కరుణ

Apr 3,2024 04:55 #jeevana

కార్తికేయ తన తండ్రితో కలిసి బజారుకు బయలు దేరాడు. తండ్రి చెయ్యి పట్టుకుని నడుస్తున్న కార్తికేయకు రోడ్డు మీద ఒక సంఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక చిన్న కుక్కపిల్ల రోడ్డు మీద పడివున్న ప్లాస్టిక్‌ కవరును నోట కరుచుకుని వస్తోంది. పాపం అది కవరును రోడ్డు పక్కకు తెచ్చి దాని ముడిని నోటితో విప్పటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. కానీ దాని వల్ల కావటం లేదు. కుక్కపిల్లను చూసిన కార్తికేయకు జాలి కలిగింది. దాని డొక్కలు లోపలికి పోయాయి. బాగా ఆకలి మీద ఉన్నట్లుంది. కాలి కింద కవరును పెట్టి నోటితో ముడి విప్పాలని ప్రయత్నిస్తోంది. కార్తికేయ తండ్రిని ఆపి కుక్కపిల్లను చూపించాడు. కుక్క పిల్ల దృష్టి అంతా కవరు ముడి మీదే ఉంది. ఎంత ప్రయత్నం చేసినా అది ముడి విప్పలేక పోతోంది.
దాని అవస్థ చూసిన కార్తికేయ తండ్రితో ”నువ్వు కవరు ముడి విప్పకూడదా!” అన్నాడు. అందుకు తండ్రి ”మనం దగ్గరకు వెళ్తే కరుస్తుందేమో!” అన్నాడు. ”లేదు నాన్నా! అది చిన్న కుక్కపిల్లేగా… మెల్లగా దగ్గరకు వెళ్లి కవరు ముడి విప్పుదాం” అన్నాడు కార్తికేయ.
ఇంతలో కార్తికేయకు కుక్క పిల్ల కరవకుండా ఒక ఆలోచన వచ్చింది. ”నాన్నా! నా జేబులో బిస్కట్లు ఉన్నాయి. వాటిని కుక్కపిల్ల ముందు వేస్తాను. అది బిస్కట్లు తింటుంటే నువ్వు కవరు ముడి విప్పొచ్చు” అన్నాడు. ఆ ఆలోచన బాగుంది అన్నాడు తండ్రి.
కార్తికేయ తన జేబులో వున్న బిస్కట్లను కుక్కపిల్ల ముందు వేయగా, అది తినటం ప్రారంభించింది. అదే సమయంలో కార్తికేయ తండ్రి కవరు ముడి విప్పదీశాడు. అందులో రొట్టె ముక్క కనపడింది. రొట్టెను కుక్కపిల్లకు కనపడేలా కవరు మీద పెట్టాడు. బిస్కట్లు తిన్న కుక్కపిల్లకు రొట్టె కనపడగానే గబగబా తినటం ప్రారంభించింది. కుక్కపిల్ల రొట్టె తినటంతో కార్తికేయ మనస్సు ఆనందంతో నిండిపోయింది. తండ్రి కార్తికేయను ప్రేమతో దగ్గరకు తీసుకున్నాడు.

– తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర,
94923 09100

➡️