- ఏచూరి సంస్మరణ సభలో వక్తలు
సీతారాం ఏచూరి మృతి వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులకు తీరని లోటు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రచారకర్త అని, సమస్యల పరిష్కర్త అని, తమ హీరో అని తమ ప్రసంగాల్లో ఘనంగా నివాళులర్పించారు.
పోరాట యోధుడు : ఎన్ రామ్
ప్రముఖ జర్నలిస్ట్, హిందూ మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎన్ రామ్ మాట్లాడుతూ సీతారాం అర్ధశతాబ్ద కాలంగా కలిసి ఉన్న స్నేహితుడు, సహచరుడు అని అన్నారు. భారత రాజకీయాలు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో సీతారాం మరణం వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులకు తీరని లోటు అని ఆయన మరణానంతరం సిపిఎం పొలిట్ బ్యూరో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందని, అది సీతారాం జీవితం వ్యక్తిగత చిత్తశుద్ధి, త్యాగం, స్థిరమైన రాజకీయ తత్వానికి ఉదాహరణ అని అన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ, ముఖ్యంగా మీడియా స్వేచ్ఛ కోసం నిలబడి, జర్నలిస్టులకు అండగా నిలవడంలో సీతారాం పట్టుదలతో ఉన్నారని అన్నారు. రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి చేస్తున్న దాడులను ప్రతిఘటించిన బలమైన పోరాట యోధుడని అన్నారు. గోల్వాల్కర్ హిందూ రాష్ట్ర ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సీతారాం రాసిన కథనం తాను ఫ్రంట్‌లైన్ ఎడిటర్‌గా ఉన్నప్పుడు ప్రచురించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. హిందూత్వకు వ్యతిరేకంగా భారత రిపబ్లిక్, ప్రజాస్వామ్య స్వభావాన్ని పరిరక్షించడానికి సీతారాం ఎలా పోరాడారో గుర్తు చేశారు.
గుజరాత్ అల్లర్ల తరువాత వచ్చిన తొలి ఎంపిలలో ఒకరు : తీస్తా సెతల్వాద్
సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ మాట్లాడుతూ 2002లో అల్లర్ల తరువాత పార్లమెంటరీ ప్రతినిధి బృందంలో భాగంగా గుజరాత్‌కు వచ్చిన తొలి ఎంపిలలో సీతారాం ఒకరని గుర్తు చేశారు. రాజ్యసభలో ఆయన చేసిన రెండు ప్రసంగాలను గుర్తు చేస్తూ, అవి ఏచూరి పాత్రను ప్రతిబింబిస్తాయని అన్నారు. ఫెడరలిజానికి సీతారాం నిబద్ధతను ఆమె కొనియాడారు.
అందరికీ రాజకీయ గురువు : జి.దేవరాజన్
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రధాన కార్యదర్శి జి. దేవరాజన్ మాట్లాడుతూ వామపక్ష ఉద్యమంలో సీతారాం ఏచూరి ప్రతి ఒక్కరికీ రాజకీయ గురువు అని అన్నారు. రాజకీయాలంటే కేవలం అవకాశాల కళ కాదని, అసాధ్యాలను సుసాధ్యం చేయడమేనని సీతారాం నిరూపించారన్నారు.
లోతైన నిబద్ధత : మనోజ్ భట్టాచార్య
సీతారాం జీవించిన లక్ష్యం కోసం వామపక్ష, ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసి రావాలని ఆర్‌ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య అన్నారు. వామపక్ష ఐక్యతకు సీతారాం లోతైన నిబద్ధతను ఆయన గుర్తు చేశారు.
పోరాటాన్ని కొనసాగించాలి : దీపాంకర్ భట్టాచార్య
సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య మాట్లాడుతూ ఏచూరి మారుతున్న కాలాన్ని, తాజా పోరాటాల ఆవశ్యకతను అర్థం చేసుకోగలిగారని అన్నారు. మతతత్వం వంటి సమస్యలపై సీతారాం బలంగా, శక్తివంతంగా గొంతెత్తారని, ఆయన పోరాటాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఏచూరి స్ఫూర్తితో పోరాడాలి : ఫరూక్ అబ్దుల్లా
సీతారాం ఏచూరికి ప్రత్యర్థులు లేరని, ఆయన జ్ఞాపకాన్ని కాపాడుకోవడానికి నిర్భయంగా పోరాడటమే ఘనమైన నివాళి అని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దేశంలో పేదరికాన్ని ఎలా నిర్మూలించాలో ఆలోచించారని, ప్రతి ఒక్కరూ ప్రేమ, సౌభ్రాతృత్వంతో ఎలా జీవించగలరని నిరంతరం ఆరా తీసేవారని పేర్కొన్నారు. ఏచూరి జ్ఞాపకాలు పెద్ద ప్రత్యర్థులతో పోరాడటానికి శక్తిని, ప్రేరణను ఇస్తాయని అన్నారు.
భిన్నత్వంలో ఏకత్వానికి ప్రచారకర్త : కనిమొళి
ఏచూరి పోరాట యోధుడని డిఎంకె ఎంపి కనిమొళి అన్నారు. ఆయన తప్పుగా భావించేవాటిని విద్యార్థి దశ నుంచే నిర్భయంగా వ్యతిరేకించారని, చివరి శ్వాస వరకు అదే కొనసాగిందని పేర్కొన్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యం పక్షాన నిలిచారని, భిన్నత్వంలో ఏకత్వం అనే ఆలోచనకు గొప్ప ప్రచారకర్త అని అన్నారు. తన తండ్రి కరుణానిధితో ఏచూరికి వ్యక్తిగతంగా గొప్ప అనుబంధం ఉందని అన్నారు. కోయంబత్తూరులో తమిళ సాంప్రదాయ సదస్సు జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో ఏచూరి పాల్గొనాలని అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి చాలా పట్టుదలగా ఉన్నారని, ఏచూరిని తీసుకురావడానికి హెలికాప్టర్‌ను పంపారని గుర్తు చేశారు.
మా హీరో ఏచూరి : సుప్రియా సూలే (ఎన్‌సిపి)
రాజ్యసభలో ఏచూరి మా హీరో ఏచూరి అని ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే అన్నారు. తన సొంత భావజాలం గురించి ఇంత స్పష్టంగా ఉన్న వారిని తాను మరెవరినీ కలవలేదని అన్నారు. దానికి కట్టుబడి సమకాలీన సమస్యలను నిర్వచించారని, పార్లమెంట్‌లో మొదలైన బాంధవ్యం ఇళ్ల వరకూ వెళ్లిందని తెలిపారు. తన కుమార్తె, కుమారుడు చదువుకు సంబంధించి ఎంతో సహకరించారని అన్నారు. ప్రజలను తన వెంట తీసుకెళ్లి విభేదాలను పరిష్కరించే అద్భుతమైన సామర్థ్యం ఏచూరికి ఉందని ఆమె అన్నారు. మహారాష్ట్రలో పోరాటాలకు ఆయన చేసిన కృషిని, రాష్ట్రంలో ఉల్లి రైతులకు ఆయన సంఘీభావాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు.
సమస్యల పరిష్కర్త : గోపాల్ రాయ్ (ఆప్)
కేజ్రీవాల్‌తో సహా ఆప్‌కి చెందిన ప్రముఖ నేతల అరెస్ట్‌తో ఢిల్లీ ప్రభుత్వం, తమ పార్టీ కూలిపోతుందనే భావన వచ్చినప్పుడు, తన కష్టాలు ఎవరికి చెప్పాలా అని ఆలోచించినప్పుడు ఏచూరి గుర్తుకు వచ్చారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ అన్నారు. తాను ఏచూరిని చూడటానికి వెళ్లానని, ”భయపడకు… మేం మీ వెంటే ఉన్నాం, పోరాడతాం’ అని ఏచూరి భరోసా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. ఐదు రోజుల తరువాత కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా రాంలీలా మైదానంలో జరిగిన భారీ సభకు ప్రముఖ రాజకీయ నేతలంతా వచ్చారని, వారందరినీ అక్కడికి తీసుకొచ్చింది ఏచూరి అని పేర్కొన్నారు.
ఎన్నో పాఠాలు నేర్పారు : రామ్ గోపాల్ యాదవ్
పార్లమెంటులో ఎలా జోక్యం చేసుకోవాలో, ఎలాంటి ప్రశ్నలు అడగాలో ఏచూరి సహా వామపక్ష ఎంపిలే తనకు నేర్పారని ఎస్‌పి ఎంపి రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. సీతారామ్‌కి విరోధులు లేకపోవడానికి కారణం, ఆయన వారి అభిప్రాయాలను కూడా వినడానికి ఇష్టపడటమేనని, అలాంటి నాయకులు కావాలని అన్నారు. సీతారాం వారసత్వాన్ని, కమ్యూనిస్టు ఉద్యమాన్ని సజీవంగా ఉంచాలని సిపిఎంని కోరారు.
ఏచూరిని కలిస్తే ఉత్సాహం వచ్చేది : మనోజ్ ఝా
సీతారాం ఏచూరి స్థానంలో మరొకరిని ఊహించలేమని ఆర్‌జెడి ఎంపి మనోజ్ కుమార్ ఝా అన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు కొన్నిసార్లు నిరాశ చెందుతానని, ఆయనను కలిసిన తరువాతే తనకు ఉత్సాహం వచ్చేదని అన్నారు. ‘ఎన్నికల్లో ఓడిపోతే ఏం, ముందుకు వెళ్దాం.. ఏం చేస్తాం.. ఆలోచిద్దాం’ అని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. కమ్యూనిస్టుగా ఉండడమంటే హృదయంతో ఉండటమని, ఆ లక్షణానికి సీతారాం ప్రతిరూపమని కొనియాడారు.
ఉమ్మడి ఫ్రంట్ రూపశిల్పి : మహువా మాఝీ
జార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపి మహువా మాఝీ మాట్లాడుతూ రాజకీయ నైతికత, భావజాలంపై వ్యక్తిగత ప్రయోజనాలే గెలుస్తున్న తరుణంలో సీతారాం మృతి తీరని లోటని అన్నారు. ”ఆయన వామపక్షాల గొంతు మాత్రమే కాదు, ద్వేషపూరిత మత రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య శక్తుల ఉమ్మడి ఫ్రంట్ రూపశిల్పి” అని ఆమె చెప్పారు.