వేర్వేరుగా తరలివచ్చిన జగన్, షర్మిల
ప్రజాశక్తి - వేంపల్లె (వైఎస్‌ఆర్ కడప జిల్లా) : మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద బుధవారం ఆయన తనయుడు జగన్, కూమార్తె, పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల వేర్వేరుగా నివాళులర్పించారు. తండ్రి సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పులివెందులలో బస చేసిన జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు మార్గాన ఉదయం ఎనిమిది గంటలకు ఇడుపులపాయకు చేరుకుని రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద తల్లి విజయమ్మ, సతీమణి భారతి, వైఎస్ఆర్ సోదరుడు సుధీకర్ రెడ్డి, కడప ఎంపి అవినాష్ రెడ్డిలతో కలిసి పుష్పాంజలి ఘటించారు. . వైఎస్ఆర్ ప్రజాసేవను, ఆయన అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఈ సందర్భంగా జగన్ గుర్తుచేసుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ ఘాట్ సమీపంలోనే ఉన్న వైఎస్ఆర్ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత 8.45 గంటలకు హెలికాప్టర్‌లో బెంగుళూరుకు జగన్ బయలుదేరారు. జగన్ వెళ్లిన తర్వాత గెస్ట్ హౌస్ లో ఉన్న పిసిసి అధ్యక్షులు షర్మిల తన తల్లి విజయమ్మతో కలిసి తొమ్మిది గంటలకు వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. నివాళులర్పించిన వారిలో రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసిపి కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ మాధవరావు, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు అంజాద్ బాష, శ్రీకాంత్ రెడ్డి, కొరముట్ల శ్రీనువాసులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రఘరామిరెడ్డి, తొపుదుత్తి ప్రకాష్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.









కామెంట్‌లు (0)