Aug 01,2022 20:36

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఉపాధి హామీ పథకాన్ని ధ్వంసం చేసేందుకు కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా వామపక్ష ఎంపిలు పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సోమవారం ఆందోళన చేపట్టారు. డిఎంకె ఎంపిలు మద్దతు తెలిపారు. 'ఉపాధి హామీని కాపాడాలి, ఉపాధి హామీ కార్మికుల వేతనాలు పెంచాలి, పెండింగ్‌ నిధులను విడుదల చేయాలి, ఉపాధి హామీకి బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలి, పని దినాలు పెంచాలి' అంటూ పక్లార్డులతో పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ స్కీమ్‌లో భారీగా నిధుల కోత విధించిందని విమర్శించారు. ఉపాధి హామీ నిధులు విడుదల చేయటం లేదని, భారీగా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ఉపాధి హామీని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ఎంపిలు పిఆర్‌ నటరాజన్‌, ఎఎం ఆరీఫ్‌, వి శివదాసన్‌, జాన్‌ బ్రిట్టాస్‌, ఎఎ రహీం, సిపిఐ ఎంపిలు బినరు విశ్వం, సంతోష్‌ కుమార్‌ పాల్గన్నారు. రాజ్యసభలో ఉపాధి హామీ కార్మికుల సమస్యలపై చర్చించాలని సిపిఎం ఎంపి వి శివదాసన్‌ రాజ్యసభ ఛైర్మన్‌కు రూల్‌ 267 కింద నోటీసు ఇచ్చారు.