- 18న మైదుకూరులో ప్రారంభించనున్న సిఎం
- సిఎస్ విజయానంద్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రతి నెలా 3వ శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ తెలిపారు. సచివాలయం నుంచి కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 18వ తేదీన కడప జిల్లా మైదుకూరులో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఈ నెల నుంచి 12 నెలల పాటు నెలకో థీమ్‌తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెలలో న్యూ ఇయర్ – క్లీన్ స్టార్ థీమ్‌తోను, ఫిబ్రవరిలో సోర్సు – రిసోర్సు, మార్చిలో అవైడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ – ప్రమోట్ రీయూజబుల్స్ వంటి థీమ్‌లను అమలు చేయాలన్నారు. కార్యక్రమ నిర్వహణలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలు కీలక భూమిక పోషించాలని చెప్పారు. ఈ సమావేశంలో వర్చువల్‌గా పాల్గొన్న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ… క్యాంపెయిన్ మోడ్‌లో కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అందుకు తగ్గట్టుగా కలెక్టర్లు తగిన ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. సమావేశంలో పిఆర్ అండ్ ఆర్డీ ముఖ్య కార్యదర్శి శశిభూషన్, సిఎం కార్యదర్శి ప్రద్యుమ్న, స్వచ్ఛాంద్ర కార్పోరేషన్ ఎండి అనిల్ కుమార్ రెడ్డి, పురపాలక శాఖ కార్యదర్శి కన్నబాబు, పిఆర్ అండ్ ఆర్డీ కమిషనర్ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.