- తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి విడుదల
- 50 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను తెరుస్తాం
- గ్రూప్ సిఎండి మోహన్ శ్యామ్ ప్రసాద్ వెల్లడి
ప్రజాశక్తి – బిజినెస్ బ్యూరో : పప్పులు, ధాన్యాల విక్రయాల్లో ఉన్న తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ తాజాగా తృణ ధాన్యాల ఉత్పత్తుల విభాగంలోకి మిల్లెట్ మార్వెల్స్ పేరుతో ప్రవేశించింది. ఈ బ్రాండ్ కింద ధాన్యాలు, నూడుల్స్, కుకీస్, రెడీ టు కుక్ విభాగంలో 18 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది. వీటిని గురువారం హైదరాబాద్‌లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి, తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ సిఎండి మోహన్ శ్యామ్ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్బంగా శ్యామ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ.. వీటిని తొలుత తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. గడిచిన 2024-25లో తమ గ్రూప్ ఆదాయం తొమ్మిది శాతం పెరిగి రూ.535 కోట్లుగా నమోదయ్యిందన్నారు. మిల్లెట్స్ ఆవిష్కరణలతో ఈ ఏడాది ఆదాయంలో 15 శాతం వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏడాదిలో తెలుగు రాష్ట్రాల్లో 25 చొప్పున మొత్తంగా 50 ప్రత్యేక అవుట్‌లెట్‌లను తెరువాలని నిర్దేశించుకున్నామన్నారు. ప్రస్తుతం ఎపిలో ఐదారు ఉన్నాయన్నారు. ఫ్రాంచైజీ పద్దతిలోనూ స్టోర్లను ఇవ్వనున్నామన్నారు. తెనాలిలోని తమ తయారీ యూనిట్‌లో గంటకు 18 టన్నుల ఉత్పత్తులను ప్రాసెస్ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఆర్గానిక్ ఉత్పత్తుల్లోకి ప్రవేశించనున్నామన్నారు. తమ ఉత్పత్తులు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో లభిస్తాయన్నారు.