సచివాలయాల సిబ్బంది కుదింపు?

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న సిబ్బంది సంఖ్యను కుదించే దిశలో రాష్ట్రప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. సచివాలయాలు ప్రాతినిధ్యం వహించే గ్రామ లేదా వార్డు జనాభా ఆధారంగా ఈ ప్రక్రియ జరగనుంది. అవసరమైతే కొన్ని సచివాలయాల సంఖ్యను కూడా తగ్గించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. సమీక్ష అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో సిబ్బందిని క్రమబద్ధీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,162 గ్రామసచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిలో 1,27,175 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి సచివాలయంలో కనీసం 10 మంది సిబ్బంది ఉండేవిధంగా గత ప్రభుత్వం వీటిని రూపొందించింది. అయితే, కొన్ని చోట్ల పదిమంది కన్నా ఎక్కువగా, మరికొన్ని చోట్ల నలుగురి నుండి ఆరుగురు వరకు సిబ్బందితో సచివాలయాలు పని చేస్తున్నాయి. ఇలా ఎక్కువ, తక్కువ ఉన్న సిబ్బందిని క్రమబద్ధీకరించడంతో పాటు, ఒక్కో సచివాలయానికి ఉండాల్సిన కనీస సిబ్బంది అంశాన్ని కూడా పరిశీలి స్తున్నట్లు సమాచారం. ఈ సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. సిబ్బంది క్రమబద్దీకరణ, సచివాలయాల సంఖ్య కుదింపు తరువాత అదనంగా తేలిన సిబ్బందిని ఇతర శాఖలకు బదిలీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.

క్రమబద్ధీకరణ ఇలా…

క్రమబద్ధీకరణలో భాగంగా సిబ్బందిని బహుళ ప్రయోజనాలు (మల్టీపర్పస్‌ ఫంక్షనరీస్‌; సాంకేతిక సిబ్బందిగా టెక్నికల్‌ ఫంక్షనరీస్‌గా విభజించను న్నారు. 2,500 మంది లోపు జనాభాకు ఇద్దరు మల్టీపర్పస్‌, నలుగురు టెక్నికల్‌ సిబ్బంది కలిపి ఆరుగురిని గరిష్టంగా ఉంచాలని నిర్ణయించారు. 2,500 నుండి 3,500 జనాభా ఉన్న సచివాల యాలకు ముగ్గురు మల్టీపర్పస్‌, నలుగురు టెక్నికల్‌ సిబ్బంది, 3,501 నుండి ఆపైన జనాభా ఉన్న సచివాలయాలకు నలుగురు మల్టీపర్పస్‌, నలుగురు టెక్నికల్‌ సిబ్బంది కలిపి ఎనిమిదిమందిని గరిష్టంగా ఉంచనున్నారు. రాష్ట్రంలో 2.500 లోపు జనాభాతో ప్రస్తుతం 3.562 సచివాలయాలు, 2,500 నుండి 3,500 వరకు జనాభాతో 5,388 సచివాలయాలు, అంతకుపైన జనాభాతో 6,053 సచివాలయాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. ఈ మేరకు సిబ్బందిని సర్దుబాటు చేయా లన్న అధికారుల ప్రతిపాదనకు సిఎం గ్రీన్‌ సిగల్‌ ఇచ్చినట్లు తెలిసింది. ఈనెల 17న క్యాబినెట్‌ సమావేశంలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆస్పిరేషనల్‌ సెక్రటరీగా ఒకరిని నియమించాలని సూచించారు. వీరి ద్వారా ఎఐ, డ్రోన్‌ టెక్నాలజిని గ్రామాల్లోకి తీసుకుపోవాలని చెప్పారు. సచివాలయాల సిబ్బందికి గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ సంస్థలతో సాంకేతిక శిక్షణ అందించాలని, అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు బ్యాండ్‌ విడ్త్‌తో వైఫైని అందించాలని అన్నారు. జిల్లా మండలం/ యుఎల్‌బి, సెక్రటేరియట్లలో జిఎస్‌డబ్ల్యుఎస్‌కు ప్రత్యేకమైన అడ్మినిస్ట్రేటివ్‌ సెటప్‌-3 టైర్‌ విధానాన్ని అమలు చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఇంటి నుంచి పనిచేసే వారు (వర్క్‌్‌ ఫ్రమ్‌ హోమ్‌) సర్వే చేపట్టాలని సిఎం అధికారులకు సూచించారు. ఫిబ్రవరి 15 నాటికి పిల్లలందరికీ ఆధార్‌ జారీ చేయాలని, ఈనెల 20 నాటికి అన్ని గృహాల జియో ట్యాగింగ్‌ ప్రక్రియ పూర్తి చేయాలని సిఎం పేర్కొన్నారు. నైపుణ్యాభివృద్ది, వాణిజ్యం, మార్కెటింగ్‌, ఉపాధి ఉత్పత్తులకు విలువ జోడింపు లాంటి వాటికి సచివాలయాలు కేంద్రాలుగా ఉంటాయని సిఎం చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాలు ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రటరీ అడ్మిన్‌గా వ్యవహరిస్తుండగా, రానున్న రోజుల్లో పంచాయతీ కార్యదర్శి/ వార్డు అడ్మిన్‌స్ట్రేటివ్‌ సెక్రటరీ సెక్రటరియేట్‌కు యూనిట్‌ అధిపతిగా ఉండనున్నట్లు సమీక్షలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ సమీక్షలో జిఎస్‌డబ్ల్యుఎస్‌ డైరెక్టర్‌ శివప్రసాద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

➡️