సెకి ఒప్పందం రద్దు చేయాలి

  • విద్యుత్‌ వార్షిక లోటును ప్రభుత్వమే భరించాలి
  • టైం ఆఫ్‌ డే టారిఫ్‌ విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం
  • ఎపిఇఆర్‌సి ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు వక్తలు

ప్రజాశక్తి- కర్నూలు ప్రతినిధి : సెకీతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని, విద్యుత్‌ భారాలను ప్రభుత్వమే భరించాలని పలువురు వక్తలు కోరారు. ప్రజలపై విద్యుత్‌ భారాలు సరికాదన్నారు. టైం ఆఫ్‌ డే టారిఫ్‌ విధానంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్మార్ట్‌ మీటర్లు పెట్టొద్దని విన్నవించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్‌ ధరలపై ఎపి విద్యుత్‌ నియంత్రణ మండలి (ఎపిఇఆర్‌సి) మూడు రోజులుగా నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణ చివరి రోజైన శుక్రవారం కర్నూలు శివార్లలోని ఎపి ఇఆర్‌సి కార్యాలయంలో జరిగింది. నేరుగా, ఆన్‌లైన్‌ ద్వారా అభ్యంతరాలను స్వీకరించారు. 16 మంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. సిపిఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి వి.గంగరాజు మాట్లాడుతూ టైం ఆఫ్‌ డే టారిఫ్‌ విధానం వల్ల ప్రజలపై అదనపు భారం పడనుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్‌ పంపిణీని ప్రయివేటుపరం చేసేందుకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. విద్యుత్‌ వార్షిక లోటును ప్రభుత్వమే చెల్లించేలా ప్రతిపాదనలు పంపాలని కోరారు. సెకీ ఒప్పందం వల్ల ప్రజలపై అదనపు భారం పడుతోందని, ఆ ఒప్పందాలను పూర్తిగా రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఎం కర్నూలు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.ఆనంద్‌బాబు మాట్లాడుతూ విద్యుత్‌ భారాలపైనా విస్తృత ప్రజాభిప్రాయ సేకరణ జరగాలన్నారు. ఒకవైపు అధికారులు ఎలాంటి భారాలూ వేయబోమని చెబుతూనే ప్రజలపై వివిధ రకాలుగా రూ.72 వేల కోట్ల భారం వేస్తున్నారన్నారు. స్మార్ట్‌ మీటర్లను, ట్రూ అప్‌ ఛార్జీలను, సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని కోరారు. సిఐటియు కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు మాట్లాడుతూ విద్యుదుత్పత్తి వ్యయం తగ్గుతున్నప్పుడు ఛార్జీలు తగ్గించకుండా పెంచడం సరికాన్నారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి మాట్లాడుతూ ప్రజలపై భారాలు వేయడం రాష్ట్రాభివృద్ధికి ఆటంకమని పేర్కొన్నారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని ఎన్నికల ముందు టిడిపి కూటమి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కర్నూలు జిల్లాలో సోలార్‌ విద్యుదుత్పత్తి చేస్తూ ఆ భూములు ఇచ్చిన రైతులకు విద్యుత్‌ రాయితీలు ఇవ్వకపోవడం సరైనది కాదన్నారు. వృత్తిదారుల సంఘాల కర్నూలు జిల్లా కన్వీనర్‌ సి.గురుశేఖర్‌ మాట్లాడుతూ గ్రామాల్లో బహిరంగ సభలు జరిపి ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సూచించారు. స్మార్ట్‌ మీటర్ల వల్ల వృత్తిదారులపై భారం పడుతుందన్నారు. మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్‌ మాట్లాడుతూ స్మార్ట్‌ మీటర్ల గురించి ఒక్కొక్కరు ఒక్కో మాట చెబుతున్నారని, దానిపై స్పష్టమైన విధానాలను వెల్లడించాలని కోరారు. రంపచోడవరానికి చెందిన రమణ మాట్లాడుతూ సీలేరులో విద్యుదుత్పత్తి చేస్తున్నా ఇంకా ఈ పరిసర ప్రాంతాల్లోని చాలామందికి విద్యుత్‌ సౌకర్యం లేదన్నారు. కొవ్వాడలో అణువిద్యుత్‌ కేంద్రం పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. సిపిఎం నంద్యాల పట్టణ కార్యదర్శి డి.లక్ష్మణ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేసుకున్న విద్యుత్‌ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని, ట్రూ అప్‌ ఛార్జీలను, సర్‌ ఛార్జీలను రద్దు చేయాలని కోరారు. సిపిఐ నాయకులు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎపిఇఆర్‌సి తీసుకున్న విద్యుత్‌ భారాల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సిపిఐఎంఎల్‌ నాయకులు మల్లికార్జున మాట్లాడుతూ విద్యుదుత్పత్తికి భూములు ఇచ్చిన రైతులకు రాయితీ విద్యుత్‌ అందించాలని కోరారు. అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు నరసింహులు మాట్లాడుతూ వ్యవసాయానికి స్మార్ట్‌ మీటర్లను రైతులు వ్యతిరేకిస్తే అధికారులు ఒత్తిడి చేసి వాటిని పెట్టారని, దీంతో, రైతులపై అదనపు భారం పడిందన్నారు.

పెరుగుదల లేదు :  ఎపి ఇఆర్‌సి చైర్మన్‌ ఠాకూర్‌ రామ్‌సింగ్‌

2025-26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్‌ టారీఫ్‌లో ఎలాంటి పెరుగుదలా ఉండబోదని ఎపిఇఆర్‌సి చైర్మన్‌ ఠాకూర్‌ రామ్‌సింగ్‌ వెల్లడించారు. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మూడు రోజులపాటు హైబ్రిడ్‌ విధానంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టామని, మొత్తం 94 మంది తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారని తెలిపారు. ఏడాదిలో విద్యుత్‌ పంపిణీలో వచ్చే రూ.14,680 కోట్ల లోటును రాష్ట్ర ప్రభుత్వమే భరిచేందుకు అంగీకరించిందన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, వ్యవసాయ, ఆక్వా రాయితీలు కొనసాగుతాయని, అదనపు భారం ఉండదని తెలిపారు. సెకీ ఒప్పందాలకు అవసరమైన మేరకే అనుమతి ఇచ్చామని, ఇది హైకోర్టులో ఉన్న అంశమని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

➡️