జీవిత తాత్వికతను వివరించే నవల

Jan 20,2025 04:02 #book review

అసలు జీవితం ఏమిటి? ఎలా జీవిస్తున్నాం? దాన్ని ఎలా గడుపుతున్నాం? అసలు జీవిత అనుభవాలు అంటే ఏమిటి? ఏ పరిస్థితుల ప్రభావాలు మన జీవితం మీద ఎలా కొనసాగుతున్నాయి? అసలు మనం జీవిస్తున్నామా? లేక ఏదో ఒక గుంజకు మనల్ని మనం కట్టేసుకుని ఆ గుంజ చుట్టూ తప్పనిసరై తిరుగుతున్నామా? ఈ ప్రశ్నలు రేకెత్తించి వాటికి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది ‘తాకట్టులో రఘునాధ్‌’ నవల. రేహన్‌ పర్‌ రఘ్గూ కాశీనాథ్‌ సింగ్‌ హిందీ రచన. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల. దీనిని ఆచార్య పేరిశెట్టి శ్రీనివాసరావు తెలుగులోకి అనువదించగా, కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. మూల రచయిత రాసిన కథా వాతావరణానికి, పాత్రల స్వభావానికి, కథా కాలపు వర్తమాన సామాజిక పరిస్థితులకు ఎక్కడా తేడా రాకుండా అనువాదం సాగింది.
రఘునాథ్‌ అనే 71 ఏళ్ల వృద్దుడు చెబుతున్న కథ ఈ నవల. తన అనుభవాలనుంచి చెబుతున్న కథ. అసలు అనుభవాలే లేకపోతే జీవించడం ఎందుకు? అనే ప్రశ్నతో నవల ప్రారంభమవుతుంది. హోరుగాలి, ధారాపాతమైన వర్షంలో తడవడానికి 71 ఏళ్ల వయసులో రఘునాథ్‌ తన ఇంటిలో నుంచి ప్రకృతి ఇచ్చే వర్షంలో తడిసే అనుభవాన్ని పొందడానికి చేసే ప్రయత్నంతో నవల ప్రారంభం అవుతుంది. ముగింపుకు ముందు చాప్టర్‌ కూడా ఇదే వర్ణన చేస్తారు రచయిత. ప్రకృతిలో తనకు తాను లీనమవ్వాలి, తన శరీరం నిండా ప్రకృతిని ఆస్వాదించాలి అనుకుని బయలుదేరతాడు. ఆ అనుభవం ఎలా ముగుస్తుంది? దాని పర్యవసానం ఎలా ఉంటుంది? ఇదే ఈ నవలంతా విస్తరించిన జీవన దృశ్యం. మనిషి తాను తన సహజ ప్రకృతికి అనుగుణంగా జీవించాలని అనుకుంటున్నాడా? అలా అనుకుంటే ఈ ప్రకృతిలోని బంధాలు ఆస్వాదించనియ్యవు సరిగదా అశక్తుణ్ణి చేస్తాయి. ఇది రఘునాథ్‌ పాత్రకు సంబంధించిన అంశం. కానీ రఘునాథ్‌తో ముడిపడి ఉన్న పాత్రలు బంధాలు అతన్ని ఏ రకంగా పట్టి ఉంచుతున్నాయో ఈ నవల వివరిస్తుంది.
చచ్చినా బతికినా కుటుంబం కోసం, కులం కోసం, గ్రామం కోసం అనుకునే స్థితి రఘునాథ్‌ జీవితం ప్రారంభించాడు. కాలం మారింది. పేపర్లు, సెల్‌ ఫోన్లు, కోచింగులు, పరీక్షలు, కాంపిటేటివ్‌ టెస్టులు పేరుతో కాలక్షేపం చేసే పరాన్న జీవ యువత తయారవుతున్న పరిస్థితుల్లోకి ఈ నవల మనల్ని నడిపిస్తుంది. ఒక పాత విలువకి కట్టుబడిపోలేక పోవడం,.కొత్త విలువకి సర్దుకుని పోలేకపోవడంతో ఉండే ఊగిసలాట ధోరణి కూడా కనిపిస్తుంది. మూడు భాగాలుగా ఉన్న నవలలో మొదటి భాగంలో రఘునాథ్‌ కుటుంబం, రెండో భాగంలో తన గ్రామం, మూడవ భాగంలో బెనారస్‌ అశోక్‌ విహార్‌ ఇంట్లో చిత్రితమవుతాయి.
రఘునాథ్‌ బెనారస్‌ ప్రాంతంలోని పహాడ్‌ గడ్‌ గ్రామవాసి. ఠాకూర్‌ సామాజిక తరగతికి చెందినవాడు. సంస్కారం, ఆలోచనాశక్తి ఉన్నవాడు. తన గ్రామానికి దగ్గరగా ఉన్న కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేశాడు. తను చదువు చెప్పే పిల్లలకి, తన గ్రామస్తులకీ జీవితంలో ఎదగడానికి, ఉద్యోగాలు సంపాదించడానికి సాయం చేశాడు. పెద్ద కొడుకు సంజరుని కంప్యూటర్‌ కోర్సు చదివించారు. రఘునాథ్‌ కళాశాల కరస్పాండెంట్‌ తన కూతుర్ని సంజరుకి ఇవ్వాలనుకున్నాడు. దానికి రఘునాథ్‌ కూడా అంగీకరించాడు. కానీ, సంజరు తన ప్రొఫెసర్‌ కుమార్తెను వివాహం చేసుకుని అమెరికా వెళ్లిపోయాడు. దీని పర్యవసానంగా రఘునాథ్‌ నానా అవమానాలు పడి వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకోవాల్సి వచ్చింది.
కూతురు సరళ ఎంఏ; బీఈడీ చేసి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. ఆమెకు సంబంధాలు చూస్తున్నప్పుడు సుదేష్‌ భారతి అనే చమార్‌ కులస్తుణ్ణి చేసుకుంటానంటుంది. రఘునాథ్‌ తీవ్రంగా కోప్పడతాడు. కానీ సరళ ‘నాన్నా, మీరు ఇతరుల షరతులతో నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, నేను నా షరతులతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’ అని చెప్పి వెళ్ళిపోతుంది. రెండో కొడుకు ధనుంజరు బీకాం పూర్తి చేస్తాడు. ఎంబిఏ చేసి విపరీతంగా సంపాదించాలని అతని కోరిక. రిజర్వేషన్ల వల్ల తనకు సీటు వచ్చే అవకాశం లేదని, అహ్మదాబాద్‌లో ఫీజు కట్టే కాలేజీలో చేరతానని తండ్రితో గొడవ పడతాడు. ‘నీ బతుకు నువ్వు బతకరా’ అంటే సంజరు విషయంలోనూ, సరళ విషయంలోనూ ఈ మాట ఎందుకు అనలేదని ఎదురు ప్రశ్నిస్తాడు. ఎంబిఎలో చేరుతాడు. అక్కడ చదువు సంగతి ఏమో కానీ, ఒక బిడ్డ ఉన్న ఉద్యోగస్తురాలైన వితంతువుతో సహజీవనం చేస్తూ ఉంటాడు. బతికినా కుటుంబం కోసమే అన్న రఘునాధ్‌ నమ్మకం సడలిపోతూ ఉంటుంది. పెద్ద కొడుకు సంజరు భార్య అమెరికా నుంచి బెనారస్‌ వచ్చి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా చేరుతుంది. అత్తని మామని తనవద్దకు రమ్మని ప్రాధేయపడుతుంది. తండ్రి కొనిచ్చిన అశోక్‌ మహల్‌లో ఒంటరిగా ఉండడానికి ఆమెకు భయం. ఆ కాలనీలో ఒక్క సంవత్సరంలోనే ఒంటరిగా ఉన్న ముగ్గురిని హత్య చేశారు.
రఘునాధ్‌, ఉద్యోగ విరమణ తర్వాత స్వగ్రామం చేరతాడు. గ్రామంలో ఒకప్పటి పరిస్థితులు మారిపోయాయి. ఠాకూర్‌ యువకులంతా వ్యవసాయం చేయడం మానేసి దగ్గర్లో ఉన్న బెనారస్‌కి, మిగిలిన పట్టణాలకు వెళ్లి చదువులు, పరీక్షలు పేరుతో గ్రామానికి దూరంగా ఉంటున్నారు. ఏ పనీ చేతకాని వారిలా తిరుగుతున్నారు. మిగిలిన ఠాకూర్లు గ్రామంలో తమ ఆధిపత్యం కోసం పాకులాడుతూ ఉంటారు. గ్రామంలో చమార్లు వ్యవసాయ కూలీ పెంచమని అడగడంతో గొడవ ప్రారంభమైంది. కూలి విషయమై వారితో మాట్లాడడం మంచిదని చెబుతాడు రఘునాథ్‌. వారితో మాట్లాడటం అంటే వారికి లొంగడం అని ఠాకూర్లు భీష్ముంచుకు కూర్చుంటారు. చమార్లు పనిచేయకపోతే వ్యవసాయం సాగదు. ఈ సమస్యకు పరిష్కారంగా గ్రామంలో ఉన్న యువకులు ట్రాక్టర్లు నడపటం నేర్చుకుంటే మంచిదని రఘునాథ్‌ చెబుతాడు. ‘మీ పిల్లలు ఉద్యోగాలు చేయాలి మేము మాత్రం ట్రాక్టర్లు నడపాలా?’ అని యువకులు ప్రశ్నిస్తారు. దశరథ్‌ యాదవ్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకుని గ్రామానికి ట్రాక్టర్‌ తీసుకొస్తాడు. ఊళ్లోవాళ్లు ఆ ట్రాక్టర్‌తో పనులు చేయించుకోవడం ప్రారంభించారు. తన అన్న కొడుకులను చదివించిన రఘునాథ్‌ పెద్దవాడికి ఎలక్ట్రికల్‌ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వేయించాడు. వాడు, వాడి తమ్ముళ్లు రఘునాథ్‌ ఇంటి స్థలం ఆక్రమించి దాన్ని అడిగినందుకు కొడతారు. కొడుకులకు ఈ విషయం చెబితే వాళ్లేమి పెద్దగా స్పందించరు. ఇంకా చాలా చేదు అనుభవాలు ఎదురవుతాయి. తన తల్లిదండ్రులు ఇచ్చిన భూమి ఇంతకాలం పంటతో తమని బతికించింది. కొడుకులు ఆ భూమిని అమ్మి వేయమంటారు. గ్రామ సంబంధాలు కూడా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇక అక్కడ ఉండలేననిపిస్తోంది. అప్పడే కోడలు సోనల్‌ బెనారస్‌ వచ్చి అశోక్‌ విహార్లో ఉండమని ప్రాధేయపడింది. నిజానికి ఆమెని సంజరు సరిగా పట్టించుకోకపోవడం వల్లే దేశానికి వచ్చింది. సోనల్‌తో సరిపడక రఘునాథ్‌ భార్య కూతురు దగ్గరకు వెళ్లిపోయింది. రఘునాథ్‌ కోడలి దగ్గరే ఉంటాడు. జీవితంలో ప్రధానమైన భాగాన్ని ఎవరి కోసమైతే ఖర్చు పెట్టాడో వారి నుంచి క్రమక్రమంగా దూరంగా జరుగుతూ ఉన్నాడు రఘునాధ్‌.
పెద్ద కొడుకు ప్రతి సంబంధాన్ని తను ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకున్నాడు. చదువుకు తండ్రి, అమెరికా వెళ్లడానికి సోనల్‌తో పెళ్లి. అమెరికాలో మరో మెట్టు ఎక్కడానికి ఆరతీ గుర్జర్‌తో ప్రేమ. రెండవ కొడుకుకి తను కష్టపడకుండా సంపాదించుకోవడం ఇష్టం. దాని కోసం పెద్ద ఉద్యోగం చేస్తున్న వితంతువుతో కలిసి ఉంటున్నాడు. ఆ సంబంధాన్ని కొనసాగించడం వెనక భ్రమా లేదు, ప్రేమా లేదు, నమ్మకం కూడా లేదు. తను కష్టపడకుండా గడపాలనే అవసరం మాత్రమే ఉంది. తమ కళాశాలలో వయసులో పెద్దవాడైన లెక్చరర్‌ను సరళ ప్రేమిస్తుంది. వారి సారనాథ్‌ ప్రయాణం చేదు జ్ఞాపకంగా మిగులుతుంది. ఉద్యోగం సంపాదించిన సరళ యూనివర్సిటీలో తన క్లాస్‌మేట్‌ సుదేష్‌ భారతితో హోటళ్లకు, పిక్నిక్కులకు వెళుతూ ఉంటుంది. కూతురు తక్కువ కులం వాణ్ణి చేసుకుంటానంటే అంగీకరించని రఘునాథ్‌ ఇప్పుడు ‘వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నా బాగుంటుంది’ అని భార్యతో అంటాడు.
కోడలు సోనల్‌ యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు తన కంటే సీనియర్‌ అయిన సమీర్‌ను చేసుకోవాలనుకుంటుంది. ‘సామాజికోద్ధరణ అని తిరిగేవాళ్ళు పెళ్ళాం సంపాదన మీద ఆధారపడి తెల్లారి లేచాక ఎవడు కాఫీ పోయిస్తాడు, ఎవడు టిఫిన్‌ పెట్టిస్తాడు అని వీధిలో తిరుగుతారు. చేసుకోవద్ద’ని చెబుతాడు తండ్రి. సంజరుని ఇచ్చి పెళ్లి చేస్తాడు. అది విఫలమయ్యాక – తాను ఉద్యోగం సంపాదించుకొని తనదైన జీవితం తనకి వచ్చిన తర్వాత సోనల్‌ సమీర్‌ని కలుస్తుంది. అతన్ని తీసుకొచ్చి మామ గారికి పరిచయం చేసి మన ఇంట్లో ఉంటాడని చెబుతుంది.
నవల చివరలో వర్షంలో తడవడానికి వెళ్లి పడిపోయిన రఘునాథ్‌ను సమీర్‌ లోపలికి తీసుకువస్తాడు. కొన్ని సపర్యల తర్వాత స్ప ృహలోకి వస్తాడు. సోనల్‌, సమీర్‌ సాన్నిహిత్యాన్ని గమనించి, మనసులో ఆశీర్వదిస్తాడు రఘునాథ్‌. జీవితంలో ఇంతకాలం తాను చాలా వదులుకుని సంపాదించుకున్న బంధాలు తనవి కానివైపోతున్నాయి. అనుభవాలు జ్ఞాపకాలు మినహా ఈ వయసులో ఏ కట్టుగొయ్య తనని కట్టి ఉంచింది లేదు. నవల ముగింపు ఆలోచింపచేసేదిగా ఉంటుంది. ఈ నవల తాత్వికతను పట్టి ఇస్తుంది. వర్షంలో తడిచి కాస్త కోలుకున్న తర్వాత కర్ర సాయంతో బయటకు వెళ్లి వస్తూ ఉంటాడు రఘునాథ్‌.
ఒక రోజు తన అన్న కొడుకులు పంపిన ఇద్దరు అతని దగ్గరకు వచ్చి తుపాకీతో బెదిరించి పొలం దస్తావేజులు మీద సంతకం పెట్టమంటారు. ఈ పని చేయడానికి అన్న కొడుకు లక్ష రూపాయల సుపారి ఇస్తున్నట్టు తెలుసుకుంటాడు రఘునాధ్‌. ‘మీకు రెండు లక్షలు ఇస్తాను. నన్ను కిడ్నాప్‌ చేయండి’ అంటాడు. ‘నా కొడుకులు ఉన్నారు. రెండు లక్షలు ఇవ్వడం వాళ్లకి కష్టమైన పని కాదు. వాళ్ళు ఇవ్వకపోతే నేనే ఇస్తాను. నన్ను కిడ్నాప్‌ చేయండి’ అని వాళ్ల వెంట వెళ్లడంతో నవల ముగిసిపోతుంది.
రఘునాథ్‌ ‘నేను రెండు లక్షలు ఇస్తాను. మా అన్న కొడుకుని చంపేయమ’ని వాళ్లతో చెప్పలేదు. ఇప్పటివరకు సంప్రదాయం నుంచి వచ్చిన, చావైనా బతుకైనా కుటుంబం కోసం అనే విలువతో తన శక్తిని ధారపోశాడు. పిల్లలు ఈ సమయంలో ఎలా రియాక్ట్‌ అవుతారో ప్రతిస్పందిస్తారో చూడాలనుకునకున్నాడు. ఇప్పటివరకు తన జీవితాన్ని ఏదో ఒక బంధం కోసం ముడి పెడుతూ ఏదో పొందడం కోసం మరేదో కోల్పోవడం జీవితం అంతా సాగుతూనే ఉంది. అందుకే పిల్లలు ఇవ్వకపోయినా ఆ డబ్బు నేనే ఇవ్వగలను అని వారి వెంట నడుస్తాడు. బాధ్యతలు, ప్రేమలు. కట్టుబాట్లు, భ్రమలు, నమ్మకాలతో జీవితం కూడా తాకట్టు వస్తువులా తెచ్చుకోలేనంతగా కిడ్నాప్‌ అవుతోంది. ఈ కిడ్నాపుతో మన జీవితాన్ని బలవంతంగా పట్టుకుపోతున్నారు. అందుకే వారి వెంట అయినా నా ఇష్టంతోనే నడవాలి అనే ఒక జీవన దక్పథంతో నవలని ముగిస్తారు. తన వ్యక్తిత్వాన్ని తన స్వేచ్ఛని నిర్బంధించిన కుటుంబాన్ని, సమాజాన్ని, గ్రామాన్ని దాటి తనంతట తానే తన ఇచ్ఛాపూర్వకంగా నడవాలి అనే ఒక ప్రాథమిక దక్పథాన్ని నవల ద్వారా వినిపిస్తారు. జీవిత తాత్విక చర్చల్ని చేసిన నవలని తెలుగు పాఠకులకు అందించినందుకు పేరిశెట్టి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు.
– డాక్టర్‌ చిలుకోటి కూర్మయ్య
83329 80181

➡️