ఆధునిక తెలుగు నాటకరంగంలో విశాఖపట్నం నగరానికి ఓ విశిష్టత, ప్రత్యేకతలున్నాయి. ఇందుకు దోహదపడిన ఎందరెందరో అత్యంత ప్రముఖ దర్శకులు, నటులు, ప్రయోక్తల్లో కీర్తిశేషులు మందులు, కొండవలస లక్ష్మణరావు వంటి ఉద్ధండుల్ని కచ్చితంగా ప్రస్తావించి తీరాలి. దాదాపు ఐదు దశాబ్దాల నాడు ‘అనగనగా ఒక రాజు’ (రచన: దాడి వీరభద్రరావు), ‘రేపటి శత్రువు’ (రచన : ఆకెళ్ల సూర్యనారాయణ) నాటిక ప్రదర్శనలు వారి దర్శకత్వంలో ప్రభంజనం సృష్టించాయంటే ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ నాటికలను మరోసారి చూసే అవకాశాన్ని విశాఖపట్నంలోని కళాభారతి యాజమాన్యం ప్రేక్షకులకు కల్పించింది. కళాభినయ (అనగనగా ఒక రాజు), శ్రీమతి జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ (రేపటి శత్రువు) బృందాలు ఆ అవకాశాన్ని ఈనెల ఏడో తేదీన ఎంచక్కా సద్వినియోగం చేసుకున్నాయి. ప్రేక్షకులూ సంతృప్తి చెందారు. ‘అనగనగా ఒక రాజు’ ప్రధానంగా రాజకీయాలు, వ్యవస్థలో లోపాల్ని చర్చిస్తుంది. మంచి పాలన అందిస్తారని ఎన్నుకుంటే ప్రజల్ని అసలేమాత్రం పట్టించుకోపోవడంతో రాజుపై విఫల హత్యాయత్నానికి ఒడిగట్టిన ఓ సామాన్యురాలిని బంధించడంతో నాటిక ప్రారంభమవుతుంది. మంత్రి, సేనాని సమక్షంలోనే తీవ్ర వాగ్వాదం.. అనంతరం- వ్యవస్థను బాగు చేయాలంటే ఏం చెయ్యాలని రాజు అడిగితే తనను ఓ సంవత్సరం పాటు మంత్రిని చెయ్యాలంటుందామె. రాజు ఇచ్చిన అవకాశంతో ఆమె ఎన్నో సంస్కరణలనూ సంక్షేమ పథకాలనూ ప్రవేశపెడుతుంది. అయితే ఏడాది తర్వాత తుది సమీక్షలో ప్రజలకు కించిత్ ప్రయోజనం కూడా జరగలేదని తేలుతుంది. పథకాలూ నిర్ణయాలూ అన్నీ పత్రాలపైనే తప్ప ఆచరణలో జరగకపోవడానికి బాధ్యులు ఎవరో తేల్చుకోవడానికి తన వద్ద మహిమ గల అంగుళీయంలో చూడొచ్చని నూతన మంత్రి అంటే.. అందులో తాను కనిపించడంతో రాజు హతాశుడవుతాడు. తామూ కనిపిస్తామేమోనని పాత మంత్రీ సేనానీ ఆ ఉంగరాన్ని కాజేయడానికి పన్నిన కుట్ర బయటపడటంతో రాజునే ఆ ఇద్దరూ హత్యజేసి.. కొత్త మంత్రి నిర్వాకంతో దారుణ ఫలితాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నాడని.. కొత్త మంత్రి మహిళ కారణంగా ఉపేక్షిస్తున్నామని, పాత మంత్రి గద్దెనెక్కాక అధికారిక ప్రకటనతో నాటిక ముగుస్తుంది. ఈ క్రమంలో సమాజంలో నిరుద్యోగం, అవినీతి, అధిక ధరలు ఇత్యాది సమస్యలు, పరిష్కార మార్గాలు పదునైన సంభాషణలతో ప్రేక్షకుల్ని ఇప్పటికీ ఆకట్టుకోగలగడం ప్రత్యేకత. రాజు మంచివాడే, మంత్రి, సేనాని మాత్రమే అసలు దుర్మార్గులు అని చూపడం ప్రస్తుతం ఎంతో కొంత వివాదమనిపించొచ్చు. సామాన్యురాలిని వ్యక్తిగానేగాక కోటానుకోట్ల ప్రజల ప్రతీకగా చెబితే మరింత ఆమోదయోగ్యమనిపించేదేమో! అంగుళీయం మహిమ ట్రిక్ ప్రస్తుత పరిస్థితుల్లో నిలవకపోవొచ్చు. దాదాపు ఏడు పదులు దాటినా ఇంకా విజయలక్ష్మి సమర్ధంగా నటించడం చాలా చాలా విశేషం. ‘సెల్యూలాయిడ్‌పై ‘మహానటి’ సావిత్రి, నాటకరంగ వేదికపై విశాఖ విజయలక్ష్మి’ అనే నానుడి అక్షరసత్యంగా భావిస్తోంది ప్రేక్షకలోకం.
రెండో నాటిక ‘రేపటి శత్రువు’ … తనూ కోడలిగానే ఆ ఇంట ప్రవేశించిందని అత్తా- రేపు తనూ అత్త అవుతాననీ ఆనక వృద్ధురాలినవుతాననీ కోడలికీ- ఎప్పటికి స్పృహ కలిగేనో..! ఇంటింటి బాగోతమే ఈ నాటిక. జీవిత చరమాంకంలో పూర్తిగా సంతానంపైనే ఆధారపడొద్దు.. కొంత తమ కోసం ఉంచుకోవాలి.. అలాగే- అరవైలు డెబ్బైలు దాటాక కూడా కొడుకు / కూతురు జీవితంలో సలహాలు.. అనుభవాలు.. అభిప్రాయాలు వ్యక్తంజేసే పేరుతో అన్నింట్లో తలదూర్చడం అసలేమాత్రం క్షేమదాయకం కాదు.. అని హేతుబద్ధంగా, శక్తిమంతంగా సూత్రీకరించారు రచయిత ఆకెళ్ల.
ఇన్నేళ్లూ తాను కంటిపాపలా చూసుకున్న పుత్రుడు భార్య కొంగుచాటు వాడవుతున్నాడనే బాధ.. కోడలు పిల్ల తనను అసలేమాత్రం ఖాతరు చేయడం లేదనే బాధ మరో వైపు.. ఇలాంటి ఏ పాత్రలో జీవించటానికైనా విజయలక్ష్మికే చెల్లునేమో..! అంతిమంగా కొడుకు, కోడలు తమను విడిచి ఇంట్లోంచి వెళ్లిపోతామనేసరికి.. వయసును సైతం పక్కనబెట్టి కాళ్లావేళ్లాబడినా ఫలితం ఉండకపోవడంతో హతాశులైన వృద్ధ దంపతులు.. అనివార్యమై కడకు తామే తమ ఊరి లోని పాత ఇంటికి వెళ్లిపోవడానికి సిద్ధమవ్వడంతో నాటిక ముగుస్తుంది. ‘మనిషి 40 ఏళ్లు వచ్చే వరకే మనిషిలా బతుకుతాడు. 60 ఏళ్లు వచ్చేవరకూ గాడిద బరువు మోస్తాడు. కుక్కలా కాపలా కాస్తూ మొరుగుతూ ఉంటాడు. 80 ఏళ్లు దాటాక గుడ్లగూబలా చూస్తుంటాడు. ఇదీ మనిషి జీవితం. ”మన పిల్లలు గానీ బంధువులు గానీ శత్రువులు కారు. మన వార్ధక్యమే మన శత్రువు. ఆ శత్రువును ఎదుర్కోవడానికి మన దగ్గర శక్తి ఉన్నప్పుడే అర్థబలాన్ని, అంగబలాన్ని దాచుకోవాలి. అప్పుడే మనకు హాయి. మనశ్శాంతి.” వంటి సంభాషణలను ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో హర్షించారు.
ప్రధాన పాత్రలు పోషించిన (మీసాల) నాయుడు (అనగనగా ఒకరాజు), ప్రసాద్ (రేపటి శత్రువు) నాటికలను పర్యవేక్షించారు. ఇంకా కన్నబాబు, జీఎస్సెన్ మూర్తి, రమాదేవి, వర్రే నాంచారయ్య తదితరులు పాత్రోచితంగా నటించారు.
– జి.వి.రంగారెడ్డి, సీనియర్ పాత్రికేయులు
99126 15747