తెలుగు నాటక చరిత్ర సుసంపన్నంగా శోభిల్లడానికి ఎందరో మహానుభావుల త్యాగాలు వెన్నెముకగా నిలిచిన సంగతి విజ్ఞులందరికీ తెలిసిందే. ఆ వైభవ పల్లకీని భుజాల మీద మోసిన ధృవతారలు అందించిన సేవలను, వారి జీవితాలను వ్యాసాల రూపంలో ‘నాటక బంధం’ అనే పుస్తకంగా అందించారు నటుడు, నాటక రచయిత, సాహిత్య, సాంస్క ృతిక, నాటకరంగాల అధ్యయనశీలి బి.వి.అప్పారావు. ఈ పుస్తకం నిండా ఎన్నో విశేషాలు ఉన్నాయి.
‘హరికథా’ కళారూపాన్ని రూపుదిద్ది తెలుగు శ్రోతలను ఆధ్యాత్మిక కళా సాగరాల్లో ఓలలాడించిన – శ్రీ మదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారి జీవిత, కళారంగ విశేషాలు ఆత్మీయంగా పలకరిస్తున్నాయి. ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని మన రాష్ట్ర గీతాన్ని అందించిన శంకరంబాడి సుందరాచారి గారి జీవిత రహదారుల్లో మహావృక్షాల్లా నిలిచిన ఎన్నో సంగతులు ఈ పుస్తకంలో పలకరిస్తాయి. ఆధునిక నాటక సోమయాజి కుర్మా వేణుగోపాల స్వామినాయుడు గురించిన సంగతులు అక్షరబద్ధమై ఉన్నాయి. రాగద్వేషాలకు అతీతంగా సాహిత్య, సాంస్క ృతిక రంగాల్లో కృషి చేసిన కళాప్రపూర్ణ గణపతిరాజు అచ్యుత రామరాజు గారి చిరునవ్వులు ఈ పుస్తకంలో ఉన్నాయి. రచయిత రావి శాస్త్రి మరో విశిష్ట కోణాన్ని ఆవిష్కరించిన ప్రయత్నం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలన్న నినాదం బళ్లారి రాఘవ గారిదైతే, తన కుటుంబ స్త్రీలను నాటకరంగ ప్రవేశం చేయించిన ఘనత ఆర్.వి.చలం గారిది. ఆయన గంభీర కంఠం ఈ పుస్తకం వేదికగా మనకు వినిపిస్తోంది. బహురూప నటచక్రవర్తి కుప్పిలి వెంకటేశ్వరరావు గారి విశేషాలను ఈ గ్రంథంలో తిలకించవొచ్చు.
రంగస్థలం మీద నాటకం కోసం తపస్సు చేసిన ఋషి కొత్తుర్తి భాస్కరరావు. ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని అంగవస్త్రంగా ధరించిన ఆ మహాను భావుడి శాంతి, సహనాలు ఈ పుస్తకంలో వెలుగొందుతున్నాయి. తన నటనకు పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య గారి ప్రశంసలు పొందిన రుద్రరాజ్ కుమార్ రాజా ధరించిన జగ్గడు పాత్ర ఈ పుస్తకాన్ని అలంకరించిన ఒక విశేషం. విశాఖ నాటక కళామండలి దత్తపుత్రుడు దుగ్గిరాల సోమేశ్వరరావు నటించిన నా బాబు, పద్మవ్యూహం, దొంగ, తిరస్కృతి… మొదలైన నాటిక, నాటకాల్లోని ఆయన నటన ఎప్పటికీ చెదరని ఎల్లోరా శిల్పాల సరసన దర్జాగా స్థానం సంపాదించుకుంది. తెలుగు నాటకరంగంలో ‘రావూజీ’ అన్న పేరు ఒక సంచలనం. రికార్డుల మోతకు కేరాఫ్ అడ్రసుగా మారిన ఆయన నటజీవిత రంగుల చిత్రం ఈ పుస్తకంలో నమోదై ఉంది.
అపారమైన రాజకీయ పరిజ్ఞానం, అర్థ, అంగబలాలు కలిగిన పిళ్లా అప్పలనాయుడు సేవ, సాంస్కృతిక రంగాల వారధిగా చరిత్ర సృష్టించిన అంశాలు ఈ పుస్తకంలో ఆవిష్క ృతం అయ్యాయి. నటనాలయం నాటక రచయిత మోదుకూరి జాన్సన్ చాలాముందు చూపున్న కవి, రచయిత. అందుకు సాక్ష్యంగా సంతకాలు పెట్టడానికి ఈ పుస్తకంలోని ఆయన విశేషాలు పోటీపడుతున్నాయి. కిన్నెర- ద్వానా శాస్త్రి స్మారక పురస్కారం అందుకున్న పాత్రికేయుడు గుండు వల్లీశ్వర్ ప్రస్తావన, విశేషాలూ ఈ పుస్తకంలో మనం చదవ్వొచ్చు. దాదాపు అయిదున్నర దశాబ్దాలు రచనకు అంకితమైన నిరంతర చైతన్యశీలి భీశెట్టి లక్ష్మణరావు. తన గుండెలో నాటకానికి గుడి కట్టిన నాటకరంగ ప్రేమికుడుగా ఆయన చిత్రపటం ఈ పుస్తకంలో దర్శనమిస్తోంది. నాటకం కోసం పరిషత్‌లు నడిపి తీవ్రంగా నష్టపోయినా సరే, తిరిగి అదే నాటకానికే అంకితమైపోయిన బి.ఎస్. చలం గారి దీక్షను ఇక్కడ గమనించవొచ్చు.
టిక్కెట్టు పెట్టి ‘అడవి దివిటీలు’ నాటకాన్ని 51 రోజులు ప్రదర్శించిన రికార్డుకు కారకులైన స్టార్ మేకర్ లంక సత్యానంద్ దర్శకత్వ ప్రతిభకు ఆనాడు మారుమ్రోగిన చప్పట్లు తిరిగి ఈ పుస్తకంలో డప్పుల్లా మ్రోగుతున్నాయి. హాస్యాన్ని తన భుజాల మీద ఊరేగించటానికి ఇష్టపడే నటుడు, దర్శకుడు బొట్టా వేణుగోపాలరావుకు సంబంధించిన నాటకరంగ విజయాలు, రహస్యాలు ఈ పుస్తక పుటల్లో నిలబడి వున్నాయి. శివుడికి నందీశ్వరుడు ఎలాగో, నాటకానికి భళ్ళమూడి రామమూర్తి అలాంటివారు. నాటకానికి ఆయన అందించిన సేవ ఈ పుస్తకంలో ఉంది. పర్వతమంత ప్రతిభను కలిగివున్నా అతి సామాన్యంగా కనిపించే కరి పద్మనాభాచార్యులు అజో-విభో- కందాళం ఫౌండేషన్ వారి సన్మానాన్ని పొందిన సందర్భం, విశాఖ కంఠాన మణిహారంగా నిలిచింది. తెలుగు నాటకరంగంలో నిష్కామ కర్మయోగిగా పేరొందిన డా. డి.ఎస్.ఎన్.మూర్తి నియమ నిబంధనలతో చేస్తున్న కళాసేవ… రాబోయే తరాలకు సైతం ఒక చక్కటి పాఠశాలగా దర్శనమిస్తోంది.
నాటకాన్నే శ్వాసగా మార్చుకున్న మహానటి కె.విజయలక్ష్మి గారి రంగస్థల విశేషాల ఎత్తులు ఈ పుస్తకంలో కొలువు తీరి ఉన్నాయి. తెలుగు నాటకరంగంలో చాలా గర్వంగా వినిపించే పేరు పిళ్ళా సన్యాసిరావు. ఆయక కృషీ, సాధనా ఈ గ్రంథంలో పలకరిస్తోంది. గంభీరమైన నటనకు వారసుడుగా తగిన ముద్రను సంపాదించుకున్న ఎస్.ఎ. శ్రీరామమూర్తి గారి నాటకరంగ రేఖాచిత్రాలు, వాటి సత్తువలో రవివర్మ చిత్రాల సరసన చేరుతున్నాయి. దశాబ్దాలు గడిచినా హాస్యమనే ద్వారానికి అందమైన మామిడాకు తోరణంగా మారిన అత్యంత సహజ నటుడు సుత్తివేలు. ఆయన నటన, హాస్యానికి ప్రాణవాయువును విడుదల చేసే ఒక మహా వనంలా ఈ పుస్తకంలో అలరిస్తోంది. నాటకరంగ ప్రేక్షక ఖాతాదారులకు ఓ ఫిక్సిడ్ డిపాజిట్‌గా రాణించిన కొడుకుల వెంకట సుబ్బారాయుడు; ‘పలుకే బంగారమాయె’ నాటకంలో గిరీశం పాత్రకు జీవం పోసిన పి.ఆర్.జె.పంతులు; సాంఘిక నాటకరంగ నటుల్లో అరుదైన వ్యక్తిత్వం, క్రమశిక్షణ కలిగిన పైడికొండల జగన్నాధరావు; హరికథ కళారూపంతో హేతువాద దృక్పథాన్ని ప్రకటించిన గొప్ప కళాకారుడు సలాది భాస్కరరావు; ‘గయోపాఖ్యానం’ ద్వారా పి.వి నరసింహారావు గారి ప్రశంసలూ, అనేక నంది బహుమతులూ పొందిన డా. మీగడ రామలింగస్వామి గార్ల విశేషాలను జాగ్రత్తగా దాచుకునే గొప్ప సంపదలుగా ఈ పుస్తకం అందిస్తోంది.
విశాఖ నాటక కళాపరిషత్‌కు దాదాపు దశాబ్దం పైగా ప్రధాన కార్యదర్శిగా సేవలందించిన పి.ఎస్.నాయుడు, తెలుగుభాషా సంస్కృతుల ఆరాధకులు దూసి ధర్మారావు, రెండు తరాలు పూర్తిగా మేకప్ రంగానికే అంకితమైన కుటుంబంలో జన్మించి, తరగని పేరు ప్రఖ్యాతలు పొందిన భరణి; హాస్యానికి కారణజన్ముడిగా జన్మించిన బ్రహ్మానందం, సంభాషణల గనిగా అటు నాటకరంగంలోనూ, ఇటు సినిమారంగంలోనూ కీర్తించబడిన గణేష్ పాత్రో…. వీరందరి ప్రతిభా విశేషాలు వ్యాసాలుగా ఈ పుస్తకం అందిస్తోంది.
ఈ పుస్తకం నిండా కొన్ని దశాబ్దాల నాటకరంగ చరిత్ర వుంది. వివిధ దశల్లో రంగస్థలాన్ని ఆక్రమించుకున్న పరిణామాలు, మార్పులు, చేర్పులు, దర్శకత్వ ప్రతిభలు, నటనా కౌశల్యానికి పట్టిన హారతులు, సువర్ణాక్షరాలతో లిఖించదగిన సందర్భాలు, సన్నివేశాలు, నాటకరంగ గౌరవ మరియాదలు… ఒక్కటేమిటి? వైభవోపేతమైన నాటకరంగ సారస్వత సంపద యావత్తు ఈ పుస్తకం నిండా పరుచుకొని ఉంది. ఈ అపురూపమైన గ్రంథ రూపకల్పనలో ఎంతో శ్రమపడిన బి.వి. అప్పారావు గారి అభిరుచి, సంకల్పమూ అభినందనీయం. ఎన్నో గ్రంథాల్లో నిక్షిప్తమైన నాటకరంగ వైభవాన్ని ఒకే పుస్తకంలో అందించడమే కాకుండా వాటికి తోడు నాటక రంగానికి సంబంధించి తాను రాసిన తొమ్మిది వ్యాసాలను ఆయన ఇదే పుస్తకంలో పొందుపర్చారు. పుస్తకం కోసం రచయితను 93470 39294 నెంబర్లో సంప్రదించొచ్చు.
– డాక్టర్ కె.జి.వేణు
98480 70084