ఎగిసిన భారత వాణిజ్య లోటు

May 15,2024 20:56 #Business, #Gold
  • ఏప్రిల్‌ 19.1 బిలియన్‌ డాలర్లుగా నమోదు
  • దిగుమతుల్లో 10% పెరుగుదల
  • బంగారం భారీగా రాక
  • ఎగుమతులు డీలా..

న్యూఢిల్లీ : ప్రపంచ మార్కెట్‌లో భారత సరుకులకు డిమాండ్‌ తగ్గుతోంది. మరోవైపు దేశ దిగుమతులు మాత్రం అమాంతం పెరుగుతున్నాయి. దీంతో భారత వాణిజ్య లోటు ఎగిసి పడుతోంది. ప్రస్తుత ఏడాది ఏప్రిల్‌లో సరుకుల వాణిజ్య లోటు 19.1 బిలియన్‌ డాలర్లకు చేరిందని వాణిజ్య శాఖ సెక్రటరీ సునీల్‌ బర్త్వాల్‌ బుధవారం తెలిపారు. ఇంతక్రితం మార్చిలో 15.6 బిలియన్‌ డాలర్ల వాణిజ్య లోటు చోటు చేసుకుంది. కాగా.. గడిచిన ఏప్రిల్‌లో భారత ఎగుమతులు కేవలం 1.06 శాతం పెరిగి 34.99 బిలియన్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో 34.62 బిలియన్ల ఎగుమతులు జరిగాయి. ఇదే సమయంలో 49.06 బిలియన్లుగా ఉన్న దిగుమతులు మాత్రం.. 2024 ఏప్రిల్‌లో మాత్రం 10 శాతం ఎగిసి 54.09 బిలియన్లకు చేరాయని ప్రభుత్వ గణంకాలు వెల్లడించాయి. ”కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ గణంకాలు బాగున్నాయి. ఏడాది మొత్తం ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం.” అని భర్త్వాల్‌ పేర్కొన్నారు. 2024 మార్చిలో ఎగుమతులు స్వల్పంగా తగ్గి 41.68 బిలియన్లుగా నమోదయ్యాయి.

పసిడి దిగుమతులు రెట్టింపు..
పసిడి ధరలు ఎగిసిపడుతున్నప్పటికీ.. ఆ లోహం దిగుమతులు అమాంతం పెరిగాయి. గడిచిన నెలలో బంగారం దిగుమతులు రెట్టింపు అయ్యాయి. 2024 మార్చిలో 1.53 బిలియన్‌ డాలర్ల పసిడి దిగుమతులు నమోదు కాగా.. ఏప్రిల్‌లో 3.11 బిలియన్‌ డాలర్లకు ఎగిశాయి. మార్చిలో 17.23 బిలియన్లుగా ఉన్న చమురు దిగుమతులు.. ఏప్రిల్‌లో 16.46 బిలియన్లుగా నమోదయ్యాయి.
బంగారం దిగుమతులు పెరగడం పొరపాటేమీ కాదని.. సగటు ట్రెండ్‌తో సరిపోతుందని వాణిజ్య కార్యదర్శి బార్త్వాల్‌ పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ వైరుధ్యాల మధ్య అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్‌ పెరగడం సాధారణమేనని అన్నారు. ముఖ్యంగా అనిశ్చితులకు ప్రతిస్పందనగా ప్రపంచవ్యాప్తంగా అనేక సెంట్రల్‌ బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయని తెలిపారు.
మార్చితో ముగిసిన ఏడాదిలో భారత విదేశీ మారకం నిల్వల్లో బంగారం వాటా 8.15 శాతానికి చేరింది. సెప్టెంబర్‌లో పసిడి వాటా 7.37 శాతంగా ఉంది. కాగా.. ఏప్రిల్‌లో భారత సర్వీసు ఎగుమతులు 29.57 బిలియన్లుగా, దిగుమతులు 16.97 బిలియన్లుగా నమోదయ్యాయి. మార్చిలో సర్వీసు సెక్టార్‌ ఎగుమతులు 15.84 బిలియన్‌ డాలర్లుగా ఉండగా.. దిగుమతులు 15.84 బిలియన్లుగా చోటు చేసుకున్నాయి.

➡️