కేంద్రం సన్నాహాలు..!
ప్రజా సమస్యలపై ఆందోళన కొనసాగిస్తాం: ప్రతిపక్షాలు
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్‌ను అమలుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును తిరిగి ప్రవేశపెట్టేందుకు, కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుందని తెలుస్తోంది. ఈ నెల 16, 17, 18 తేదీలలో ప్రత్యేక సమావేశం నిర్వహించే అంశంపై కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల స్పందనను కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఈ బిల్లును ఆమోదించుకోవాలని చూస్తోంది. అయితే జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువకుల హత్యలపై హోం మంత్రి వివరణ ఇవ్వాలని, అయోధ్యలోని రామ మందిర దోపిడీపై చర్చించాలని కోరడంతో పాటు, తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం అంగీకరించే వరకు పార్లమెంటు లోపల, వెలుపల తమ తీవ్ర ఆందోళనను కొనసాగిస్తామని ప్రతిపక్షం స్పష్టం చేసింది. ప్రతిపక్ష నిరసనలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అట్టుడికిపోతున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాన్ని బుజ్జగించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం ఈ వైఖరిని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. బుధవారం ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ సమావేశమైన కొద్ది నిమిషాలకే వాయిదా పడిన అనంతరం, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీతో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు భేటీ అయ్యారు. పార్లమెంట్ హౌస్‌లోని రాహుల్ ఛాంబర్‌లో సుమారు 50 నిమిషాల పాటు ఈ సమావేశం సాగింది. రాహుల్‌తో పాటు కాంగ్రెస్ ఎంపిలు ప్రియాంక గాంధీ వాద్రా, కెసి వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్ తదతరులు పాల్గొన్నారు. సభ సజావుగా సాగేందుకు ఆయన సహకారాన్ని కోరారు. హోం మంత్రి అమిత్ షా వివరణ ఇవ్వడం, దోపిడీపై చర్చించడం వంటి డిమాండ్లను అంగీకరించే వరకు నిరసన కొనసాగుతుందని రాహుల్ అన్నారు. ఈ భేటీలో వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లు, ఫారిన్ కంట్రిబూషన్ రెగ్యులేటింగ్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్ఎ) సవరణ బిల్లుపై ప్రధానంగా చర్చలు జరిగినట్టు సమాచారం. అయితే.. రిజిజు అభ్యర్థనను రాహుల్ పూర్తిగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అయోధ్య రామ మందిరంలో జరిగిన విరాళాల చోరీ ఆరోపణలపై చర్చ, అలాగే ఢిల్లీలో జులై 20న జరిగిన నిరసనల సందర్భంగా విద్యార్థులపై పోలీసుల చర్యకు సంబంధించి హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేసే వరకు సభలో కార్యకలాపాలను అడ్డుకుంటామని రిజిజుతో రాహుల్ చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రాహుల్‌తో సమావేశం అనంతరం, కిరణ్ రిజిజు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, హోం మంత్రి అమిత్ షాలను కలిశారు. రాబోయే రోజుల్లో ప్రతిపక్షాన్ని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగుతాయని కిరణ్ రిజిజు అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్‌తో సహా ప్రతిపక్ష నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు.
తృణమూల్ కాంగ్రెస్, శివసేనలోని ఉద్ధవ్ థాకరే వర్గం మధ్య చీలిక (ఈ వర్గం నుంచి పలువురు ఎంపిలు ఎన్‌డిఎలోకి వచ్చారు), ఇండియా బ్లాక్ నుంచి డిఎంకె దూరంగా ఉండటం వంటి అంశాలు బిల్లు ఆమోదానికి అనుకూల పరిస్థితులను సృష్టిస్తాయని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లును ఆమోదింపజేయడంలో సహాయపడాలని ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలను అభ్యర్థిస్తోంది. బిల్లుకు మద్దతు ఇవ్వలేకపోతే ఓటింగ్‌కు దూరంగా ఉండి సహకరించాలని ప్రభుత్వం డిఎంకెను కోరింది. ఎన్‌సిపి శరద్ పవార్ వర్గం మద్దతును కూడగట్టడానికి కూడా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ బిల్లు మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించలేక గతంలోనే లోక్‌సభ వీగిపోయింది. డీలిమిటేషన్ బిల్లుపై ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తోందన్న వార్తలపై కాంగ్రెస్ ఎంపి కెసి వేణుగోపాల్ స్పందిస్తూ “మాకేమీ తెలియదు. ప్రత్యేక సమావేశం ఉద్దేశ్యం ఏమిటి? ఈరోజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు డీలిమిటేషన్‌పై చర్చించడానికి, ప్రతిపక్షాల వైఖరి తెలుసుకోవడానికి మమ్మల్ని కలిశారు. డీలిమిటేషన్‌పై మా వైఖరి చాలా స్పష్టం. గత పార్లమెంట్ సమావేశాల్లో మా వైఖరి ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు.








కామెంట్‌లు (0)