ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్ర వైద్యశాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్లుగా చేరిన వారికి పిజి వైద్య విద్యను అభ్యసించేందుకు వీలుగా నిబంధనలను మార్చడాన్ని హైకోర్టు సమర్థించింది. పిజి మెడికల్ విద్య చదివేందుకు వీలుగా ఇన్ సర్వీస్ కోటా నిబంధనలను మార్పు చేస్తూ గతేడాది జులై 20న ప్రభుత్వం జిఒ 85ను జారీ చేసింది. ఇన్ సర్వీస్ కోటా కింద రిజర్వేషన్ సీటు పొందాలంటే నీట్ పిజి, సూపర్ స్పెషాలిటీ పరీక్ష నోటిఫికేషన్ జారీ అయ్యే నాటికి వయసు 50 సంవత్సరాలు మించకూడదంటూ నిబంధనలు సవరించారు. దీనిపై జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. పిజి కోర్సు పూర్తి చేశాక రాష్ట్రంలో పదేళ్ల పాటు సేవలు అందించాలనే నిబంధనను ఆమోదించింది. ఇన్ సర్వీసు కోటా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే జరిమానాను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచడాన్ని సైతం సమర్థిస్తూ ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ రావు రఘునందనరావు ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది వెలువరించింది. ఇన్ సర్వీస్ కోటాను తగ్గిస్తూ ( వయో పరిమితి, సర్వీసు కాల వ్యవధి, జరిమానా మొత్తం పెంపు వంటి సవరణలు) రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ 85ను సవాల్ చేస్తూ మేదరమెట్ల ప్రైమరీ హెల్త్ సెంటర్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ జి.చిట్టిబాబు హైకోర్టులో వ్యాజ్యాన్ని వేశారు. దీనిపై హైకోర్టు, ఇన్ సర్వీసు కోటాను తగ్గించారన్న కారణంతో జిఒ 85ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను గతంలోనే కొట్టేసినట్లు హైకోర్టు గుర్తు చేసింది.
