సిఎం చంద్రబాబు ఆదేశం
టీచర్ల సంఘాల హర్షం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సిపిఎస్) ఉద్యోగులను గ్యారంటి పెన్షన్ స్కీం (జిపిఎస్)లోకి తీసుకొస్తూ విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌ను నిలిపివేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. జిపిఎస్ అమల్లోకి తీసుకొస్తూ ఈ నెల 12వ తేదిన ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గెజిట్ విడుదలపై సిఎం చంద్రబాబు సోమవారం ఆరా తీశారు. గత ప్రభుత్వ ప్రతిపాదనలతో ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దల దృష్టిలో లేకుండా గెజిట్ ఎలా వచ్చిందని, ఈ అంశంపై విచారణ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. సిఎం ఆదేశాలతో గెజిట్ నిలుపుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు విడుదలవుతాయని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. గెజిట్ నోటిఫికేషన్ నిలిపివేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం పట్ల పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. తమ పోరాట ఫలితంగానే గెజిట్‌ను రద్దు చేశారని యుటిఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ వెంకటేశ్వర్లు, కెఎస్‌ఎస్ ప్రసాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సిపిఎస్, జిపిఎస్ కాకుండా పాత పెన్షన్ అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలను నెరవేర్చే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించాలని కోరారు. గెజిట్ నోటిఫికేషన్ నిలుపుదలపై ఎపిసిపిఎస్‌ఇఎ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె సతీష్, సిఎం దాస్, టిఎన్‌యుఎస్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు, బిటిఎ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మనోజ్‌కుమార్, చిట్టేటి రమేష్, ఆప్టా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణపతి రావు, ప్రకాష్‌రావులు హర్షం వ్యక్తం చేస్తూ వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. సిఎం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎపిజెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరావు మరోప్రకటన విడుదల చేశారు.
