చుక్కల ఒళ్ళో తలపెట్టి నిద్రపోతూ
మధ్య మధ్యలో వెక్కుతున్న చంద్రుడు
కాళ్ళతో నేలను దువ్వుతూ
సముద్రం ఇంకా రంకెలేస్తూనే వుంది
చెట్టు కాళ్ళకు ఆఖరిసారి దణ్ణం పెట్టుకొని
ప్రాణాలు విడుస్తున్న పువ్వులు
నీటిమీద పడవల్లా తేలుతున్నాయి
జోరు తగ్గని వరద
ఏ కనుపాపల పైనా నిద్రను వాలనివ్వడం లేదు
రేపటి మీద ఆశను వదిలేసుకున్న రైతు
వెనుదిరిగి వెళ్ళిపోయాక
వర్షం కూడా ఆత్మహత్య చేసుకుంది
తన చేత్తో తానే కళ్లు పొడుచుకున్న
మనిషొకడు
చీకట్లో చూపు కోసం ఒంటరిగా ఏడుస్తున్నాడు
ఆకాశం పిల్లలతో బంగారు గుడ్లు పెట్టే బాతు కథ
గుర్తుందా అని అడుగుతోంది
ఇంటి మధ్యలో
హఠాత్తుగా మొలిచిన నీటిచెట్టు
ఖాళీ చేసిన గదుల్లో
జ్ఞాపకాలు కొట్టుకుపోగా మిగిలిన శూన్యం
ఏ నక్షత్రాల నీడా పడని రాత్రి
చెంపలమీదుగా జారి గడ్డకట్టిన ప్రార్థన
ఉండుండి
ఒక ఉల్క రాలి
భూమిని మొత్తం కాంతితో నింపుతోంది!
– సా.మూ
9642732008