పాతికేళ్ల క్రితం దేశాభిమానిగా ఉండి, తరువాత సాహితీ స్రవంతిగా అవతరించిన సాహిత్య సంఘానికి కర్నూలులో ఒక కార్యాలయం ఏర్పడింది. సీనియర్ సిపిఎం నాయకుడు తెలకపల్లి నరసింహయ్య ఆరవ వర్ధంతి సందర్భంగా కర్నూలులో ఆయన నివసించిన ఇంటినే సాహితీ స్రవంతి ప్రాంతీయ కార్యాలయంగా వినియోగించేందుకు వారి కుటుంబం ఇచ్చింది. సాహితీ స్రవంతి ఆవిర్భావం నుంచి కర్నూలు కీలక కేంద్రంగా ఉంది. అందులో తెలకపల్లి నరసింహయ్య గారి పాత్ర మరువలేనిది. సాహిత్య కార్యక్రమాలకు ఒక రూపును, కూర్పును ఇచ్చిన సాహితీ స్రవంతి కర్నూలులో నరసింహయ్య గారి చేతుల మీదుగానే ప్రారంభించబడింది. ఇప్పుడు ఆయన నివసించిన ఇంటిలో సాహితీ స్రవంతి కార్యాలయాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఫౌండేషన్ అధ్యక్షులు కురాడి చంద్రశేఖర్ కల్కూర ప్రారంభించారు.
ఇదే సందర్భంలో 1917లో కర్నూలులోని చంద్రమౌళీశ్వర ముద్రాక్షరశాలలో ప్రచురించిన ‘చతురిక’ నవలను పున:ప్రచురించి ఆవిష్కరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వెబ్‌సైట్‌లో ఉన్న ‘చతురిక’ నవలని సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి పరిశోధించి, వెలికి తీశారు. 1917లోనే కర్నూలులో ఒక ముద్రణాలయం ఉండడం, అందులో ఒక నవలను ముద్రించడం అన్న విషయం తెలిసి సాహితీలోకం ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యింది కూడా. అప్పుడే ఈ నవలపై చర్చ మొదలైంది. కర్నూలు సాహిత్య చరిత్రలో దీన్నొక మలుపుగా చెప్పుకోవచ్చు. తెలకపల్లి రవి ముఖ్య అతిధిగా, లలితకళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ప్రముఖ రచయిత ఎస్.డి.వి.అజీజ్ విశిష్ట అతిధులుగా పాల్గొన్న ఈ కార్యక్రమానికి సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అధ్యక్షత వహించగా, రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు సమన్వయకర్తగా వ్యవహరించారు. జిల్లా నాయకురాలు నాగమణి, నరసింహయ్య గారి మూడో కుమారుడు తెలకపల్లి హరి కూడా పాల్గొన్నారు. వక్తలు మాట్లాడుతూ, తెలకపల్లి రవి ఈ పరిశోధనా గ్రంధాన్ని సేకరించి కూర్పు చేయడం వల్ల నవలా సాహిత్య చరిత్రలో ఒక పుటను సంపాదించుకున్నారని అన్నారు.
ఈ నవలకు తెలకపల్లి రవి ముందుమాట రాశారు. ‘చరిత్రలో, సాహిత్య చరిత్ర పరిశోధనలో ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. ఆ కోవలోకి ఈ ‘చతురిక’ నవల కూడా వస్తుంది. వివిధ దేశీయ భాషల్లో తొలి తరం రచయితలు ఎక్కువమంది అపరాధ పరిశోధక కథలతోనే రచన ప్రారంభించారు. ఆ ఒరవడిలోనిదే రచయిత ఉయ్యాలవాడ రామచంద్రరావు రాసిన ‘చతురిక’ నవల. కర్నూలు డిప్యూటీ కలెక్టరుగా పనిచేసిన నరహరి గోపాలక్రిష్ణ చెట్టి 1872లో వెలువరించిన శ్రీరంగరాజ చరిత్రము మొదటి నవల కాగా, 1878లో కందుకూరి ప్రచురించిన రాజశేఖర చరిత్రము రెండవ నవల. తెలంగాణలో ఇంకా ముందే చారిత్రక నవలలు వచ్చాయని మిత్రులు పేర్కొంటున్నారు. 1874లోనే అనంతపురం జిల్లాకు చెందిన గడియారం రామశాస్త్రులు ‘పేటికాంతర శవం’ తొలి అపరాధ పరిశోధక నవల వెలువడినట్టు తెలుస్తోంది.’ అని పేర్కొన్నారు.
ఐదు అధ్యాయాలుగా 40 పేజీల్లో ఉన్న ఈ చిన్న నవలలో విజ్ఞానసాగరుడనే అపరాధ పరిశోధకుడు, అతని స్నేహితుడు, ఒక జమీందారు, చతురిక అనే ఒక వేశ్య ముఖ్య పాత్రధారులు. ఒక న్యాయవాది గురించిన విషయాలు వస్తుంటాయి కాని అది పాత్ర రూపంలో ఉండదు. విద్యాసాగరునికి చతురమైన బుద్ధిశక్తి, సూక్ష్మ విషయాలను కచ్చితంగా చెప్పే లక్షణం, సందర్భానుసాగంగా పరిసరాలను, మనుషులను, వస్తువులను చూసి అంతక్రితం ఏమి జరిగి ఉంటుందో చెప్పే తెలివితేటలు బాగా ఉంటాయని అతని మిత్రుడి పాత్ర తెలుపుతుంది. అటువంటి అపరాధ పరిశోధకుడితో ఒక జమీందారుకు పని పడుతుంది. చతురిక అన్న వేశ్య దగ్గర తామిద్దరూ ఉన్న చిత్రపటం (ఫోటో) ఉందని, తనకు పెళ్ళి జరగబోతున్నందున ఆ ఫోటోను ఎలాగైనా ఆమె దగ్గరనుండి తనకు తెచ్చివ్వాలని జమీందారు విజ్ఞాన సాగరుణ్ణి కోరతాడు. ఆ చిత్రపటాన్ని దొంగిలింపజేసే ప్రయత్నం చేశానని, అది విఫలమైందని కూడా చెబుతాడు. ఆమెకు డబ్బులిచ్చి తీసుకుందామని విజ్ఞాన సాగరుడు అనగా, ఆమెను డబ్బుతో కొనలేరని జమీందారు చెబుతాడు. ఇలా చతురిక గుణగణాలను చెప్పకనే చెబుతాడు రచయిత. ఆమె పాత్ర చూస్తుంటే కన్యాశుల్కంలోని మధురవాణి మనకు గుర్తొస్తుంది.
ఫొటోను సంపాదించే క్రమంలో విజ్ఞాన సాగరుని శక్తియుక్తులను రచయిత బాగా వర్ణిస్తాడు. అతడి ఎత్తుగడలు ఆసక్తిని కలిగిస్తాయి. సాంకేతిక విజ్ఞానాన్ని వినియోగించుకుంటాడు. చతురిక ఇంటి చుట్టుపక్కల వారిని వశపరచుకొని తన పనిలో ఉపయోగించుకున్నానని కూడా విజ్ఞానసాగరుడు మిత్రుడితో చెబుతాడు. డిటెక్టివ్ కథ కాబట్టి పెళ్ళైన చతురిక, భర్త అంటే న్యాయవాది ఇద్దరూ వేర్వేరు మార్గాల్లో వెళ్ళిపోవడం, తరువాత దేశాన్ని విడిచిపోవడం ఇవన్నీ కూడా కథానాయకుడైన డిటెక్టివ్ ఎప్పటికప్పుడు కనిపెడుతుంటాడు. నవలంతా ఒక ఎత్తు, విజ్ఞాన సాగరుడు, చతురిక మధ్య జరిగే సంభాషణలు ఒక ఎత్తు. అవి నవల చదివి తెలుసుకుంటేనే పాఠకులకు ఆసక్తి పెరిగేది. ఆ ఫోటోను చతురిక నుంచే తీసుకోవడం ఎలాగన్నది కూడా కొసమెరుపే. మొత్తం పైన 108 ఏళ్ళ నాటి నవల ఎంతో ఉత్తేజకరంగా ఉండడం మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ నవలను ఇప్పుడు వెలువరించటం ఒక ప్రత్యేకతగా నిలిచిపోతుంది.
– జంధ్యాల రఘుబాబు,
98497 53298
