అసమానతలపై ధిక్కార స్వరం

కుల వివక్షపై, సామాజిక అంతరాలపై కవన కరవాలాలు దూసిన కవుల్లో సతీష్‌ చందర్‌, శిఖామణి, ఎండ్లూరి సుధాకర్‌, మద్దూరి నగేష్‌బాబు, పైడి తెరేష్‌ బాబు, కలేకూరి ప్రసాద్‌ తదితరులు ముందువరసలో ఉంటారు. ఆ కోవలోకి వచ్చే కవి డాక్టర్‌ కోయి కోటేశ్వరరావు. సమాజంలో దళితులపై జరుగుత్ను అన్యాయాలకు ఆగ్రహించి ఆయా సందర్భాల్లో తన పదునైన కవిత్వ బాణాలను ఎక్కుపెట్టారు ఆయన. కోటేశ్వరరావు కవిత్వం నిదురపుచ్చేదీ, మైమరిపించేదీ కాదు; అది ఒక ఆత్మ గౌరవ స్వరం. నిదురలేపే స్వరం. ఆయన తాజాగా వెలువరించిన ‘నాగస్వరం’ కవితా సంపుటి కచ్చితంగా ఒక ఒక ధిక్కార స్వరం.

ఈ సంకలనంలో సమాజం చేసిన అన్యాయాలకు బలై గావుకేకలు పెట్టిన దళితుల గురించి రాసిన కవితలే అధికం. కవి తన తండ్రిని గురించి ‘కొత్త చెప్పులు’ కవితలో ‘మట్టి మబ్బుల్లో చెమట చుక్కల్ని నాటి/ ఎండి ఎన్నెల్ని బస్తాలకెత్తే/ నల్ల చంద్రుడని’ అభివర్ణిస్తాడు. ‘అడ్డమైన గొడ్డు చాకిరితో/ ఆరుగాలం అయ్యను పీల్చిపిప్పి చేసే/ దొరగారి దోపిడి గురించి/ పొట్ట పొడిస్తే ఆకలి పేగులు తప్ప/ అచ్చరమ్ముక్క రాని మోటోడని/ బతుకంత బాకీని/ అయ్య ఏలుముద్రకు అంటకట్టిన/ కుట్ర గురించి దండోరా ఏస్తాను’ అంటూ రెచ్చిపోతున్న ‘అచ్చోసిన ఆంబోతుని/ అడ్డంగా తెగ నరకాల్సిందే/ దీని తోలు వొలిచి/ పగిలిపోయిన అయ్య కాళ్ళకు/ కొత్త చెప్పులు కుట్టాల్సిందే’ అని తన తిరుగుబాటు బావుటా ఎగరేస్తారు.
ఈ సమాజంలో దళిత స్త్రీలు అటు సంఘానికీ లోకువే. భర్తకీ లోకువే. ఈ విషయాన్నే ‘పత్తిపూవు’ కవితలో ‘ఊరందరికీ మా అయ్య బానిసైతే/ పాపం అమ్మ, మా అయ్యక్కూడా బానిస…’ అని వాస్తవాన్ని చెప్తారు. ‘ఆడతనం అంటరానితనాల నడుమ అమ్మ/ రోకలి బండ కింద చితికిన/ దోసబద్దలా రోదిస్తుంది/ ఆకలి మంటల్లో మండుతున్న/ అమ్మ గుండె పుండు మీద/ మొగోళ్ళ పోరంబోకుతనం/ గొడ్డు కారమై వొలుకుతుంది’ అని దళిత స్త్రీ బతుకు చిత్రాన్ని ఆవిష్కరిస్తారు. పితృస్వామ్య యుగంలో స్త్రీలకు ఇంటిచాకిరీ తప్పదు. రోగమొచ్చినా, రొష్టు వచ్చినా ఇంటిపని చెయ్యక తప్పదు. పల్లెటూళ్ళలో స్త్రీలైతే తెల్లవారు జామునే లేచి సూర్యుణ్ణి నిద్ర లేపుతారు. దీనిని ఇక్కడ కవితామయంగా ‘పడమటి మంచంలో నిద్రబోతున్న/ సూరిగాడిపై చెంబెడు కళ్ళాపి చల్లి/ మా పూరి గుడిసెముందు అమ్మ/ పొద్దుటెండను పారబోస్తుంది’ అని చెప్తారు. కవి తన తండ్రిని గురించి వర్ణిస్తూ… ‘రాతిని నాతిగా మార్చిన రామపాదం కంటే/ మట్టిని పరమాన్నంగా మలిచిన/ మా అయ్య పాదమే నాకు ఆరాధ్యం/ గీతోపదేశం కంటే/ మా అయ్య శ్రమోపదేశమే/ ఈ విశ్వానికి శిరోధార్యం’ అంటూ శ్రమ తత్త్వాన్ని వెల్లడిస్తారు.

ఈ సంకలనంలో ప్రపంచీకరణ గురించీ, నకిలీ ప్రజాస్వామ్యం గురించీ, మూఢ నమ్మకాల గురించి, మితిమీరిన భక్తి గురించి వర్ణించిన కవితలు ఎన్నో ఉన్నాయి. రాజ్యహింస గురించీ, సావిత్రీబాయిని గురించిన విభిన్న వస్తువులు ఈ సంకలనాన్ని చదివింప చేస్తాయి. మార్చురీ ఉద్యోగి సలీం గురించి రాసిన ‘పరమ యోగి’ దేన్నయినా కవిత చెయ్యగలిగిన కవి ప్రతిభను వెల్లడిస్తుంది. ‘కుష్టురోగిని ఇష్టదైవంగా కొలిచిన మహాతల్లిలా/ కుళ్ళిన శవాలను ప్రాణమిత్రుల వలె/ పరామర్శిస్తావు/ వస్తువులతో కాపురం చేసే ప్రబుద్ధులు/ బతికి ఉన్న మనుషులను శవాలుగా చూస్తుంటే/ శవాలను కూడా మనుషులుగా ప్రేమించే/ కరుణా జలపాతం నీవు’ అంటూ ప్రస్తుతించారు. సావిత్రీబాయి పూలే గురించి ‘తల్లీ! నిన్ను దలంచి’ కవితలో ‘ప్రవాహంలో పడి కొట్టుకుపోకుండా/ జ్ఞానశిఖరమై ప్రవాహగతిని మార్చావు / ఆకాశంలో సగం నిండా ఆవరించిన అమావాస్యలను చెరిపేసి/ శూద్రావనిలో సూర్యోదయమయ్యావు/ కేవలం దేవుడి దయవల్ల మనిషి చంద్రమండలం మీద/ అడుగు పెట్టాడని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం/ తిరోగమన తిమిరంలో/ కొడిగట్టి పోతున్న మాకు ఇప్పుడు హఠాత్తుగా ఒక తాత్త్విక చైతన్యం కావాలి / తల్లీ! చదువుల జాబిల్లీ/ మమ్మల్ని నీ పాఠశాలలో చేర్చుకొని పిడికెడు జ్ఞానభిక్ష పెడతావా ప్లీజ్‌’ అని ఆమె జీవిత రేఖాచిత్రాన్ని గీస్తారు.

సమాజంలో రాను రాను మూఢభక్తి పెరిగిపోతుంది. పాలకులే పనిగట్టుకొని దీనిని ప్రమోట్‌ చేస్తున్నారు. బాబాల పాదధూళి కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకొన్న జనం గురించి ‘యథారాజా తథా బాబా’లో ‘చిటికెడు పాదధూళికోసం/ చెలరేగిన మూర్ఖపోరాటానికి/ పుట్టిన సామూహిక చావులు/ గుప్పెడు ఓట్లకోసం పడిన కక్కుర్తి/ అజ్ఞాన మూర్తులతో అంటకాగితే/ బజారుకో బాబా/ వీధికో ఫాదర్‌/ పేటకో మౌజన్‌ ప్రత్యక్షం/ ఆటంబాంబు కంటే/ గుడ్డి నమ్మకం అత్యంత ప్రమాదకరం/ యుద్ధం కంటే మౌఢ్యమే మహానష్టదాయకం’ అని ప్రకటిస్తారు. సంకుచిత మనస్కుడైన మనిషి స్వేచ్ఛగా ఎగిరే పక్షులకు కూడా కులం రంగును అంటగడతాడు. కోయిల పాడుతుందని గాయని కిరీటం దాని నెత్తిమీద పెట్టారు. కాకిని మాత్రం మాల కాకిగా మారుస్తారు. కాకి సహజంగా నలుపు.. ఈ వివక్షపై సంధించిన అస్త్రమే ‘మహాకవి’ కవిత. ఈ కవి స్త్రీల పక్షపాతి. ‘గొంతు తెగిన ఓ కోయిల’లో అన్యాయానికి గురైన విద్యార్థినిని పరామర్శిస్తారు. ‘ప్రేమించలేదని ప్రేమించిన అమ్మాయి మీద దాడి చేయడం ఎంత నరకం/ రాక్షసత్వం! ‘ఇప్పుడు మళ్ళీ ప్రేమోన్మాది గారిని కాదన్నందుకే/ కుండపోతగా కురిసిన యాసిడ్‌ వర్షం’ అని అంటారు కవి.

ప్రపంచంలో యుద్ధాలను ఎగదోచే అమెరికా అహంకారాన్ని ఖండిస్తూ ‘ఆధునిక వామనుడు’ కవితలో ‘యుద్ధరంగం వాడికొక రతిక్రీడ/ కాలకృత్యం తీర్చుకున్నంత సులభంగా/ యుద్ధం చేసి/ శ్మశానంలో ప్రజాస్వామ్య మంత్రాన్ని జపిస్తాడు/ ఒక్క చమురు బొట్టుకోసం లెక్కలేనన్ని రక్త సముద్రాల్ని పొంగిస్తాడు/ కుడిచేతితో శాంతి పావురాన్ని ఎగరేసి/ ఎడమచేతితో దాన్ని కాల్చి చంపే/ వృత్తి వేటగాడి హింసా ప్రవృత్తిని/ చెట్టుకీ పుట్టకీ పిట్ట కథలుగా చెప్పాలి’ అని అగ్రరాజ్యం యుద్ధోన్మాదాన్ని, హింసా స్వభావాన్ని ఎండగడ్తారు. ఇంకా ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వం ప్రదర్శించే పాలకులను నిలదీస్తూ రాసిన ఎన్నో శక్తివంతమైన కవితలున్నాయి ఈ సంపుటిలో. ప్రజలు ఏమి తినాలో, ఏమి మాట్లాడాలో రాజ్యం నిర్ణయిస్తుంది. మతోన్మాదాన్ని పెంచిపోషిస్తుంది. వీటన్నిటిపై తన ధిక్కారాన్ని తెలుపుతూ ‘కాలసర్పం’ కవితలో ‘నా కంచంలో బువ్వ మీద/ నేను నడిచే తొవ్వమీద/ నిషేధాజ్ఞల్ని జారీ చేస్తుంది కాలసర్పం/ ధిక్కరించే ఉక్కు పిడికిళ్ళను/ ప్రశ్నించే సిరాచుక్కలను పాశవికంగా తెగనరుకుతుంది కాలసర్పం’ అంటారు. ఈ నేలలో పుట్టిన ముస్లింలపై అకారణ ద్వేషాన్ని చూపించడాన్ని ‘ఈ మట్టిలో మొలకెత్తిన/ ఆకుపచ్చని నెలవంకలపై/ కారుచీకట్లను కుమ్మరిస్తుంది’ అని తన ఆగ్రహాన్ని ప్రకటిస్తారు. అంబేడ్కర్‌ ఆశయాలను గౌరవించకుండా విగ్రహానికి మాత్రం దండలు వెయ్యడాన్ని పదునైన వాక్యాల్లో నిరసిస్తారు. ‘జగమంతా విద్వేషాగ్ని రగిలించి/ ఓటు ఫిడేలు వాయిస్తుంది కాలసర్పం/ త్రివర్ణ పతాకం ఊర్ధ్వవర్ణంలో/ మనువు రాసిన వాక్యంలా/ మహావంకర్లు పోతుంది కాలసర్పం’ అని కుటిల నీతిపై కత్తి దూస్తారు. ‘నిరంతరం మతోన్మాదాన్ని జపించే/ అగ్నిగుండం అదును చూసి ఇప్పుడు/ ఆర్థిక తీవ్రవాద దాహంతో ప్రజ్వలిస్తుంది/ గుండెనిండా పడమటి గాలుల్ని శ్వాసిస్తూ/ అంటరాని చెమట చుక్కలకు/ అన్నం మెతుకుల్ని నిషేధిస్తుంది’ అంటారు. ‘నిప్పుకణాలను రగిలించి/ ధమ్మపథంలో భీమరాజ్యాన్ని లిఖిద్దాం!’ అని ఆశాభావం వెల్లడిస్తారు.
ఈ నాగస్వరం నిండా సంప్రదాయ సమాజాన్ని ధిక్కరించే తుపాకీ తూటాలు, కొరడా దెబ్బలు, సూదిపోట్ల వంటి కవితలు చాలా ఉన్నాయి. ‘దివ్య నక్షత్రం’ పేరిట ప్రొఫెసర్‌ సాయిబాబా గురించి రాసిన కవితలో ‘ఆయుధం లేకుండా/ నెత్తురుబట్టు రాలకుండా/ ఒక్క సిరాచుక్క తోనే/ మృత్యు ‘ఉపా’ఖ్యానం రాసిన మహా హంతకులు’ అని పాలకులకు చెంప చెళ్ళుమనిపిస్తారు. ఈ సంకలనం చదివాక పాఠకులు రాజ్యం క్రూర స్వభావానికి ఆగ్రహంతో రగిలిపోతారు. ‘ఏ సాహిత్య ప్రక్రియ ఐనా కానివ్వండి. నిన్ను అది ఏదో రూపంలో డిస్ట్రబ్‌ చేయాలి’ అంటాడు ఓ.వీ.విజయన్‌. అలా పాఠకుణ్ణి డిస్ట్రబ్‌ చేస్తుంది కోయి కోటేశ్వరరావు ‘నాగస్వరం.’

– మందరపు హైమవతి
94410 62732

➡️