ప్రజలను భ్రమల్లో ముంచొద్దు

Jan 1,2025 00:10 #ap cpm, #cpm srinivasarao

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : కార్పొరేట్లకు లాభాలు దోచిపెడుతూ, మాయమాటలతో ప్రజలను భ్రమల్లో ముంచే విధానాలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మానుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాస రావు అన్నారు. ఫిబ్రవరి 1నుండి 3వ తేది వరకు నెల్లూరులో జరగనున్న సిపిఎం రాష్ట్ర మహాసభ లోగోను మంగళవారం ఆయన రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు, ఎం.సీతారాం, వి.వెంకటేశ్వర్లు, లోకనాధం, డి.రమాదేవి, కె.సుబ్బరావమ్మతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అయితే, ప్రజలు మాత్రం ఆనందంగా లేరని, వారి చేతుల్లో డబ్బులు లేవని అన్నారు. ప్రజల ఆదాయాన్ని పెంచే విధానాల గురించి ఆలోచిం చకుండా రాష్ట్ర ప్రభుత్వం వారిపై మరింతగా భారాలు ఎలా వేయాలని, కార్పొరేట్లకు భారీగా ఆదాయాలు ఎలా పెంచాలని ఆలోచిస్తోందని చెప్పారు. ఆదాయం పెంచుకోవడం కోసం ఎన్‌పోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పెడుతున్నారని వార్తలు వచ్చాయని, జిఎస్‌టి, టోల్‌టాక్స్‌ పెంచుతున్నారని, మరమరాలు, పాప్‌కార్న్‌ల మీద కూడా జిఎస్‌టి వేస్తున్నారని చెప్పారు. అదే సమయంలో ప్రజలను మభ్య పెట్టే మాటలు చెబుతున్నారని అన్నారు. ‘ప్రజల్లి మబ్బుల్లో విహరింపచేసే భ్రమలు సృష్టించవద్దు. గతంలో ఈ ట్రిక్కులు పనిచేశాయి. నమ్మారు.ఈ సారి పనిచేయవు’ అని అన్నారు. 2000 సంవత్సరంలో చంద్రబాబు అమలు చేసిన విద్యుత్‌ సంస్కరణలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ‘విద్యుత్‌ సంస్కరణలను తానే తీసుకువచ్చినట్లు బాబు ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పట్లో రాష్ట్ర ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించారు. నా ణ్యమైన విద్యుత్‌ వస్తుందని, ఛార్జీలు తగ్గు తాయని ఆప్పట్లో చెప్పారు. ఛార్జీలు ఎక్కడ తగ్గాయి? నాణ్యమైన విద్యుత్‌ ఎక్కడ వస్తోంది? విద్యుత్‌ ఉత్పత్తిదారులు లాభాలు పోగేసుకుంటుంటే, వాటి దుష్పలితాలను మనం ఇప్పటికీ అనుభ విస్తున్నాం.’ అని అన్నారు. చంద్రబాబు ఇప్పుడు కూడా కార్పొరేట్లకు దోచిపెట్టే విధానాలను అమలు చేస్తూ, ప్రజలను మాత్రం భ్రమల్లో ముంచెత్తు తున్నారని చెప్పారు. అయితే, ఆ మాటలు నమ్మే స్థితిలో ప్రజలు ఇప్పుడు లేరని అన్నారు. రాజధానిని భారీ ప్రాజెక్టుగా పెట్టుకోవద్దని, అవసరాల మేరకు పూర్తి చేసుకోవాలని 2014లోనే చెప్పినా బాబు పట్టించుకోలేదని, ఫలితంగా ఇప్పటికీ రైతులు అభద్రతా భావంలో బతకవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

గందరగోళంగా బనకచర్ల

చంద్రబాబు అట్టహాసంగా ప్రకటించిన గోదావరి-బనకచర్ల లింకు ప్రాజెక్టు అస్పష్టంగ, గందరగోళంగా ఉందని అన్నారు. 80 వేల కోట్ల రూపాయలతో పిపిపి పద్దతిలో మూడు సంవత్సరాల్లో పూర్తి చేస్తామంటూ బాబు చేసిన ప్రకటనను ఆయన ప్రస్తావించారు. పిపిపి పద్దతిలో సాగునీటి ప్రాజెక్టు ఎలా సాధ్యమవుతుంది? అని ప్రశ్నించారు.’ ‘వసూలు చేసుకుంటారు’ అని చెబుతున్నారు. ఎవరు వసూలు చేసుకుంటారు? ఎవరి నుండి వసూలు చేస్తారు? నీటిఛార్జీలు పెడతారా?’ అని అన్నారు. ‘రాయలసీమకు నీటిని తీసుకుపోవడానికి అన్ని పార్టీలు అంగీకరించిన పోతిరెడ్డిపాడు వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వాటన్నింటిని వదిలేసి ఇంత భారీ ఖర్చుతో ఈ ప్రాజెక్టును హడావిగా తెరమీదకు ఎందుకు తెస్తున్నారు? ‘ఈ ప్రాజెక్టుపై అఖిలపక్షం నిర్వహించాలి.. ప్రజలందరి ఆమోదంతో ముందుకు వెళ్లాలి’ అని డిమాండ్‌ చేశారు. అదే సమయంలో రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనితీరును ఆయన వివరించారు. 20 సంవత్సరాల క్రితం ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రారంభించిన హంద్రీ-నీవా ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, ఫలితంగా వరదలు వచ్చినప్పుడు అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున నీరు వృద్ధా అవుతోందని అన్నారు. ఉత్తరాంధ్రలో జంజావతి లాంటి ప్రాజెక్టులు రూ.50 కోట్లు రూ.100 కోట్లు పెడితే పూర్తవుతాయని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు రూ.1200 కోట్లు కేటాయిస్తే చాలని అన్నారు పోలవరం ఇప్పటికీ పూర్తికాలేదని, నిర్వాసితుల సంగతి పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ ప్రాజెక్టులన్నింటిపైనా అఖిలపక్షం నిర్వహించాలని కోరారు.

భూములపైనే కన్ను!

పారిశ్రామిక ప్రగతి గురించి 20 ఏళ్ల నుండి చెబుతున్నారు కానీ పరిశ్రమలు మాత్రం రావడం లేదని అన్నారు. అదే సమయంలో భూములు మాత్రం కార్పొరేట్‌ కంపెనీల పాలవుతున్నాయని అన్నారు. ఇది రాష్ట్రాభివృద్ధికి ఏమాత్రం మంచిది కాదని చెప్పారు. పంటలు పండే భూములను తీసుకుని బీడు పెడుతున్నారని అన్నారు. నక్కపల్లిలో 5,400 ఎకరాలు ఫార్మాసిటీ కోసం 20 ఏళ్లు క్రితం తీసుకున్నారని, ఇప్పటికీ ఒక్క ఫార్మా కంపెనీ రాలేదని తెలిపారు. దానిలో 3000 ఎకరాలను మిట్టల్‌కు కేటాయించి స్టీలు ప్యాక్టరీ పెట్టి విశాఖ స్టీలును దెబ్బతీస్తున్నారని అన్నారు. ఇప్పుడు మరలా బల్క్‌ డ్రగ్‌ ప్రాజెక్టని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ప్రజలపై భారాలు వేయడానికి లాంటి భ్రమలు సృష్టిస్తున్నారని తెలిపారు. కాకినాడలో అరబిందో ఫార్మా కంపెనీ కాలుష్యంపై మత్స్యకారులు ఆందోళనలు చేస్తున్నారని తెలిపారు. వాన్‌పిక్‌లో 20 వేల ఎకరాలు తీసుకున్నారని, నాలెడ్జ్‌ హబ్‌లోనూ, ప్రకాశం జిల్లాలో నిమ్జ్‌ పెడతామన్నారని ఒక్కటీ కూడా పెట్టలేదని విమర్శించారు. కొత్తగా రిలయన్స్‌కు ఐదు లక్షల ఎకరాలు ఇస్తామని చెబుతున్నారని, ఆ భూమిలో పంట పండిస్తే ఏడాకి రూ.5000 కోట్లు ఆదాయం వస్తుందన్నారు విశాఖలో 200 ఎకరాలు అదాని డేటా సెంటర్‌కు ఇచ్చారని, ఇప్పటి వరకూ పునాదిరాయి కూడా పడలేదని తెలిపారు. ఫ్యాక్టరీలు పెట్టకుండా ఖాళీగా ఉన్న భూములను వెనక్కు తీసుకుని రైతులకు ఇచ్చేయాలని డిమాండు చేశారు.

పవన్‌వి నిజాయితీ లేని విమర్శలు ఏ రూపంలో ఉన్నా మతోన్మాదాన్ని ఎదుర్కుంటున్నాం

హైదరాబాద్‌లో ఎంఐఎం ఏదో వ్యాఖ్యలు చేసిందని చెబుతూ వాటిపై కమ్యూనిస్టులు కూడా స్పందించలేదంటూ జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చేసిన విమర్శలపై వి. శ్రీనివాసరావు తీవ్రంగా స్పందించారు. ‘ఇది చాలా అన్యాయమైన, నిజాయితీ లేని విమర్శ’ అని ఆయన అన్నారు. మతోన్మాదం ఏ రూపంలో ఉన్నా దానిని తాము మాత్రమే ఎదుర్కుంటున్నామని వి.శ్రీనివాసరావు చెప్పారు. ‘హిందూ మతోన్మాదమైనా, ముస్లింమతోన్మాదమైనా ఏ రూపంలో ఉన్నా మేం ఎదుర్కుంటున్నాం. మేమే దాన్ని ఎదుర్కుంటున్నాం, వాళ్లు కాదు’ అని ఆయన అన్నారు,2019లో జనసేన, సిపిఎం పొత్తు ఉన్న సమయంలో ఓల్డ్‌ సిటీలో ఎంఐఎంను ఎదుర్కొన్న దమ్ము సిపిఎంకు మాత్రమే ఉందని పవన్‌ కల్యాణ్‌ పదేపదే చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అప్పటి పార్టీ కార్యదర్శిగా ఉన్న పి. మధు ఎంఐఎంను ఎదుర్కుని చేసిన పోరాటం గురించి, పాతబస్తీలో సభ పెట్టి ఎంఐఎంను నిలదీసిన విషయం గురించి పవన్‌కల్యాణ్‌ అప్పట్లో పదేపదే చెప్పేవారని ఆయన అన్నారు. ఇతర పార్ట్లీల నాయకులు కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంటారని అన్నారు. 2012లో ఎంఐఎం పవన్‌కల్యాణ్‌ చెప్పిన వ్యాఖ్యలు చేసిందని, ఆ వ్యాఖ్యలను ఇటీవల .జరిగిన ఎన్నికల్లో హైదరాబాద్‌లో బిజెపి తరపున పోటీచేసిన మాధవీలత ఉపయోగించుకుని లబ్ధి పొందడానికి ప్రయత్నించారని అన్నారు. కొత్తగా ఆర్‌ఎస్‌ఎస్‌ మతం తీసుకున్న పవన్‌ కల్యాణ్‌ అవే మాటలు ఇప్పుడు చెబుతున్నారని అన్నారు. ఎంఐఎంను పావుగా ఉపయోగించుకుని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లో బీహార్లో బిజెపి గెలిచిందని, లెక్కలు పరిశీలిస్తే ఇదే విషయం తేలుతుందని అన్నారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన పవన్‌ కల్యాణ్‌ లౌకికవాదం హిందువులకేనా అని ప్రశ్నించడం అవమానకరమని అన్నారు. రాజ్యాంగం అన్ని మతాలకు ఒకటేనని, మతాల ప్రమేయం లేకుండా ప్రభుత్వ వ్యవహారాలు నిర్వహించాలనే లౌకిక వాదం చెబుతుందని వివరించారు. దేశంలో మెజార్టీ మతంగా ఉన్న హిందువులకు మైనార్టీలను కాపాడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అయితే, ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిలు హిందువుల్లో అసత్యాలను ప్రచారం చేస్తూ వారిలో భయాందోళనలను రేకేత్తిసున్నాయని ఆయన అన్నారు. దీనిని ఎదుర్కోవడానిక బదులుగా పవన్‌కల్యాణ్‌ బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి జరుగుతోందని మాట్లాడుతున్నారని అన్నారు. అక్కడి కమ్యూనిస్తు పార్టీ దాడులను ఖండించడంతోపాటు హిందువుల కోసం పోరాడుతోందని చెప్పారు. సిపిఎం కూడా ఖండించిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, మన దేశంలోని మణిపూర్‌లో జరుగుతున్న దాడుల పై ప్రధానమంత్రి మోడీతో పాటు పవన్‌ కల్యాణ్‌ కూడా మాట్లాడటం లేదని చెప్పారు. ‘మణిపూర్‌ ప్రజలు భారతీయులు కారా? వారి గురించి ఎందుకు మాట్లాడరు?’ అని ప్రశ్నించారు. భారతరత్న అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అవమానించేలా మాట్లాడినా పవన్‌కల్యాణ్‌ ఖండించకపోవడం అన్యాయమని చెప్పారు. నిజాయితీగా మాట్లాడాలని, ఇషం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అన్నారు.

➡️