న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడిఉగ్రవాద దాడిని కాంగ్రెస్ ఖండించింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనలో నిఘా వైఫల్యం, భద్రతాలోపంపై దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పేర్కొంది. ఈ ఘటనను వినియోగించుకుంటూ మత ఘర్షణలు వ్యాప్తి చేసున్త బిజెపిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని పేర్కొంది. పహల్గాంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
గురువారం న్యూ ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశమైంది. ఈ దాడిని ఖండిస్తూ సమావేశం ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ చైర్‌పర్సన్ సోనియాగాంధీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పార్టీ నేత కె.సి. వేణుగోపాల్ హాజరయ్యారు.
పాకిస్తాన్ చేసిన పిరికి, ప్రణాళికాబద్ధమైన ఉగ్ర చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి . దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకున్నారు. అని సిడబ్ల్యుసి తీర్మానం పేర్కొంది. ఈ ఘటనను బిజెపి అధికారిక మరియు పరోక్ష మార్గాల (సోషల్‌మీడియా) ద్వారా అసమ్మతి, అపనమ్మకం, మత ఘర్షణలు వ్యాపించేందుకు వినియోగించుకుంటోందని మండిపడింది. ఈ రెచ్చగొట్టే చర్యల దృష్ట్యా ప్రశాంతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
”పహల్గాం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రాంతం. ఇక్కడ మూడంచెల భద్రత ఉంటుంది. కేంద్ర హోంశాఖ పరిధిలోని కేంద్ర పాలిత ప్రాంతంలో ఇటువంటి దాడికి దారితీసిన నిఘా వైఫల్యం, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ నిర్వహించడం అత్యవసరం. విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ ప్రశ్నలను లేవనెత్తాల్సి వుంది. దారుణంగా జీవితాలను నాశనం చేసిన కుటుంబాలకు నిజంగా న్యాయం జరిగే ఏకైక మార్గం ఇదే ” అని తీర్మానంలో పేర్కొంది. భారతదేశ సమగ్రతను నిలబెట్టేందుకు, పర్యాటకులను రక్షించడానికి నిస్వార్థంగా ప్రయత్నించి అమరులైన స్థానిక గుర్రపుస్వారీ వ్యక్తి, టూరిస్ట్ గైడ్‌లకు సిడబ్ల్యుసి నివాళులర్పించింది.