నాదెండ్లకు ఛాన్స్‌ దక్కేనా..?

May 13,2024 00:26 #Tenali

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి :ఆంధ్రా ప్యారిస్‌ తెనాలిలో ఈసారి వైసిపి, జనసేన అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. వైసిపి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ పోటీ చేస్తుండగా, ఎన్‌డిఎ కూటమి నుంచి జనసేన అభ్యర్థిగా మాజీ స్పీకరు నాదెండ్ల మనోహర్‌ పోటీ చేస్తున్నారు. నామినేషన్‌ దాఖలులో దొర్లిన సాంకేతిక సమస్యలతో ఇక్కడ ఇండియా బ్లాక్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి పోటీలో లేరు. కాంగ్రెస్‌ స్థానంలో సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ అభ్యర్థి చావల గోపాల్‌కు ఇండియా బ్లాక్‌ మద్దతు ఇచ్చింది. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ప్రాతినిధ్యం వహించిన తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగా ఆయన కుమారుడు మనోహర్‌ పోటీ చేస్తున్నారు. పొత్తులో జనసేనకు ఈ సీటు కేటాయించడంతో తొలుత టిడిపికి చెందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ తరువాత క్రమంగా అసమ్మతి నేతలకు సీనియర్‌ నేతలు సర్దిచెప్పారు. ప్రస్తుతం టిడిపి, జనసేన, బిజెపి కలిసి పనిచేస్తున్నాయి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ కూడా ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ బిజెపితో పొత్తు వల్ల ఈ నియోజకవర్గంలో జనసేనకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ
2004, 2009లో కాంగ్రెస్‌ తరపున గెలుపొందిన నాదెండ్ల మనోహర్‌ తెనాలిలో జరిగిన అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్నారు. స్పీకరుగా ఉన్నప్పుడు దాదాపు రూ.1000 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేసినట్టు ఆయన చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసి ఓడిపోయిన నాదెండ్ల మనోహర్‌ ఈసారి టిడిపి మద్దతుతో పోటీ చేయడం వల్ల తన గెలుపు ఖాయం అని భావిస్తున్నారు. అంతేగాక ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం వల్ల తనకు సానుకూలత ఉన్నట్టు మనోహర్‌ చెబుతున్నారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా 28,900 ఓట్లు సాధించగా, టిడిపి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌కు 76,846 ఓట్లు వచ్చాయి. వైసిపి అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ 17,649 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. టిడిపి, జనసేన ఓట్లతోపాటు ప్రభుత్వంపై వివిధ తరగతుల ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందని మనోహర్‌ భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని వైసిపి అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ తెలిపారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో వైసిపి, జనసేన అభ్యర్థుల మధ్య పోటీ నువ్వా.. నేనా.. అన్నట్టు ఉంటుంది.
కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ అభ్యర్థి చావల గోపాల్‌కు ప్రజల ఆదరణ లభిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలపై ప్రభావం చూపనున్నారు.

➡️