శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి – ముఖ్యమంత్రికి సిపిఎం లేఖ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలో కొనసాగేలా శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఆదివారం లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్‌కు అవసరమైన తక్షణ సాయంగా రూ.11,400 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని తెలిపారు. శాశ్వత పరిష్కారం దిశగా ఇది మొదటి అడుగు అని, స్టీల్‌ప్లాంట్ నిలదొక్కుకోవాలంటే మరికొన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.
సెయిల్‌లో విలీనం చేసి దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్నది ప్రజల వాంఛ అని వివరించారు. కేంద్ర ఉక్కుశాఖ మంత్రి కుమారస్వామి ఈ అంశం భవిష్యత్తులో ఆలోచించాలని అన్నారని, అయితే, వెంటనే సెయిల్ లో విలీనం చేయడం ద్వారా పెట్టుబడి, మార్కెట్, గనుల సమస్యలు పరిష్కారమవుతాయని సూచించారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పలుకుబడిని ఉపయోగించి సెయిల్‌లో విలీనం జరిగే విధంగా చూడాలని చంద్రబాబును కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ స్థిరంగా లాభాలతో నడవాలంటే దానికి సొంత గనులు కావాలని తెలిపారు. ఇంతవరకు ప్రారంభమే కాని ఆర్సిలార్ మిట్టల్ ఫ్యాక్టరీకి కూడా గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరిన విషయాన్ని ప్రస్తావించారు. పైపులైన్ ద్వారా సరఫరా జరిగేందుకు వీలుగా సొంత పోర్టును కూడా అనుమతించారని పేర్కొన్నారు.
మరి విశాఖ ఉక్కుకు ఎందుకు గనులు కేటాయించరన్న ప్రశ్న ప్రజల్లో ఉదయిస్తున్నదని తెలిపారు. గనులు కేటాయించ కుండా సంక్షోభం నుంచి బయటపడటం కష్టమని ముఖ్యమంత్రికి కూడా తెలుసునని, కావున కేంద్ర ప్రభుత్వం తక్షణం గనులు కేటాయించే విధంగా పలుకుబడిని ఉపయోగించాలని కోరారు. ప్యాకేజీ ప్రకటించడంతోపాటు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సమస్యపై కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రకటన చేయలేదని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా కార్మికుల ఆందోళనకు ముగింపు పలకాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజాభీ ష్టానికి అనుగుణంగా ప్రైవేటీకరణను వ్యతిరేకించా యని తెలిపారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకుండా ప్రైవేటీకరణ ప్రమాదం తొలగిపోదని వివరించారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హృదయ స్పందనకు చిహ్నమని తెలిపారు. ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తన యావత్ పలుకుబడిని ఉపయోగించి ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర కేబినెట్ ఉపసంహ రించుకునే విధంగా చూడాలని కోరారు. నష్టాల నుంచి గట్టెక్కి ఇది ముందుకు నడపాలంటే అదొక్కటే అంతిమ పరిష్కారమని విజ్ఞప్తి చేశారు. ప్యాకేజీ పేరుతో సిబ్బంది కుదింపును ఆమోదించొద్దని కోరారు. వలంటరీ రిటైర్‌మెంట్ స్కీం ఉపసంహరింప చేసి, కాంట్రాక్టు వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అప్పుడే ఉత్పత్తి, ఉత్పాదకత పెరుగుతుందని, కార్మికులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడాలని కోరారు.