శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌’ను ప్రభుత్వమే నిర్వహించాలి

4 రోజుల క్రితం

State government must abandon its policy of coercion: CPI(M) State Committee
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 01:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కార్పొరేట్ యాజమాన్యాలకు ఇవ్వొద్దు

- దళిత, ఆదివాసి విద్యార్థులను గురుకులాల నుండి తరలించొద్దు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పిపిపి పేరుతో స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అనే ఆశ చూపించి ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల భవనాలు, స్థలాలు ఫిజిక్స్‌వాల, నారాయణ కోచింగ్ సెంటర్‌లకు దారాధత్తం చేయవద్దని సిపిఎం రాష్ట్ర కమిటీ కోరింది. ఈమేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో 12 చోట్ల దళిత, గిరిజన విద్యార్థులకు ఐఐటి, నీట్, జెఇఇ పరీక్షల్లో శిక్షణ ఇవ్వడానికి అదే తరగతులకు చెందిన విద్యార్థులను బలిచేయకుండా ప్రభుత్వమే ప్రత్యామ్నాయ భవనాలలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. మారికవలస సహా అనేక చోట్ల తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్యాయం చేయొద్దని ప్రతిఘటిస్తున్నారని, అయినా కార్పొరేట్ల కోసం తల్లిదండ్రులను లెక్క చేయకుండా బలవంతంగా చిన్న పిల్లలని కూడా చూడకుండా రాత్రికి రాత్రి తరలించడం అమానుషమని తెలిపారు. ఇలాంటి దళిత, గిరిజన వ్యతిరేక చర్యలను విరమించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. విద్యను అందించడానికి విశాఖ జిల్లా మారికవలస ప్రాంతంలో స్కూలు, కాలేజీ ఏర్పాటు చేయడం జరిగిందని, అనేకమంది ఈ విద్యాసంస్థల్లో చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సంపాదించారని తెలిపారు. ఇప్పటికే ఈ విద్యాసంస్థలో జెఇఇ మెయిన్స్, నీట్ వంటి కోచింగ్ విద్యార్థులకు అందిస్తున్నారని పేర్కొన్నారు. దానిలో లోపాలేమైనా ఉంటే సరిదిద్దాల్సింది పోయి మొత్తం విద్యార్థులు లేకుండా ఖాళీచేసి కోచింగ్ సెంటర్‌లకు అప్పగించడం సరైంది కాదని పేర్కొన్నారు. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 69ని తీసుకొచ్చిందని, కనీసం అక్కడ చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించిన సందర్భం కూడా లేదని తెలిపారు. అకస్మాత్తుగా వందలాది మంది విద్యార్థులను అనేక ఇబ్బందులు పెట్టి తల్లిదండ్రులకు సమాచారం లేకుండా ఉన్నపళంగా పాడేరు సహా అన్ని ప్రాంతాలకు బస్సులో తరలించారని, దీనిపై ఆగ్రహించిన తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహించారని పేర్కొన్నారు. ఆ ఉద్యమానికి ఆదివాసీ గిరిజన సంఘం, కెవిపిఎస్ సంపూర్ణమైన మద్దతు తెలియజేశాయని, నిర్బంధం ప్రయోగించినా వెనకాడకుండా విద్యార్థుల తల్లిదండ్రుల పోరాట ఫలితంగా మారికవలసలో ఆదే స్కూలులో తిరిగి అడ్మిషన్ ఇచ్చారని తెలిపారు. నేడు మరలా అదే క్యాంపస్ దగ్గరలో ఉన్న విద్యార్థినులను ఖాళీ చేయించాలని కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఈ విషయం తెలిసిన విద్యార్థినుల తల్లిదండ్రులు నిరసన తెలియజేస్తున్నారని, దీనికి మద్దతు ఇవ్వడానికి వెళ్ళిన ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు పి.అప్పలనర్స, సిఐటియు నాయకులు రాజ్‌కుమార్, ఎస్‌ఎఫ్‌ఐ విశాఖజిల్లా జిల్లా కార్యదర్శి జి.అజయ్, ప్రగతి తదితరులను అరెస్టు చేశారని వివరించారు. ఇది పచ్చి అప్రజాస్వామిక చర్యని తెలిపారు. గిరిజన విద్యకోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయాల్సింది పోయి ఇలాంటి చర్యల వల్ల గిరిజనులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుందని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతానికి విద్యకు సంబంధించి ట్రైబల్ అడ్వయిజరీ కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదని, ఇప్పటికైనా ఈ విధానాలు మానుకోవాలని కోరారు. లేనట్లయితే ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్