ఉద్యమ స్ఫూర్తిని రగిలించే పుస్తకం

Jun 10,2024 05:55 #aksharam, #book review, #sahityam

మన దేశంలో పదేళ్ల నుంచి ప్రశ్నించే గొంతుల మీద దాడి పెరిగింది. దారుణమైన చట్టాలను ప్రయోగించి, హక్కులను కాలరాసే నిరంకుశత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యమకారుడు, మార్కి ్సస్ట్‌ కార్యకర్త ప్రబీర్‌ పుర్కాయస్థ వెలువరించిన పుస్తకం ‘అలుపెరుగని పోరాటం’ కొన్ని కర్తవ్యాలను ప్రబోధిస్తోంది. ప్రశ్నించే గొంతులకు ఉత్తేజాన్ని ఇవ్వడమే కాక, ఉద్యమాలను మరింత సమర్ధవంతంగా ఎలా నిర్మించాలో వివరిస్తుంది.
2014 నుంచి దేశ ప్రజలు అప్రకటిత ఎమర్జెన్సీలో ఉన్నారు. మతం పేరుతో జరిగిన దమనకాండల్ని, అభం శుభం ఎరుగని అసీఫా లాంటి చిన్నారులపై జరిగిన అత్యాచారాలను, హత్యాచారాలను, మణిపూర్‌ నగ ఊరేగింపుల్ని దేశప్రజలు కళ్ళారా చూశారు. మన దేశంలో 1975 నుంచి 1977 వరకు 21 నెలల పాటు ఎమర్జెన్సీ కొనసాగింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ సలహా మేరకు అధ్యక్షుడు ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ 25 జూన్‌ 1975న జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 352 ప్రకారం రాష్ట్రపతి అధికారికంగా జారీ చేశారు. ఈ ఎమర్జెన్సీ 21 మార్చి 1977న ముగిసింది. ఎమర్జెన్సీ ప్రజల ప్రాథమిక హక్కులను హరిస్తుంది. అలా అక్రమ కేసులో ఇరికించబడిన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ. ఆయన అప్పటినుంచి ప్రజల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. మోడీ హయాంలోనూ ఆయన అక్రమంగా, అమానుషంగా అరెస్టుకు గురయ్యారు. ఇటీవలే నిర్దోషిగా విడుదలై పోరాట పిడికిలిని పైకెత్తారు.
ప్రబీర్‌ పుర్కాయస్థ తండ్రి కస్టమ్స్‌ అండ్‌ సెంట్రల్‌ ఎక్సైజ్‌ శాఖలో ఉద్యోగి. ఆయన దేశవ్యాప్త బదిలీల కారణంగా ప్రబీర్‌ విద్యాభ్యాసం స్థిరంగా ఒక్కచోట సాగలేదు. అలా తిరగడం వల్లేమో దేశ సమగ్ర భాషా సంస్కృతులు, వివిధ రాష్ట్రాల్లోని ప్రజల జీవనస్థితి గతులు తెలుసుకోగలిగారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలోనూ వారి కుటుంబం రెండున్నరేళ్ళు ఉంది. అక్కడి కేంద్ర గ్రంథాలయంలో ఆయన అనేక పుస్తకాలు అధ్యయనం చేశారు. మహాభారతం, రామాయణం బెంగాలీ అనువాదాలు చదివారు. పురాణాల్లోని అశ్లీల సంబంధింత అంశాలను చదివి అవాక్కైనదీ ఈ పుస్తకంలో గుర్తు చేసుకున్నారు.
అలుపెరుగని పోరాటం పేరుతో ప్రబీర్‌ పుర్కాయస్థకు సంబంధించి నాటి ఎమర్జెన్సీ నుండి నేటిదాకా అనే పేరుతో పుస్తకం తెలుగులోనూ వచ్చింది. ఇందులో ఆయన తన జీవితంలో ఇప్పటివరకు జరిగిన ఉద్యమ జీవితాన్ని రేఖామాత్ర పరిచయం చేశారు. ప్రబీర్‌ పుర్కాయస్థ వృత్తిరీత్యా సాంకేతిక నిపుణుడు. ప్రజాసైన్స్‌ ఉద్యమకారుడు. భోపాల్‌ గ్యాస్‌ లీకేజి దుర్ఘటనలో లీకేజి కారణాలను వెలికితీసి బాధితుల తరుపున పోరాటం చేశాడు. బిహెచ్‌ఇల్‌, బిహెచ్‌పివి లాంటి మ్రభుత్వరంగ సంస్థల అభివృద్ధికి దోహదపడిన కృషిలో ప్రబీర్‌ భాగస్వామి. న్యూస్‌క్లిక్‌ అనే వెబ్‌ వార్తాసంస్థను ప్రారంభించి తద్వారా ప్రజా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్ళగలిగాడు. ఇది బిజెపీ ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించింది. రాజ్యాంగ సూత్రాలకు కట్టుబడి పాలించని మనవాద పాలకులకు ప్రబీర్‌ అనతికాలంలోనే శత్రువుగా మారిపోయాడు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికిపైగా సాగిన రైతాంగ ఉద్యమం, మహారాష్ట్రలో జరిగిన రైతాంగ లాంగ్‌మార్చ్‌కు తన పత్రికలో ప్రాచుర్యం కల్పించటం మోడీ ప్రభుత్వానికి నచ్చలేదు. ఆధారాలు లేని ఆరోపణలు గుప్పించి, ఆయన్ని జైల్లో పెట్టింది. ప్రబీర్‌ ధైర్యాన్ని కోల్పోలేదు. తన ఉద్యమ జీవితాన్ని ఒక పుస్తకంగా రాశారు. దీనిని తెలుగులోకి బోడపట్ల రవీందర్‌ అనువదించగా, నవ తెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌ ప్రచురించింది. అడ్మిరల్‌ రామదాస్‌ సతీమణి లలితా రామదాస్‌, ప్రఖ్యాత చరిత్రకారిణి రోమిల్లా థాపర్‌ ఈ పుస్తకానికి ముందుమాటలు రాశారు. పుస్తకంలో ప్రతితరం ఎమర్జెన్సీని ఎదుర్కోవాల్సిందేనా?, వ్యక్తిగత ప్రయాణంలో పోరాట పాఠాలు, ఢిల్లీకి మకాం నా జీవితానికి మూలమలుపు, ఎమర్జెన్సీ ఆధీనంలో ఓ విశ్వవిద్యాలయం, జైలు జీవితం, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ చివరి అధ్యాయం, వర్తమాన రాజకీయాలు వంటి ఏడు విభాగాలు ఉన్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ తన ఉద్యమ జీవితాన్ని ఎలా తీర్చిదిద్ది సమాజానికి అందించగలిగిందో చెప్పాడు. తన ఉద్యమ జీవితంలో జరిగిన అనేక ఆటుపోట్లు, పర్యావసానాలు వివరించాడు. నాటి ఇందిర ప్రకటిత ఎమర్జెన్సీ నుంచి నేటి మోడీ షాల అప్రకటిత ఎమర్జెన్సీ దాకా సాగుతున్న దమనకాండల్ని వివరించాడు. నాటి ఎమర్జెన్సీ వార్తను ఆ రోజుల్లో ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ తన ఎడిటోరియల్‌ కాలంలో ఖాళీ స్థలాన్ని ఉంచి, నిరసన తెలిపింది. కానీ, నేటి మీడియా అంత సాహసం చేయటం లేదు. ఈ పుస్తకం ప్రబీర్‌ జైలు నుంచి విడుదల కాకముందే ప్రచురితమైంది.
న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థకు ఢిల్లీ కోర్టు ఇటీవల షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో సాక్షులను, ఆమోదించేవారిని సంప్రదించకుండా, కేసు యొక్క మెరిట్‌ గురించి మాట్లాడకుండా, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకుండా ఉండేలా బెయిల్‌ ఇచ్చింది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆయన అరెస్టు ‘చెల్లదు’ అని ప్రకటించి కేంద్రానికి షాక్‌ ఇచ్చింది. ఆయన ఏడు నెలలకు పైగా కస్టడీలో ఉన్నాడు. న్యూస్‌క్లిక్‌ ద్వారా చైనా అనుకూల ప్రచారానికి డబ్బును అందుకున్నారనే ఆరోపణలపై పుర్కాయస్థను అక్టోబర్‌ 3, 2023న ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అరెస్టు చేసి, ఎఫ్‌ఐఆర్‌లో అతనిపై ఉపా చట్టంలోని సెక్షన్‌ 13 (చట్టవిరుద్ధ కార్యకలాపాలు), 16 (ఉగ్రవాద చట్టం), 17 (ఉగ్రవాద చర్యలకు నిధులు సేకరించడం), 18 (కుట్ర), 22సి (కంపెనీలు, ట్రస్టుల ద్వారా నేరాలు) కింద కేసులు నమోదు చేశారు. ప్రత్యేక విభాగం దర్యాప్తులో భాగంగా ఢిల్లీతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లోని 88 ప్రాంతాల్లో దాడులు చేసింది. న్యూస్‌క్లిక్‌ కార్యాలయాల నుంచి దాదాపు 300 ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో చట్టపరమైన అన్నీ పద్ధతులను పోలీసులు తుంగలో తొక్కారు. అరెస్టయిన వ్యక్తిి నిర్బంధానికి గల కారణాలను తెలియజేయాలి. అదేమీ చేయలేదు. అరెస్టయిన వ్యక్తి తన న్యాయవాదిని సంప్రదించకుండా అడ్డుకుంది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యుఎపిఎ) కింద అరెస్టయిన వ్యక్తులకు దర్యాప్తు ఏజెన్సీలు ఆధారాలతో కూడిన సమాచార కాపీని అందించాలని మే 15న సుప్రీం కోర్టు ఆదేశించింది. అవన్నీ జరగనందున ఈ కేసు చెల్లదని తీర్పునిచ్చింది. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను ప్రబీర్‌పుర్కాయస్థ కోల్పోయారు. ఇలా దేశంలో ఎంతోమంది హక్కులను బిజెపి ప్రభుత్వం హరించింది. ఆదివాసీలు, మేధావులు, జర్నలిస్టులు, పౌరహక్కుల నేతలను దేశవ్యాప్తంగా 7,607 మందిని ఈ చట్టం కింద నిర్భంధించి, విచారణ లేకుండా వేధిస్తోంది. గతంలో ప్రజా ఉద్యమాలను, ప్రజాస్వామికవాదులను అణచి వేయడానికి టాడా, పోటా లాంటి చట్టాలు తెస్తే దేశ ప్రజలందరూ పోరాడి వాటిని రద్దు చేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి పోరాటాన్ని చేయాల్సిన స్ఫూర్తిని ఈ పుస్తకం కలిగిస్తుంది. బిజెపీ చేస్తున్న దురాగతాలన్నీ కళ్ళకు కట్టినట్లు ఈ పుస్తకంలో పొందుపరిచారు. నవీన సమాజ ఆవిర్భావానికి కలలు కనే ప్రతి పౌరుడూ చదవదగ్గ పుస్తకం ఇది.

– కెంగార మోహన్‌

➡️