మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పేదల సొంతింటి కలకు బుర్రిపాలెంలో నాంది

3 రోజుల క్రితం

mp.jpeg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026, 01:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

  • త్రీడీ సాంకేతికతతో గృహ నిర్మాణాలకు శ్రీకారం: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని

ప్రజాశక్తి-తెనాలిరూరల్ : పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు వినూత్న ఆలోచనతో తెనాలి నియోజకవర్గంలోని బుర్రిపాలెం గ్రామంలో త్రీడీ సాంకేతికతతో గృహ నిర్మాణాలకు నాంది పలికామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం బుర్రిపాలెంలో పర్యటించనున్న నేపథ్యంలో శనివారం గ్రామంలో జరుగుతున్న సభ, గృహ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.

బుర్రిపాలెంలో నిర్మిస్తున్న త్రీడీ గృహ సముదాయాలను పరిశీలించిన పెమ్మసాని అధికారులకు పలు సూచనలు చేశారు. కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చౌహాన్ సమక్షంలో రూపొందించిన అవగాహన ఒప్పందాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అందించనున్నట్లు తెలిపారు. తొలుత 75 వేల ఇళ్ల నిర్మాణంతో ప్రారంభించాలనుకున్న ఈ నిర్మాణం కేంద్రం సహకారంతో రూ.3 లక్షల వరకు పరిమితులు తెచ్చుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.

అనంతరం సభా ప్రాంగణంలో ప్రజలకు అవసరమైన కనీస వసతులు, ఇతర ఏర్పాట్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ సాంకేతికతను వినియోగించి గృహ నిర్మాణ విధానాన్ని బుర్రిపాలెంలో ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సాంకేతికతతో తక్కువ సమయంలోనే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ నిర్మాణాలపై సమగ్రంగా అధ్యయనం, సమీక్ష నిర్వహించిన అనంతరమే ప్రభుత్వం ఈ విధానాన్ని ఎంచుకుందని చెప్పారు.

త్రీడీ గృహ నిర్మాణాలపై నెలకొన్న అపోహలను ప్రజలు నమ్మవద్దని, నిర్మాణ నాణ్యత, సాంకేతిక అంశాలను పరిశీలించిన అనంతరం ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని పెమ్మసాని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండే ఈ వినూత్న గృహ నిర్మాణ విధానాన్ని విజయవంతం చేయడంలో అందరూ సహకరించాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్