- మార్చి నుండి అమలు
- మిట్టల్ స్టీలు ప్లాంటుకు 7ఎంటిల ఇనుప గనులు
- 2047 నాటికి 2.74ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం
- విలేకరుల సమావేశంలో చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పబ్లిక్-ప్రైవేట్-పీపుల్స్-పార్టనర్‌షిప్(పి4) విధానం రాష్ట్రంలో గేమ్ ఛేంజర్‌గా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. జిఎస్‌డిపి పై సచివాలయంలో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో తాను అమలు చేసిన పి3 (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానం సంపదను సృష్టించడంలో గేమ్ ఛేంజర్‌గా నిలిచిందని, ఇప్పుడు ప్రజలను ఆర్థికంగా పైకి తేవడానికి పి4 గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. అత్యంత ధనికులుగా ఉన్నవారు పేదరికంలో ఉన్నవారిని నిరంతరం ఆదుకొని ఆర్ధిక అసమానతలు తగ్గించాలని చెప్పారు. తొలిదశలో అత్యంత నిరుపేదలుగా ఉన్న 12 లక్షల మందికి పి4 విధానం అమలు చేస్తామని చెప్పారు. విశాఖపట్నంలో రానున్న మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు 12 నుంచి 14 మిలియన్ మెట్రిక్(ఎంటి) టన్నుల ఇనుప గనులు కేటాయించాలని జాతీయ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండిసి)ని కోరినట్లు చంద్రబాబు చెప్పారు. ఈ విజ్ఞప్తికి స్పందించిన ఎన్‌ఎండిసి ఏడు మిలియన్ టన్నుల మేరకు గనులు కేటాయించడానికి అంగీకరించిందని తెలిపారు. సంపద సృష్టిలో భాగంగా సుమారు 4లక్షల కోట్లు పెట్టుబడులు ఈ ఏడాది వచ్చాయని, వృద్ధి రేటు 12.94శాతంకు చేరిందని అన్నారు. 2047 నాటికి 2.74 ట్రిలియన్ డాలర్ల ఆర్ధిక వ్యవస్థగా రాష్ట్రాన్ని మార్చడమే తమ లక్ష్యమని వెల్లడించారు. వృద్ధి రేటు 15శాతం సాధిస్తే తలసరి ఆదాయం రూ.58,14,916లకు చేరుకుంటుందని చెప్పారు. జియో ట్యాగింగ్ ద్వారా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా అమలు చేస్తున్న పథకాలను అనుసంధానం చేస్తామన్నారు. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పిజి) కాకుండా పైప్‌డ్ నాచురల్ గ్యాస్(పిఎన్‌జి)విధానం తీసుకొస్తామన్నారు. పిఎన్‌జిలో మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తుందని, దీనిద్వారా 15-20శాతం ఖర్చు తగ్గుతుందన్నారు. ప్రతి ఇంటికి ట్యాప్ వాటర్ అందిస్తామని చెప్పారు.రెండు రోజుల్లో వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించబోతున్నామని చెప్పారు. ప్రభుత్వాన్ని ట్రాక్‌లో పెడుతున్నామని చెప్పారు. రాజధాని అమరావతిని ట్రాక్‌లో పెట్టామని, పోలవరం ప్రాజెక్టు డయాఫ్రం వాల్‌ను కూడా ప్రారంభించబోతున్నామని తెలిపారు. రూ.12వేల కోట్లు కేంద్రం ఇస్తే పనులు ప్రారంభిస్తామన్నారు. పోలవరం పూర్తయ్యే సమయంలోనే పోలవరం నుంచి బనకచర్ల, గోదావరి-పెన్నా నదుల అనుసంధానం చేస్తామని వెల్లడించారు. వివిధ రంగాలకు సంబంధించిన పాలసీలను కూడా తీసుకువచ్చినట్లు తెలిపారు. రాష్ట్రానికి ఉన్న రుణాలను రీషెడ్యూల్ చేస్తామని, తద్వారా తద్వారా వడ్డీ ధరలు తగ్గుతాయని చెప్పారు. ఈ నెల 18వ తేదిన స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రచారం నిర్వహించబోతున్నామని, ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామన్నారు. ఒకప్పుడు జనాభా భారమని, ఇప్పుడు ఆస్తి అని చెప్పారు. దక్షిణ భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు క్షీణించడం ఆందోళన కలిగిస్తోందన్నారు.