అకాడెమీలను స్వతంత్ర సంస్థలుగా నిలపాలి

Sep 9,2024 05:20 #sahitya akademi, #sahityam

మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ సమైక్యతా దృక్పథంతో, విభిన్న భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం, విభిన్న భాషల మధ్య భావసమన్వయం కోసం భారత ప్రభుత్వం సాహిత్య అకాడమీని 1954లో స్థాపించింది. దానిని మనం కేంద్ర సాహిత్య అకాడమీ అని పిలుచుకుంటూ ఉన్నాం. భారతదేశంలోని విభిన్న రాష్ట్రాలు తమ కళా భాషా సాహిత్యాల అభివృద్ధి కోసం అనేక అకాడమీలను స్థాపించు కున్నాయి. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా అనేక అకాడమీలు స్థాపింపబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి నప్పటి నుంచి 1983 దాకా ఆ అకాడమీలు క్రియాశీలంగా పనిచేశాయి. అయితే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి 1983లో అధికారంలోకి వచ్చిన తర్వాత, అప్పటిదాకా అమలులో ఉన్న అనేక వ్యవస్థలను రద్దు చేసి, ప్రత్యామ్నాయ వ్యవస్థలను సృష్టించారు .అందులో భాగంగాఅప్పుడు ఉన్నటువంటి అనేక అకాడమీలను రద్దు చేశారు. వాటికి ప్రత్యామ్నాయంగా తెలుగు విశ్వవిద్యాలయం అనే సంస్థను స్థాపించారు. తెలుగు విశ్వవిద్యాలయాన్ని మనం ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడకుండానే అకాడమీలకు విశ్వవిద్యాలయం సరైన ప్రత్యామ్నాయం కాదని ఆమోదించాలి. 2004లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం లోకి వచ్చింది.
ఆ సమయంలో రాష్ట్ర అకాడమీలను పునరుద్ధరించే ప్రయత్నాలు కొన్ని జరిగాయి. కానీ అవి కార్యరూపం ధరించలేదు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విభజింపబడింది. తెలంగాణకు కె.చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రులయ్యారు. ఆ విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సాహిత్య అకాడమీని, మరికొన్ని అకాడమీలను ఏర్పాటు చేసింది. ఆ అకాడమీలు చాలా చురుకుగా పనిచేస్తున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభలను కూడా దిగ్విజయంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్ర పునర్నిర్మాణం చేసే క్రమంలో చాలా ఆలస్యంగా, బహుశా 2018లో కొన్ని అకాడమీలను ప్రకటించింది. కానీ అవి క్రియాశీలంగా పనిచేయలేదు. 2019లో వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి నాయకత్వంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు అకాడమీలను ప్రకటించింది. అవి కూడా క్రియాశీలంగా పనిచేయలేదు. ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అనేక కార్పొరేషన్లకు, అనేక సంస్థలకు అధ్యక్షులను, డైరెక్టర్లను నియమిస్తున్నది. బహుశా ఆ క్రమంలో అకాడమీలను కూడా పునరుద్ధరిస్తూ కార్యవర్గాల పునర్నిర్మాణం చేస్తుందని భాష కళ వైజ్ఞానిక రంగాలకు చెందిన వారు భావిస్తున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దష్టికి కొన్ని విషయాలను తీసుకుపోవడం నా ఉద్దేశం. జాతీయ స్థాయి అకాడమీలు గాని, రాష్ట్రస్థాయి అకాడమీలు గాని- అవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పినవే. సందేహం లేదు. అవి రాజ్యాంగానికి లోబడిన సంస్థలే. కానీ మిగతా కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు, అకాడమీలకు మధ్య ఒక తేడా ఉంది. అకాడమీలు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ప్రభుత్వం అకాడమీలను స్థాపించి వనరులను, సదుపాయాలను కల్పించి వదిలేయాలి. అకాడమీలను ఆయా రంగాల్లో నిష్ణాతులైన ప్రతినిధులు నడుపుకుంటారు. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి అకాడమీలు రాజకీయ నిర్ణయాల కోసం ఎదురుచూసే పరిస్థితి
ఉండకూడదు. అందువల్ల ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అకాడమీలకు అధ్యక్ష ఉపాధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను నియమించి అకాడమీల పనిని ప్రారంభించాలి. కొత్తగా నియమింపబడిన కార్యవర్గం అకాడమీలను స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలుగా కొనసాగడానికి అవసరమైన నియమ నిబంధనలను, విధివిధానాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రభుత్వం ఆ ప్రతిపాదనలను ఆమోదించాలి .ఆ తర్వాత రాజకీయ మార్పులతో సంబంధం లేకుండా అకాడమీలు కొనసాగాలి. పని చేయాలి. అకాడమీలు రాజకీయవాదులకు ఆవాస కేంద్రాలు లేదా పునరావాస కేంద్రాలు కాకూడదు. అవి కళా వైజ్ఞానిక రంగాలు. వాటి మానాన అవి పని చేయాలి. అటువంటి వాతావరణాన్ని ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ఈ విషయంలో అవసరమైతే కర్ణాటక, తమిళనాడు, కేరళ వంటి ఇతర దక్షిణ భారత రాష్ట్రాలలో అకాడమీలు పనిచేస్తున్న తీరును పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించి, ఆ కమిటీ నివేదికను అధ్యయనం చేసి అమలు చేయవచ్చు. గతంలో అకాడమీలు స్థాపింపబడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్ష
ఉపాధ్యక్షులను, కార్యవర్గ సభ్యులను నియమించింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కార్యదర్శిని, కార్యాలయం సిబ్బందిని నియమించింది. ఆ తర్వాత అకాడమీలలో నమోదైన సభ్యులు అధ్యక్ష ఉపాధ్యక్షులను కార్యవర్గ సభ్యులను ఎన్నికలలో ఎన్నుకున్నారు. అది ఇప్పుడు మళ్ళీ మొదలవ్వాలి. ఇదొక ప్రజాస్వామిక ప్రక్రియ. కారణాలు ఏవైనా ఆంధ్రప్రదేశ్‌లో అకాడమీల విషయంలో ఆ ప్రజాస్వామ్య ప్రక్రియ చితికి పోయింది. ఇప్పుడైనా ఆ ప్రక్రియను పునరుద్ధరించాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించే అకాడమీల బాధ్యులు ఆ ప్రజాస్వామిక ప్రక్రియను అమలులోకి తీసుకొని రావడానికి కృషి చేయాలి. ప్రభుత్వం అందుకు సహకరించాలి. అవసరమైతే ఒకేసారి అధ్యక్ష ఉపాధ్యక్షులను కార్యవర్గ సభ్యులను నియమించకుండా, ఒక్కొక్క అకాడమీకి ఒక్కొక్క ప్రత్యేక అధికారిని (స్పెషల్‌ ఆఫీసర్‌)ను నియమించి ఆ ఆఫీసర్‌కి సహాయకులుగా ఇద్దరు సభ్యులను నియమించి అకాడమీల పని విధానాన్ని, నిర్మాణ వ్యవస్థను సూచించమని కోరవచ్చు. మొదట అకాడమీల జనరల్‌ బాడీ సభ్యులు నమోదు కావాలి. అకాడమీలలో సభ్యులుగా ఉండడానికి అర్హతలు నిర్ణయించాలి. గతంలో ఉండిన అకాడమీల చట్టాలను సంపాదించి వాటికి మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. జనరల్‌ బాడీ సభ్యులు ఎన్నికల ద్వారా అధ్యక్ష ఉపాధ్యక్షులను కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవాలి. ఒకసారి ఎన్నికైన కార్యవర్గానికి కాల పరిమితిని నిర్ణయించాలి.
కేంద్ర సాహిత్య అకాడమీలో కొత్తగా ఏర్పడే జనరల్‌ కౌన్సిల్‌, సలహా మండలి ఐదు సంవత్సరాలు పరిమితిగా పెట్టుకొని పని చేస్తున్నాయి. రాష్ట్ర అకాడమీలు కూడా అదే పద్ధతిలో ఐదు సంవత్సరాల కాల పరిమితిని పెట్టుకోవచ్చు. గతంలో రాష్ట్ర అకాడమీలలో భాగస్వాములైన వారు కొందరు ఇంకా మిగిలి ఉన్నారు. వాళ్ళ సలహాలను తీసుకోవచ్చు. ప్రభుత్వం కార్యదర్శిని కార్యాలయ సిబ్బందిని నియమించాలి. భవన సౌకర్యం కల్పించాలి. నిధులు సమకూర్చాలి. కొత్తగా ఎన్నికైన కార్యవర్గం ప్రతి ఏడాది ప్రారంభంలో ఆ ఏడాదిలో తాము నిర్వహింపదల్చుకున్న కార్యక్రమాలకు ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయాలి. గతంలో అకాడమీలు నిర్వహించిన కార్యక్రమాలను పరిశీలించి ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా రూపకల్పన చేసుకోవాలి. అకాడమీలు స్థిరమైన అజెండాతో, కృతనిశ్చయంతో, నిబద్ధతతో పనిచేయాలి. రాష్ట్రంలో కళా వైజ్ఞానిక వికాసానికి అకాడమీలు ఇరుసులుగా పని చేయాలి. అకాడమీలు తాత్కాలిక కేంద్రాలుగా కాకుండా శాశ్వత సంస్థలుగా అవిచ్ఛిన్నంగా పనిచేయాలి. అకాడమీ బాధ్యులను తొలిసారి ప్రభుత్వం నియమించిన తర్వాత ఎన్నికల ద్వారా ఆ బాధ్యులను ఎన్నుకొని పనిచేయాలి. అందులో సామాజిక న్యాయం ఉండాలని ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. సామాజిక న్యాయమే ప్రజాస్వామ్యం. కార్యవర్గ నిర్మాణంలోను, కార్యక్రమ ప్రణాళికలలోనూ సామాజిక న్యాయం ఉట్టిపడాలి. ఆంధ్రప్రదేశ్‌లోని విభిన్న అకాడమీలు ప్రజాస్వామిక సంస్థలు అని అందరూ గుర్తుపెట్టుకోవాలి.

– రాచపాళెం చంద్రశేఖర రెడ్డి
94402 22117

➡️