ఈ ఏడాది పరిహారం మాటేమిటి?

  • గతేడాది వేట నిషేధ పరిహారం ఏప్రిల్‌లో చెల్లిస్తామంటున్న ప్రభుత్వం
  • 2025 బ్యాన్‌ పీరియడ్‌ సొమ్ములు ఎప్పుడిస్తారో?

ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : చేపల వేట నిషేధ కాలానికి చెల్లించే పరిహారం విషయంలో ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోంది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకట్రెండు నెలల్లో డబ్బులు వస్తాయని మత్స్యకారులు భావించారు. అప్పటికే సర్వే చేసి పంపిన జాబితాలపై మరోసారి రీ సర్వే చేయాలని గతేడాది సెప్టెంబర్‌లో ప్రభుత్వం ఆదేశించి వారి ఆశలపై నీళ్లుజల్లింది. సర్వే పూర్తయిన తర్వాత జనవరిలో డబ్బులు జమ చేస్తామంటూ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే, రీ సర్వేకు మార్గదర్శకాలు వెలువరించడంలో రెండు నెలల పాటు జాప్యం చేసింది. వేట నిషేధ పరిహారం జాబితాలో తప్పిపోయిన వారి వివరాల నమోదుపై నవంబరులో మార్గదర్శకాలు ఇవ్వడంతో అధికారులు రీ సర్వే చేసి ప్రభుత్వానికి జాబితాలు పంపారు. దీంతో, డబ్బులు వస్తాయని ఆశగా ఎదురుచూస్తున్న మత్స్యకారులకు ఏప్రిల్‌లో డబ్బులు ఇస్తామంటూ ప్రభుత్వం చావుకబురు చెప్పింది. గత ఆర్థిక సంవత్సరం చెల్లింపులు కొత్త ఆర్థిక సంవత్సరంలో చేపడితే 2025 బ్యాన్‌ పీరియడ్‌ సొమ్ములు ఎప్పుడు ఇస్తారని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు. ఒకే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం రెండు పర్యాయాలు చెల్లింపులు చేస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14వ తేదీ వరకు 61 రోజులపాటు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ సమయంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రూ.పది వేలు చొప్పున ఏటా క్రమం తప్పకుండా అందిస్తోంది. 2023 సంవత్సరానికి సంబంధించి ఆ ఏడాది మే మూడో వారంలోనే చెల్లింపులు చేసింది. గతేడాదికి సంబంధించి ఇప్పటివరకు మత్స్యకారులకు వేట నిషేధ పరిహారం డబ్బులు అందలేదు. టిడిపి కూటమి ప్రభుత్వం చేస్తోన్న కాలయాపన వల్లే గతేడాదికి సంబంధించిన మత్స్యకార భరోసా నేటికీ అందలేదనే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పట్లో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో లబ్ధిదారుల సర్వేను చాలా ఆలస్యంగా చేపట్టడంతో గతేడాది జూన్‌ రెండో తేదీ నాటికి అధికారులు జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపారు. రాష్ట్రంలో గతేడాది జూన్‌లో కొత్తగా కొలువుదీరిన టిడిపి కూటమి ప్రభుత్వం దీని అధారంగా చెల్లింపులు చేయకుండా రీ సర్వే చేయాలని ఆదేశించింది. దీంతో, చెల్లింపు వాయిదా పడ్డాయి. రీ సర్వే పూర్తయిన తర్వాత జనవరిలో ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఏప్రిల్‌లో చెల్లిస్తామంటూ మాట మార్చింది.

పూర్తయిన రీ సర్వే

వేట నిషేధ పరిహారానికి గత ప్రభుత్వం మే రెండో తేదీన మొదటిసారి సర్వే నిర్వహించింది. జూన్‌ రెండో తేదీ నాటికి ప్రాథమిక జాబితా పూర్తయింది. ఆ జాబితా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1,30,128 మంది మత్స్యకారులను సర్వే చేశారు. వీరిలో ప్రాథమికంగా 1,05,387 మందిని అర్హులుగా గుర్తించారు. నవంబరులో రీ సర్వే చేసిన తర్వాత వీరికి అదనంగా 800 మందికిపైగా మత్స్యకారులు జాబితాలో చేరినట్లు తెలుస్తోంది. దీంతో, మొత్తం 1.06 లక్షల మంది లబ్ధిదారులు అర్హత సాధించినట్లు సమాచారం.

సాయం పెంచి వడపోత?

తాము అధికారంలోకి వస్తే వేట నిషేధ సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచుతామంటూ టిడిపి కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొంది. ఒకవైపు సాయాన్ని పెంచుతూనే మరోవైపు వడపోత చేయడానికే జప్యం చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

➡️