కేంద్రం చర్యలకూ.. మీరు చెబుతున్నదానికీ.. పొంతన ఏదీ

  • స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల్లో తీవ్ర ఆందోళన
  • టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎంపీ శ్రీభరత్‌ ఎదుట వర్కర్లు
  •  ప్రయివేటీకరిస్తే పదవికి రాజీనామా చేస్తానన్న పల్లా

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం) : ‘స్టీల్‌ప్లాంట్‌ విషయంలో కేంద్రంలోని మోడీ సర్కారు చర్యలకూ, మీరు చెబుతున్న మాటలకూ పొంతన ఉండడం లేదు. ఎన్నికలకు ముందు ఉక్కు పరిరక్షణకు కూటమి నేతలు చెప్పిన మాటకు, ఎన్నికల తర్వాత అందిస్తున్న సహకారానికీ బోలెడు తేడా ఉంది. మేమంతా ఆందోళన చెందుతున్నాం’ అని ఉక్కు కార్మికులు… టిడిపి రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎం.శ్రీభరత్‌ను అడిగారు. ప్లాంట్‌ పరిరక్షణకు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలిలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారానికి 1,311వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) కార్యకర్తలు, ఉక్కు కార్మికులు కూర్చున్నారు. రెండు రోజులుగా వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు, కార్మికుల ఆందోళన నేపథ్యంలో భరోసానిచ్చేందుకు దీక్షా శిబిరం వద్దకు పల్లా శ్రీనివాసరావు, ఎం.శ్రీభరత్‌ వచ్చారు. శ్రీభరత్‌ మాట్లాడుతూ ఉక్కు పరిరక్షణ విషయమై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో మాట్లాడామని, ఆ విషయం ఉన్నత స్థాయిలోనిదని ఆమె చెప్పారని తెలిపారు. ప్లాంట్‌కు ప్యాకేజీ ఇవ్వడానికి 10-15 రోజులు పట్టే అవకాశమున్నట్టు తెలియజేశారన్నారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉక్కు కర్మాగారం విషయంలో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో భరోసానివ్వడానికే తాము ఇక్కడకు వచ్చామన్నారు.
ఆ సమయంలో కార్మికులు కలుగజేసుకుని స్టీల్‌ప్లాంట్‌ విషయంలో ఎన్నికల ముందు చెప్పిన మాటకు, నేడు కూటమి ప్రభుత్వం అందిస్తున్న సహకారానికి తేడా ఉందని అన్నారు. మిమ్మల్ని, శ్రీభరత్‌ను, గంటా శ్రీనివాసరావును ఉక్కును కాపాడతారనే ఆశతోనే విశాఖ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. దీనిపై పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ జరిగే పరిస్థితే వస్తే, తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, కార్మికులతో కలిసి పోరాడతానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి విశాఖ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి, కార్పొరేటర్లు బొండా జగన్‌, లేళ్ల కోటేశ్వరరావు, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌, జె.అయోధ్యరామ్‌,యు.రామస్వామి, కెఎస్‌ఎన్‌.రావు, విళ్లా రామ్మోహన్‌ కుమార్‌, దొమ్మేటి అప్పారావు, డివి.రమణారెడ్డి, డి.సురేష్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

➡️