పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న సామెత కడప ఉక్కు పరిశ్రమ విషయంలో అక్షర సత్యం. కడప ఉక్కు పరిశ్రమ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతుంటే, రాయలసీమ వాసులకు ప్రాణ సంకటంగా ఉంది. పరిశ్రమ వస్తే ఉద్యోగాలు వస్తాయని, బతుకులు బాగు పడతాయని ఎదురు చూస్తున్న రాయలసీమ యువత ఆశలు అడియాసలు అవుతున్నాయి. కడప స్టీల్‌ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని మంగళవారం లోక్‌సభలో కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామి ప్రకటించారు. జనసేన ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కడప ఉక్కు ఆలోచన ఏదీ తాము చేయడంలేదని ఆయన తేల్చేశారు. ఇప్పటికే విశాఖ ఉక్కు ఉంటుందా, ఊడుతుందా అని ఆందోళనలో ఉన్న రాష్ట్ర ప్రజలకు కేంద్రం మరో ద్రోహాన్ని తలపెట్టింది. 20 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో 20 లక్షల టన్నుల సామర్థ్యంతో, ప్రత్యక్షంగా 25 వేలు, పరోక్షంగా లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని రాయలసీమ యువతను ఇన్నాళ్ళుగా ఊరించిన పాలకుల నిజ స్వరూపాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రదర్శించుకున్నారు. గత పది సంవత్సరాలకు పైగా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకుండా, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వకుండా మోసం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో తాము అధికారంలో వుండడానికి ఆంధ్ర ప్రజలు తెలుగుదేశం, జనసేన పార్టీలు ఇచ్చిన బలమే ఆధారమనే స్పృహలో కూడా కేంద్ర పాలకులు లేరు. ఇందుకు ప్రధాన కారణం మన రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల వెన్నెముక లేని రాజకీయ వైఖరులే. వ్యక్తిగత, స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర పాలక, ప్రతిపక్షాల నేతలు కేంద్రం ముందు సాష్టాంగ ప్రణామాలు చేస్తున్నంత కాలం ఆంధ్రకు బిజెపి చేస్తున్న ద్రోహపూరిత వైఖరిలో మార్పు రాదు.
రాష్ట్ర పాలక పార్టీల విన్యాసాలు
2000-06 సంవత్సరాల మధ్య రాయలసీమ ప్రాంతం వరుస కరువులతో, లక్షల మంది పేదల వలసలతో, వేల సంఖ్యలో రైతుల ఆత్మహత్యలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. గంజి కేంద్రాల ద్వారా ప్రజలను కాపాడుకోవలసిన స్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో ఏర్పడిన యుపిఎ ప్రభుత్వం ప్రకటించిన గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అనంతపురంలోనే ప్రారంభించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి కడపలో బ్రహ్మణి ఉక్కు పరిశ్రమను నిర్మించాలని 2007 జూన్ 10న అంబవరం గ్రామ సమీపంలో శంకుస్థాపన చేశారు. రైతుల నుండి ఒక్క ఎకర భూ సేకరణ చేయకుండా అందుబాటులో వున్న 10 వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో ఈ పరిశ్రమను నిర్మిస్తున్నామని ప్రకటించారు (విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 14 వేల మంది నిర్వాసితులయ్యారు.). పరిశ్రమను నిర్మించే బ్రహ్మణి స్టీల్ కంపెనీకి ఎకరం 18 వేల చొప్పున 10 వేల ఎకరాల భూమి అప్పగించారు. అంతేకాకుండా ఈ పరిశ్రమకు సమీపంలో జమ్ములమడుగులో 4 వేల ఎకరాల్లో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. పరిశ్రమ ఒక్క అడుగు ముందుకు పడకపోయినా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పాలకులు, వారి అనుచరులు వేల కోట్లు దండుకున్నారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయే ప్రాంతాల అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లో కడపలో ప్రభుత్వ రంగంలోనే భారీ ఉక్కు పరిశ్రమను నిర్మిస్తామని అప్పటి కేంద్ర కాంగ్రెసు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి అధికార బిజెపి బలపరచింది.
రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన పదేళ్ళ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు 2018లో ఎన్నికలకు సరిగ్గా ఐదు నెలల ముందు గండికోట రిజర్వాయర్ సమీపంలోని కంబాలదిన్నె గ్రామం వద్ద మరోసారి శంకుస్థాపన చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ప్రభుత్వమే 4 వేల ఎకరాల్లో ఉక్కు పరిశ్రమను నిర్మిస్తుందని ఆయన ప్రకటించారు. దాదాపు నాలుగున్నర సంవత్సరాలు కేంద్ర బిజెపికి మద్దతుదారుడిగానే కాకుండా, కేంద్ర ప్రభుత్వంలో టిడిపి భాగస్వామిగా వుంది. ఆ కాలంలో కడప ఉక్కు గురించి కేంద్రంతో మాట్లాడి సాధించకుండా వారి బంధం చెడిన తర్వాత అప్పటి తన పార్టీ రాజ్యసభ సభ్యుడు సి.ఎం. రమేష్‌తో 2018 జూన్ 20న కడపలో నిరాహారదీక్ష చేయించి, ప్రభుత్వమే ఉక్కు పరిశ్రమను నిర్మిస్తుందని హామీ ఇచ్చి ఆ దీక్షా నాటకానికి తెర దించారు. ఆ నేపథ్యంలోనే 2018 డిసెంబర్ 27న ఉక్కు పరిశ్రమకు రెండవసారి శంకుస్థాపన జరిగింది.
ఆ తర్వాత మూడో కృష్ణుడు వచ్చినట్లు జగన్ మోహన్ రెడ్డి 2019 డిసెంబర్ 23న మూడోసారి శంకుస్థాపన చేశారు. పరిశ్రమ నిర్మాణంలో ప్రభుత్వరతో పాటు ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ (ఆర్‌ఎఫ్‌పి) పద్ధతుల్లో గ్లోబల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ పరిశ్రమకు ప్రతి సంవత్సరానికి రెండు టిఎంసీల నీరు, నాలుగు లైన్ల రోడ్లు, రైలు మార్గం ఏర్పాటు కోసం టెండర్లు పిలిచారు. కాంట్రాక్టర్లకు పని దొరికింది. పాలకులకు కమీషన్లు అందాయి. పరిశ్రమ మాత్రం ఒక్క అడుగు ముందుకు పోలేదు. తిరిగి 2023 ఫిబ్రవరి 15న ఇదే ఉక్కు పరిశ్రమకు మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నాలుగు సార్లు శంకుస్థాపన చేసినా పని ఒక్క అంగుళం కూడా ముందుకు జరగని ఏకైక పరిశ్రమ బహుశా ఇదేనేమో! వెనుకబడిన ప్రాంతాల గురించి మొసలి కన్నీరు కారుస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, పరిశ్రమ పేరుతో కాంట్రాక్టు పనుల్లో కమీషన్లలో కోట్లు కొల్లగొట్టడానికి, ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి శంకుస్థాపనలు చేస్తూ రాయలసీమ ప్రజలను పాలక పార్టీలు పదేపదే మోసం చేస్తున్నాయి.
కేంద్ర బిజెపి ద్రోహం
రాష్ట్ర విభజన చట్టంలో రూపొందించిన అంశాలపై ఆనాడు కేంద్రంలో ప్రతిపక్ష పార్టీగా నానా రగడ చేసింది. ప్రత్యేక హోదాతో పాటు, కడప ఉక్కు పరిశ్రమ గురించి నాడు తెలుగుదేశం, పవన్, జగన్‌తో కలిసి తిరుపతి సభలో ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఆ తర్వాత మాటల గారడీకి తెరలేపింది. కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ నిర్మించడం సాంకేతికంగా, ఆర్థికంగా లాభదాయకం కాదని సన్నాయి నొక్కులు నొక్కింది. సొంత గనులు లేకుండా ఉక్కు పరిశ్రమ నిర్మించలేమని మరో వాదన తెచ్చారు. ‘సెయిల్’ అధ్యయనం పేరుతో కడప ఉక్కు పరిశ్రమ నష్టాదాయకమని చెప్పారు. ఈ వితండ వాదనలు చేస్తున్న కేంద్ర బిజెపి ని నాటి అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసిపి కనీసంగా కూడా ప్రశ్నించలేదు. పార్లమెంట్‌లో నిలదీసి ఉక్కు పరిశ్రమ సాధనకు ఉద్యమం చేయలేదు. కలిసిమెలసి వున్నకాలం పూర్తయిన తర్వాత తెలుగుదేశం నాయకులు కేంద్రాన్ని విమర్శించడం ప్రారంభించారు. కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ స్థాపిస్తామని, రాయసీమలో రెండో రాజధాని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టులకు 20 వేల కోట్ల నిధులు అంటూ 16 డిమాండ్లతో కూడిన రాయలసీమ డిక్లరేషన్‌ను బిజెపి 2018 ఫిబ్రవరి 22న కర్నూలులో ప్రకటించింది. దీనికి ప్రతిగా ‘ప్రజలను మభ్యపెట్టడంలో దిట్టలు మోడీ, అమిత్‌షాలని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ తీవ్రంగా విమర్శించారు. వెంటనే బిజెపి రాయలసీమ వాదన అందుకుంది.
వైసిపి అధికారంలో వున్నంతకాలం కేంద్ర బిజెపికి పార్లమెంట్‌లో అండగా నిలచింది. వినాశకర బిల్లులు, విధానాలన్నింటినీ బలపరచింది. రాష్ట్రంలో అమలుచేసేందుకు అతి ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఇంతా చేసి కడపకు ఉక్కు పరిశ్రమను మాత్రం సాధించలేకపోయింది. టిడిపి, జనసేన పార్టీలు బిజెపి తో జతకట్టిన వెంటనే కడప ఉక్కు పరిశ్రమ వైసిపి కి గుర్తుకు వచ్చింది. కేంద్రం కడప ఉక్కును అడ్డుకుందని వైసిపి నాయకులు విమర్శించడం ప్రారంభించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు కడప ఉక్కు గురించి హామీ ఇచ్చిన విషయం కడప జిల్లాలో రెండు ఎంఎల్‌ఏ సీట్లకు పోటీ చేసిన బిజెపికి తెలియదా? అప్పుడు ఉక్కు పరిశ్రమ సాధ్యంకాదని ఎందుకు చెప్పలేదు? రాష్ట్రం కోసం ఎవరినైనా ప్రశ్నిస్తా అని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పార్టీ ఎంపీ అడిగిన ప్రశ్నకు కడప ఉక్కు లేదని కేంద్రమంత్రి పార్లమెంట్‌లో చెబుతుంటే ఎందుకు కేంద్రాన్ని ప్రశ్నించరు?
బిజెపి, రాష్ట్రంలోని మూడు ప్రాంతీయ పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌కు, రాయలసీమకు తీరని ద్రోహం తలపెడు తున్నాయి. రాష్ట్ర అభివృద్ధి పట్ల కేంద్రానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని గత పది సంవత్సరాల అనుభవం స్పష్టం చేస్తుంది. కేంద్రం అడుగులకు మడుగులొత్తే రాష్ట్ర పాలక వర్గ పార్టీల విధానాలు మారకుండా రాష్ట్రం, వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి కావు. కేంద్ర, రాష్ట్ర పాలకుల విధానాలను మార్చగలిగేది ప్రజా ఉద్యమాలే.
– వ్యాసకర్త : వి. రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు