మతతత్వ విభజన రాజకీయాలొద్దు

బంగ్లాదేశ్‌లో హిందువులపైనా, బౌద్ధులు తదితర ఇతర మైనారిటీలపైన నిరంతరాయంగా సాగుతున్న దాడులు ఎంతో ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రజా వెల్లువ కారణంగా ఆగష్టు నెల మొదటి వారంలో షేక్‌ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆమె నిరంకుశ పాలన ముగిసింది గనక బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామిక వ్యవస్థ ఉదయిస్తుందని ఆశించారు. కాని మొదటి రోజులలో కల్లోలం హిందూ దేవాలయాలపై దాడులు దేశవ్యాపితంగా మైనారిటీలపై దాడుల వార్తలు వచ్చాయి. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుడుగా వున్న మహ్మద్‌ యూనస్‌ ఆ సమయంలో మైనార్టీలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అప్పటి నుంచి ఆ సంఘటనలు సాగుతూనే వున్నాయి. ఇప్పటికి చూస్తే మొత్తం 2000 హింసా ఘటనలు ఆధారాలతో సహా నమోదైనాయి. మైనార్టీ వర్గాలకు చెందిన తొమ్మిది మంది వరకూ చంపబడ్డారు
చిన్మయ కృష్ణదాస్‌ అనే హిందూ సన్యాసి అరెస్టు దేశద్రోహ నేరం బనాయింపు జరిగాక ఈ దఫా పరిస్థితి మరింత క్లిష్టతరమైంది. ఇదివరలో హరేకృష్ణ ఉద్యమం ఇస్కాన్‌తో ముడిపడివున్న ఈయన దాని నుంచి తొలగించబడి సమ్మిళిత సనాతని జాగరణ్‌ జోతే అనే సంస్థతో పనిచేస్తున్నారు. ఆయన తీవ్రమైన భావాలు వెలిబుచ్చిన మాట నిజమే అయినా బంగ్లాదేశ్‌ జాతీయ పతాకాన్ని కించపర్చిన కారణంగా అరెస్టు చేసి దేశ ద్రోహం ఆరోపణలు బనాయించడం అధికార దుర్వినియోగంతో చేసిన పని మాత్రమే. దాస్‌ను కోర్టులో హాజరుపర్చినప్పుడు బెయిలు లభించకపోవడంతో పోలీసులకు, ఆయన అనుయాయులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒక అసిస్టెంటు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దాడికి గురై మరణించారు. ప్రస్తుతం మత పరిస్థితి ఎంత ప్రమాదకరంగా వుందో దీన్ని బట్టే తెలుస్తుంది.

బంగ్లాదేశ్‌ ప్రభుత్వ తప్పిదం
తాత్కాలిక ప్రభుత్వం దాని ప్రతినిధులు ఈ దాడుల ఘటనలను తేలిగ్గా తీసేయజూస్తున్నారు. ఇవన్నీ అతిశయోక్తిగా చెబుతున్నవని కొట్టి పారేస్తున్నారు. అవామీ లీగ్‌ కార్యకర్తలపైన, వారి మద్దతుదారులపైన ప్రజాగ్రహం ఫలితమే ఇవన్నీ అన్నట్టు చిత్రిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ఈ ప్రచారం వెనక భారత ప్రభుత్వ హస్తం వుందన్నట్టు మాట్లాడుతున్నారు. మైనారిటీలపై ఇస్లామిక్‌ శక్తులు ఈ దాడులకు పాల్పడుతున్నాయనే వాస్తవాన్ని విస్మరించడం ద్వారా యూనస్‌ నాయకత్వంలోని ప్రభుత్వం తప్పు చేస్తున్నది.
షేక్‌ హసీనా ప్రభుత్వానికి మోడీ సర్కారు మద్దతునివ్వడం వల్ల నెలకొన్న భారత వ్యతిరేక భావనను మైనార్టీలపై దాడికి ఒక కవచంగా ఇస్లామిక్‌ చాందస శక్తులు ఉపయోగించు కుంటున్నాయి. జమాతే ఇస్లామీపై నిషేధం తొలగించడం, దాని నాయకులు జైళ్ల నుంచి బయటికి రావడంతో హిఫాజాతె ఇస్లాం వంటి మత చాందస సంస్థలు హిందువులను లక్ష్యంగా దాడులు చేయడానికి మత విభజన తీసుకురావడానికి పూర్తి స్వేచ్ఛ లభించింది. షేక్‌ హసీనా పాలన కాలంలో కూడా ఇలాంటి చాందస శక్తులు మైనార్టీలపై దాడులకు పాల్పడుతూనే వున్నారు. తమ ఒంటెత్తు విధానాలు రుద్దడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్న ఇలాంటి శక్తులను కఠినంగా అణచి వేయడం అవసరం. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం, ప్రజాస్వామిక శక్తులు కూడా ఈ సమయంలో నిలదొక్కుకోవడం అవసరం.

హిందూత్వ సంస్థల కవ్వింపు
ఈ పరిస్థితిలో భారత దేశంలో బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంకా అనేక ఇతర హిందూత్వ సంస్థల ధోరణి ఈ సమస్య పరిష్కార కృషికి సహాయపడేదిగా లేదు. హిందువుల దుస్థితి అంటూ ఈ సంస్థలు సరిహద్దు పొడుగునా విశృంఖలంగా రెచ్చగొట్టే ప్రచారం సాగిస్తున్నాయి. నూతనంగా ఏర్పడిన తమ రాజకీయ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నంగా అక్కడ బంగ్లాదేశ్‌లో అధికారులు, ప్రజాస్వామిక శక్తులు పరిగణిస్తున్నాయి. కోల్‌కతా, అగర్తలా, గౌహతిలలో బంగ్లాదేశ్‌ దౌత్య కార్యాలయాల ముందు కవ్వింపు భాషతో హిందూ తీవ్రవాద బృందాలు ప్రదర్శనలు జరపడం పరిస్థితి మరింత దిగజారడానికి కారణమైంది. అగర్తలాలో బంగ్లాదేశ్‌ సహాయ హైకమిషనర్‌ కార్యాలయ ఆవరణలోకి చచ్చుకు వెళ్లి ఆస్తుల విధ్వంసానికి పాల్పడటం ఆ దేశంలో భారత వ్యతిరేకతను మరింత ముదిరిపోయేలా చేయడానికే కారణమవుతుంది. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా తీవ్ర భాషలో దండకం చదవడం అక్కడ మైనార్టీల భద్రతకు ముప్పుగా తయారవుతుంది.

ద్వంద్వనీతి
భారత దేశంలో మైనారిటీలపై వేధింపులు, విద్వేష ప్రచారం సాగించే పాలకులు అదే మైనారిటీల రక్షణ గురించి నీతి బోధ చేస్తుంటే బంగ్లాదేశ్‌ ప్రజలు విస్తుపోతున్నారు. అగ్రశ్రేణి భారతీయ నేతలు, బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా తీవ్ర భాషలో పల్లవి ఆలపిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా జార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారంలో బంగ్లాదేశీయుల భారీ చొరబాటును గురించి అసత్యపూరితంగా తీవ్ర హెచ్చరికలు చేశారు. గతంలో ఆ చొరబాటుదారులనే ‘దేశ దిమ్మరులు’ అని ఆయన మాట్లాడారు.
మతతత్వ విభజన రాజకీయాలు ఇరు దేశాల ప్రయోజనాలకు నష్టదాయకంగా పరిణమిస్తాయని ఉభయ దేశాలలోని లౌకిక, ప్రజాస్వామిక శక్తులు నొక్కి చెప్పడం అవసరం. బంగ్లాదేశ్‌లో మైనారిటీల భద్రతను కాపాడటం కోసం, పౌరులుగా వారి హక్కులను పూర్తిగా రక్షించడం కోసం గట్టిగా నిలవాల్సిన బాధ్యత షేక్‌ హసీనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన లౌకిక, ప్రజాస్వామిక శక్తులపై వుంది.

(డిసెంబర్‌ 4 ‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

➡️