సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన
రిగ్గింగ్ జరిగిన ప్రాంతాల్లో రీపోలింగ్‌కు డిమాండ్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఎన్నికల సందర్భంగా వివిధ ప్రాంతాల్లో కూటమి పార్టీలు అధికార బలంతో దౌర్జన్యాలు, బూత్ ఆక్రమణలకు పాల్పడడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు గురువారం విడుదల చేసిన ప్రకటనలో రిగ్గింగ్‌కు పాల్పడిన ప్రాంతాల్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. రిగ్గింగ్‌కు పాల్పడిన వారిపై, వారికి వత్తాసు పలికిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.
పల్నాడు జిల్లా క్రోసూరు మండలంలో అధికార పార్టీ కార్యకర్తలు ఒక పథకం ప్రకారం బూత్‌లోకి ప్రవేశించి ప్రతిపక్షాల ఏజెంట్లను బలవంతంగా బయటకు తరిమేసి, ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడ్డారని పేర్కొన్నారు. అందుకూరు గ్రామానికి చెందిన 43, 44 పోలింగ్ బూత్‌లో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బూత్‌లోకి చొరబడి పోలింగ్ ఆఫీసర్ల వద్ద ఉన్న బ్యాలెట్ పేపర్లు లాక్కొని తెలుగుదేశం అభ్యర్థికి అనుకూలంగా దొంగ ఓట్లు వేశారని తెలిపారు. వారికి స్థానికంగా ఉన్న టిడిపి కార్యకర్తలు సహకరించారని, ఈ రెండు బూత్‌లలో రిగ్గింగ్ జరిగినందున పోలింగ్‌ని రద్దు చేసి రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నకరికల్లు మండలం జెడ్‌పిటిసి స్థానంలో పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సిపిఎం ఏజెంట్లను బయటకు తరిమివేసి, బూత్‌లో ఉన్న సిసి కెమెరాలు ఆఫ్‌చేసి రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, ఈ రెండు స్థానాల్లో రీ పోలింగ్ జరపాలని కోరారు. కర్నూలు మండలం ఉల్చాలలో సిపిఎం అభ్యర్థిని పోలీసులు లాక్కెళ్లి జీపులో పడేశారని తెలిపారు. ఇదే గ్రామంలో పోలింగ్ స్టేషన్ నెంబర్ 17, 18, 19లో తెలుగుదేశం పార్టీ నాయకులు బూత్‌లు ఆక్రమించి రిగ్గింగ్ చేసేందుకు సన్నాహలు చేశారని పేర్కొన్నారు. పై ఘటనలపై ఇంతకు ముందే సంబంధిత జిల్లా ఎన్నికల అధికారులకు, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యా తీసుకోలేదని పేర్కొన్నారు. దాంతో అధికార పార్టీ నాయకులు రెచ్చిపోయి మరిన్ని అరాచకాలకు, ఆగడాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీ ఒక పథకం ప్రకారం ఇలా అక్రమాలకు పాల్పడుతుంటే పోలీసు యంత్రాంగం వాటిని నివారించాల్సింది పోయి వారికి తోడ్పడే పద్దతిలో వ్యవహరించడం దుర్మార్గమని తెలిపారు. రిగ్గింగుకు తోడ్పడిన పోలీసు, పోలింగ్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ డిమాండ్ చేశారు. రిగ్గింగ్ జరిగిన స్థానాల్లో రీపోలింగ్ జరపాలని కోరారు. 








కామెంట్‌లు (0)