జోక్యం చేసుకోలేం

  • శాసన, కార్యనిర్వాహక శాఖలదే బాధ్యత
  • ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ, క్రిమిలేయర్‌ తీర్పు అమలుపై సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణ, క్రిమిలేయర్‌ విషయంలో గతేడాది ఆగస్టులో వెలువర్చిన చారిత్రాత్మక తీర్పు అమలుపై ప్రభుత్వాలను ఆదేశించే విషయంలో సుప్రీంకోర్టు తన అభ్యంతరాలను పునరుద్ఘాటించింది. దీనిపై చర్య తీసుకోవాల్సిన బాధ్యత శాసనసభ, కార్యనిర్వాహక శాఖపై ఉన్నదని సర్వోన్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలలోని ‘క్రిమిలేయర్‌’ అభ్యర్థులు రిజర్వేషన్‌ ప్రయోజనాలు పొందకుండా నిరోధించటం, ఎస్సీ, ఎస్టీ సమూహాలలో ఉపవర్గీకరణ ద్వారా ఈ ప్రయోజనాలను అత్యంత వెనుకబడిన వర్గాలకు విస్తరించటానికి అనుమతించటమే సుప్రీంకోర్టు తీర్పు లక్ష్యం.

సుప్రీంకోర్టు మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ.. భారత్‌లో పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వివాదాస్పద సమస్య పరిష్కారంలో ముందుకు రావటంలేదు. ముఖ్యంగా, దళిత వర్గాలలోని కొన్ని అమలును సమర్థించటం, మరికొన్ని వ్యతిరేకిస్తుండటమే దీనికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో సుప్రీంకోర్టు తీర్పు అమలు క్లిష్టమైందని అంటున్నారు. ఈ పరిస్థితుల నడుమ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రాష్ట్రస్థాయి నియామక ప్రక్రియల్లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసేలా ఆదేశాలివ్వాలంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

పిటిషనర్‌ తరఫున అడ్వొకేట్‌ సిద్ధార్థ గుప్తా వాదనలు వినిపించారు. అన్ని ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థ(పీఎస్‌యూ)లు ఎస్సీ, ఎస్టీ సమూహాల్లోని క్రిమిలేయర్‌ వ్యక్తులకు రిజర్వేషన్‌ ప్రయోజనాలను తక్షణమే ఆపాలంటూ వాదించారు. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బి.ఆర్‌ గవారు, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మసిV్‌ాలతో కూడిన ధర్మాసనం స్పందించింది. విధాన మార్పుల అమలులో న్యాయవ్యవస్థ పరిమితులను ధర్మాసనం స్పష్టం చేసింది. గత 75 ఏండ్ల అనుభవంతో తాము తమ అభిప్రాయాన్ని తెలిపామనీ, నిర్ణయం తీసుకోవాల్సింది శాసన, కార్యనిర్వాహక శాఖలదేనని వివరించింది.

విధానపరమైన నిర్ణయాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోకూడదన్న అటార్నీ జనరల్‌ ఆర్‌. వెంకటరమనీ వాదనను సుప్రీంకోర్టు ధర్మాసనం హైలెట్‌ చేసింది. ఈ సమస్య పరిష్కారంలో చట్టాలను రూపొందించే అధికారం శాసనసభ్యులకు ఉన్నదని జస్టిస్‌ గవారు నొక్కి చెప్పారు. అవసరమైన చర్యలు తీసుకోవటం ఎన్నికైన ప్రతినిధుల బాధ్యత అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సంచలన తీర్పు వెలువరించిన ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్‌ గవారు కూడా ఉన్న విషయం విదితమే.

➡️