిదారీ వ్యవస్థతో కుల నిర్మూలన సాధ్యం కాదని రుజువైందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగే పోరాటాన్ని,కుల నిర్మూలన పోరాటాన్ని జంటగా ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయాన్ని ఎంతో అనుభవంతో తీసుకున్నట్లు తెలిపారు.సోషలిజం వస్తేనే కుల నిర్మూలన అనే అంతిమ లక్ష్యం సాధ్యమవుతుందని,అందుకే కుల నిర్మూలన పోరాటాలను వర్గ పోరాటంతో జత చేసి సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మూలం రమేష్,వృత్తిదారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ ఎం.భాస్కరయ్య తదితరులు పాల్గొన్నారు.


సంబంధిత వార్తలు

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్