పడిపోతున్న రాష్ట్రాల ఆదాయం

Jan 11,2025 03:44 #falling states, #Income, #mooney
  • గ్రాంట్ల కోసం కేంద్రం వైపు ఎదురుచూపులు
  • పన్నుల రూపంలో వచ్చేది 50 శాతం కంటే తక్కువే
  • పన్నేతర రెవెన్యూలోనూ భారీగా తగ్గుదల

న్యూఢిల్లీ : రాష్ట్రాల ఆదాయం పడిపోతుండడంతో అవి కేంద్రం బదిలీ చేసే నిధులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల మొత్తం ఆదాయంలో పన్నేతర రెవెన్యూ వాటా 24 శాతం కంటే తగ్గే అవకాశం ఉంది. గత పాతిక సంవత్సరాల కాలంలో ఇలా ఎన్నడూ జరగలేదు. గత దశాబ్ద కాలంలో (2015-16 నుండి 2024-25 వరకూ) కేంద్రం నుండి బదిలీల రూపంలో పొందిన మొత్తం రెవెన్యూలో రాష్ట్రాల వాటా గణనీయంగా పెరిగిందని రిజర్వ్‌బ్యాంక్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2000వ దశకంలో రాష్ట్రాల రెవెన్యూలో కేంద్రం చేసిన బదిలీలు 20-24 శాతం ఉంటే 2010వ దశకంలో 23-30 శాతానికి పెరిగాయి.

కేంద్ర గ్రాంట్లే అధికం

కేంద్రం ఇచ్చే గ్రాంట్లపై రాష్ట్రాలు ఆధారపడడం పెరుగుతున్న పన్నేతర ఆదాయంలో స్పష్టంగా కన్పిస్తోంది. గత దశాబ్ద కాలంలో రాష్ట్రాల పన్నేతర ఆదాయంలో 65-70 శాతం కేంద్ర గ్రాంట్ల నుండే వస్తోందని ఆర్‌బిఐ తెలిపింది. 2000లో రాష్ట్రాల పన్నేతర ఆదాయంలో 55-65 శాతం మాత్రమే కేంద్ర గ్రాంట్లు ఉండేవి. అదే సమయంలో గ్రాంట్లు కాకుండా పన్నేతర వనరుల ద్వారా రాష్ట్రాలకు వచ్చిన ఆదాయం పడిపోయింది.

రాష్ట్రాల జిఎస్‌టిపై వివాదం

ఆర్‌బిఐ నివేదిక ప్రకారం రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం 50 శాతం కంటే తక్కువగానే ఉంటోంది. 2000వ దశకం నుండి 2010 వరకూ ఈ ఆదాయం 50 శాతం కంటే కొంత ఎక్కువగా ఉండడమో లేదా 50 శాతానికి దగ్గరగా ఉండడమో జరుగుతోంది. రాష్ట్రాల సొంత పన్ను ఆదాయ వనరుల్లో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు, మోటారు వాహనాల పన్ను, రాష్ట్ర జిఎస్‌టి (ఎస్‌జిఎస్‌టి) ఉంటాయి. 2017-18లో రాష్ట్రాల మొత్తం ఆదాయంలో ఎస్‌జిఎస్‌టి 15 శాతంగా ఉంది. ప్రస్తుతం అది 22 శాతంగా ఉంటోంది. రాష్ట్రాల జిఎస్‌టిని మినహాయిస్తే రాష్ట్రాల సొంత పన్ను ఆదాయం 34 శాతం నుండి 28 శాతానికి పడిపోయింది. అయితే జిఎస్‌టి మండలి నిర్ణయించే రాష్ట్రాల జిఎస్‌టిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తోంది. జిఎస్‌టి మండలి తీసుకున్న నిర్ణయాలను తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌ సహా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు తప్పుపట్టారు.

ఈ ఆదాయమూ తక్కువే

గత దశాబ్ద కాలంలో రాష్ట్రాల పన్నేతర ఆదాయంలో వడ్డీ వసూళ్లు కూడా ఐదు శాతం కంటే తక్కువగానే ఉంటున్నాయి. 2000వ దశకంలో ఈ వసూళ్లు 5-9 శాతం మధ్య ఉండేవి. 2010వ దశకం ప్రారంభం వరకూ ఆ వసూళ్లే కొనసాగాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల నుండి డివిడెండ్లు, లాభాలు ఒక శాతం కంటే తక్కువగానే ఉంటున్నాయి.
గడచిన దశాబ్ద కాలంలో ప్రజారోగ్యం, విద్యుత్‌ వంటి సేవల నుండి ఆదాయం కూడా 30 శాతం దాటలేదు. ఇదిలా వుండగా అనేక రాష్ట్రాల్లో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి)తో వాటి సొంత పన్ను ఆదాయ నిష్పత్తి తగ్గిపోయింది. తమిళనాడు దామాషా 7.72 శాతం (2013-15) నుండి 6.17 శాతానికి (2022-24) తగ్గింది. కర్ణాటక, కేరళ, బీహార్‌, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి. మహారాష్ట్ర, మణిపూర్‌, మేఘాలయ, ఒడిశా, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల దామాషా మాత్రం మెరుగుపడిందని ఆర్‌బిఐ నివేదిక తెలిపింది.

➡️