జరిగిందో, జరుగుతున్నదో కాలాన్ని వాస్తవికంగా చిత్రించేది కవిత్వం. ఊహపేహల కవితలు, పొద్దుపుచ్చే పద్యాలు అంత పరపతి గలవేమీ కాదు. బాధితుల పక్షంగా బలంగా నిలబడ్డ కవిత్వం ఊరేగించదగింది. మోస్తోన్న కన్నీటికి కారకుల్ని గుర్తించీ, వాళ్లను సామాజికబోనులో నిలబెట్టగల ధైర్యం ఎపుడూ కవులకు కావాలి. పిరికి కలాలు వినీ వినబడనట్టు గొణుగుతాయి. బెబ్బులి గొంతుకలు పచ్చి నిజాలను గాండ్రిస్తాయి. మనుషుల్ని వెలిపెట్టి, ఊరికి ఆవలకు నెట్టి దుఃఖపెట్టే దోషులు దొరలైనా ఎండగట్టాలి. వాళ్ల దురాచారాలకు కుండగొట్టాలి. ఇవన్నీ తెలియాలంటే ‘పడమటీది నాటకం’ వినడానికి సిద్ధపడండి.
”అవిటిచేతులతోనే/ మట్టిని పిసుకుతున్నోళ్లం/ వాకిలి లేని గుడిసెల్లోనే/ మసలుతున్నోళ్లం/ బొడ్డుతాడు రాలిపడ్డది మొదలు/ కన్నీటికుండలను/ మెడకు ముంతగానో/ ముడ్డికి తాటాకులానో/ మోసుకుంటునోళ్లం/ మీకే కాదు ఈ మట్టికి కూడా/ మేమంటే ఎరుసే/ విరిసే పూలకే కాదు/ పుట్టే నలుసుకు కూడా/ వర్ణాలంటకట్టడం ఈ మట్టికలవాటే/ ఇక మా కన్నీటి గునపాలతో/ ఆ మట్టిగుండెల్లోనే/ పాతాళం దాకా సమాధులు తవ్వి/ అన్నింటికంటే ముందుగా కులంకళేబరాన్ని పాతేయ్యాలి/ పుణ్యదేశపునేల సరిపోతుందో లేదో మరి!?”
మిరప మహేష్ మరుగుతోన్న సిరా. చల్లబడిన గొంతు కాదు. నలుదిక్కులకు సామాజిక వాస్తవాలను దండోరా వేసే గొంతుక. అతడి కవితలు నిప్పులా మండుతాయి. తప్పులు జేస్తోన్న జనానికి కాకలై అంటుతాయి. మూలాల్లోంచీ పదునుగా వ్యక్తీకరించబడ్డాడు. కాస్త వాడమనుషుల భాషను కవిత్వానికి ఎక్కించాడు. మిరపమహేష్ ది వాడకట్టు పదహారం. మాపిటి, యాలగడిసి, అల్లిపోవడం, ఒబ్బిడిగా, ఎరుసు, పుంజీల్ల కొద్దీ వంటి మాటలతో తనదైన బతుకుపదాలను మేళవించాడు. అస్తిత్వం, ఆత్మగౌరవాలను ప్రస్ఫుటంగా ప్రకటించాడు. ప్రతిఘటన చేతనాన్ని విప్లవ పంథాగానూ ఆకాంక్షించాడు. తిరగబడ్డమే ప్రగతిఫలాలకు తోవంటున్నాడు. పోరాటమే శరణంటున్నాడు.
”నీ ఒక్కడితో మొదలై / వందలు వేలు లక్షలుగా/ తెగిపడు తున్న పిడికిళ్లన్నీ/ ప్రతీకార పుంతల్లో/ గడ్డకట్టని రక్తనదులై/ పచ్చిపచ్చిగా పోటెత్తుతున్నాయి/ ఎరుపెక్కిన దారులనిండా/ ఎడతెగని నీ కాలిగుర్తులు/ వెనకొచ్చే సమూహాలకీ/ పోరుచుక్కై దారిచూపుతాయి/ చీకటున్నా కళ్లు మూసుకోని/ మిణుగురుల్లా/ యుద్ధం ప్రకటించడమే ఇప్పటి కర్తవ్యం”.
సమకాలీనతను మిరప మహేష్ బాగా పట్టించుకున్నాడు. కుల వివక్ష వరకే ఆవేదన చెంది, ఆగిపోలేదు. తన జాతిని ఎలా డమ్మీలుగా చేస్తున్నారో నిలదీస్తున్నాడు. రాజకీయపు స్వరంగానూ గట్టిగానే వినబడుతున్నాడు. ”ఇంతకీ మేమరమంటే/ మనువు ఛీకొట్టిన చిట్టచివరి చెండాలులం/ ఆ మనువారసులు తరాలుగా/ తొక్కిపట్టిన శూద్రులం/ దోపిడీ వర్గాలు వాడుకునే మాలమాదిగలం/ నామినేషన్ మాది/ డామినేషన్ వారిది/ రిజర్వేషన్ కోటా మాది/ ప్రసారం మాది ప్రసంగం వారిది/ ఓటు మాది నోటు నాటు వారిది/ గెలుపుపేరు మాది/ పదవీ పెత్తనం వారిది”
స్వాతంత్య్రం వచ్చి,డెభ్బై ఏళ్లు దాటినా, అంటరానివారిగా, శూద్రులుగా, చెండాలురుగా వున్నామనీ వాపోయాడు. వార్డుమెంబరు, సర్పంచీ వంటి పదవులను కంటితుడుపుగా ఇచ్చీ,పెత్తనాన్ని బలిసినోళ్లే అనుభవిస్తున్నారనీ నిజాన్ని నినదించాడు. అందుకే దళితులు, బహుజనులు డమ్మీలు కాక డైనమైట్లుగా మారమంటున్నాడు. రాజ్యపాలనకోసం రొమ్మువిరిచి నిలబడమంటున్నాడు. అలాగే ”డోర్ డెలివరీ” లాంటి కవితల్లో దళితులపై దాడులను, హత్యాకాండలను ఖండించాడు. స్వజాతి నాయకులు హత్యాకాండలు జరిపేవాళ్ల మోచేతినీళ్లు తాగడాన్నీ, విసిరేసిన ఎంగిలి మెతుకులు తినడాన్నీ ఎద్దేవా జేసాడు. ఆత్మగౌరవాన్ని చంపుకునే దళితనాయకుల దిగజారుడుతనాన్ని ఈసడించుకున్నాడు.ఇంకా మణిపూర్లో స్త్రీలను నగంగా నడివీథులలో ఊరేగించడాన్ని సహించలేక ‘అగ్గివాన’ అక్షరాల్ని కురిపించాడు. ”ఇప్పుడు బోసిమొలల చిత్రపటమే/ మువ్వన్నెలజెండాగా మారి/ రాజ్యాంగంపై నమ్మకంతో/ తడితడిగా తలవంచుకుని ఎగురుతోంది” అని రాజ్యాంగాన్ని భరోసాగా గుర్తుజేస్తున్నాడు.
మానవ సంబంధాలను కొడవలి కొసగా వర్ణించాడు. దళితమాతల కష్టాల కన్నీటి బతుకుల్ని పదాలలో బొమ్మ కట్టించాడు. అయితే మిరప మహేష్ అక్షరాలు వాడకే పరిమితం కాదు. వస్తువుకి విస్తృతిని అద్దాడు. కలానికి విశ్వాన్ని అంటుగట్టాడు. దీనజగతికి విశ్వాసాన్ని రేపాడు. మిరప కవిత్వంలో మిరపకాయతనం వుంది. ఘాటైన అక్షరాలు వున్నాయి. అది ధర్మాగ్రహమైన ఘాటే. అలాగే కళాత్మకతలో మంచి ప్రయత్నమూ వుంది. ఆలంకారిక శాస్త్రాన్ని వర్ణాలమధ్య నిపుణంగానే అద్దగలిగాడు. తన రెండవ అడుగులో మెరుగుదనం ప్రతిఫలించింది. గుర్తుండిపోయే పంక్తులెన్నో తనదైనవి రాసాడు. ఎటు నిలవడాలో అటు నిలిచాడు. అతడి కళాత్మక పాదాలను కొన్ని పరిశీలించండి.
1.సెమటతో తడిచి పొరలుపొరలుగా/ తెల్లని ఉప్పుసారలు పట్టిన అమ్మ/ ఇప్పుడు ఓ సజీవ బతుకుమడి.
2. ”పనడు గడ్డిపరకలు/అరతూముడు కుడితినీళ్లకోసం/ ఒళ్లు చీరి తట్లు తేలేలా/కొల్లాకర్ర దెబ్బలు తింటూ/సాల్లు తప్పక/ నాగలికాడె మోస్తోన్న/జోడెద్దులను చూస్తుంటే/ పొద్దుటే సిలువ శ్రమయాత్ర/ కళ్లముందు కదలాడింది”
3. ”జైళ్లలా ఇళ్లన్నీ విశాలమే/ మనుషులే బాగా ఇరుకు/కరకు మాటలు/కంట్లో నలుసులై/ మెరుగుతున్నంతకాలం/ ప్రాణాలు ఒంటరైపోతున్నాయి”
మిరప మహేష్ దళిత జీవిత కవిత్వంలో శ్రమతనాన్నీ, వెట్టినీ రాయడంతో పాటు, అనేకసార్లు ”రాజకీయం మాకు తగదా”? అనే ప్రశ్నల్ని సంధించాడు. చాలా కవితల్లో సూటిగా మాట్లాడ్డం మహేష్ ప్రత్యేకత. వ్యంగ్యంగానూ కొన్ని ముగింపుల్ని కళశోభగా తీర్చిదిద్దాడు. అయితే మెటాఫర్ల మోజు అవసరం లేదనిపించింది. అలంకారాలో, భావచిత్రాలో రాస్తేనే కవిత్వమనే వాదం వుంది. అది అపవాదన కూడా. గుల్జార్ లాంటి కవులలో సరళమైన అభివ్యక్తితో పాఠకుల్ని సంపాదించుకునే గుణం వుంది గదా. కళాత్మకత శిల్పాన్ని కుదుర్చుకోవడంలోనే చాలావరకు దాగుంది. దళిత కవిత్వంలో పురాణప్రతీకలు, సౌందర్యాత్మకత, ధ్వని మెండుగా వుండాలి. సూటిదనపు వచనానికి కొన్ని ఎదురుదాడుతుంటాయి. ఈ మిరప మహేష్ కవిత్వం దరిదాపు ఫలవంతమైన కవిత్వం. సామాజిక స్వరాన్ని నిజాయితీగా, నిబద్ధంగా రాసాడు. ప్రశ్నించడం, నిశితంగా వర్తమానాన్ని పరిశీలించడం, తర్కించడం వంటి సల్లక్షణాలు మెండుగా వున్న ఈ కవికి అభినందనలు.
– మెట్టా నాగేశ్వరరావు
99510 85760