ఒకనాడు కృష్ణరాయ కిరిట సుమశేఖ
రంబైన యభయహస్తంబు మాది!
ఒకనాడు గీర్దేవతా క్రమ కంకణ
స్వనమైన మాధురీ ప్రతిభ మాది!
ఒకనాడు రామానుజ కుశాగ్ర బుద్ధికే
చదువు నేర్పిదది వంశమ్ము మాది!
ఒకనాటి సకల శోభకు తాన కంబైన
దండి పురంబు పెన్గొండ మాది!
తల్లి దండ్రుల మేధ విద్యామిషద్వ
పాండితీ శోభ పదునాల్గు భాషలందు
బ్రదుకునకు బడి పంతులు, భాగ్యములకు
చీడ పట్టిన రాయలసీమ మాది!
మహా పండితుడు పుట్టపర్తి నారాయణాచార్యులు తన ‘శ్రీనివాస ప్రబంధం’ కావ్యంలో తన నేపథ్యం గురించి పై విధంగా చెప్పుకున్నారు. ఇకనుంచి నారాయణచార్యుల జయంతిని అధికారిక కార్యక్రమంగా జరుపుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏప్రిల్ 10వ తేదీన ప్రకటించింది. 1914 మార్చి 28న అనంతపురం జిల్లా చిత్రావతి నదీ తీరం చియ్యేడు గ్రామంలో జన్మించిన నారాయణచార్యులు 1990 సెప్టెంబర్ 1న కనుమూశారు. పుట్టపర్తి వారి పాండిత్యాన్ని, చేసిన రకరకాల ఉద్యోగాల తీరును గమనిస్తే, ఆయన అంతేవాసి తిరుమల రామచంద్ర గుర్తుకు రాకమానరు. రామచంద్ర కనీసం మూడో వంతు తన ఆత్మకథ ‘హంపి నుంచి హరప్పా దాకా’ రాయగా; నారాయణచార్యులు ఎన్నో ఇతర రచనలు చేసినా తన స్వీయగతాన్ని మాత్రం పుస్తకంగా నిక్షిప్తం చేయకుండా అంతర్దానమయ్యారు.
1985 ఏప్రిల్ 28న నారాయణాచార్యులను ఎస్వీ యూనివర్సిటీలో కలిసినప్పుడు ఆటోగ్రాఫ్ అడిగితే – ఆయన మందహాసం చేసి, పుట్టపర్తి అని రాసి దానికి డబుల్ కోట్స్ వేసి ఇచ్చారు. 1988-89 ప్రాంతంలో వారికి జ్ఞానపీఠం తృటిలో తప్పిపోయింది. వారికది దక్కకుండా జారిపోవడం ద్వారా తెలుగు వారు కోల్పోయినది ఏమిటో, బహుశా ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ దినపత్రికలో అనుకుంటా, పర్సా వెంకటేశ్వరరావు జూనియర్ చాలా ఘాటైన విశ్లేషణా వ్యాసాన్ని రాయడం బాగా గుర్తు.
ప్రముఖ విమర్శకులు, నారాయణాచార్యులను ఎంతో గౌరవించడమే కాదు, ఆయన శివతాండవాన్ని అద్భుతంగా గానం చేసే అలవాటున్న వల్లంపాటి వెంకటసుబ్బయ్య తన ఆకాశవాణి ప్రసంగంలో ఇలా అన్నారు : ”పుట్టపర్తి నారాయణాచార్యులు బహుముఖ ప్రజ్ఞావంతుడు. మహాపండితుడు, మహాకవి, విమర్శకుడు, చరిత్రకారుడు, వాగ్గేయకారుడు, అనువాదకుడు. అతని పాండిత్యానికి ఆకాశమే హద్దు. ‘పాండితీశోభ పదునాల్గు భాషలందు’ అని తన్ను గురించి తానే చెప్పుకున్నాడు. ‘సాక్షాత్కారము’ వంటి కావ్యాలు అతని భావలాలిత్యాన్ని చాటితే, ‘శ్రీనివాస ప్రబంధము’ వంటి కావ్యాలు పాండిత్య గరిమకు అద్దం పడతాయి. కానీ, అన్ని కావ్యాల్లోనూ అంతర్వాహిని భక్తితత్త్వమే! తెలుగులో సాహిత్య విమర్శను సుసంపన్నం చేసిన వారిలో మొదటి వరుసకు చెందినవాడు. ‘ప్రబంధ నాయికలు’ వంటి సాహిత్య పాత్రల విశ్లేషణతో ప్రారంభమైన ఆయన సాహిత్య విమర్శ వ్యాసుణ్ణి, వాల్మీకినీ, భవభూతినీ, తిక్కననూ, పోతననూ, అన్నమయ్యనూ, కృష్ణరాయలనూ, రామకృష్ణుణ్ణి పరామర్శిస్తూ భాగవత విశ్లేషణలో శిఖరాగ్రాలను చేరుకుంది. ‘భాగవత సుధాలహరి’ సంపుటాలు పుట్టపర్తి పాండిత్యానికీ, విశ్లేషణాశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి.
నారాయణాచార్యులు సంగీత శాస్త్రం తెలిసిన వాగ్గేయకారుడు. ‘అష్టాక్షరి’ అన్న ముద్రతో వేలాదిగా కీర్తనలు వ్రాశాడు. అతని అభిమాన విషయం చరిత్ర. అతని ‘విజయనగర సామాజిక చరిత్ర’ కొందరు మహావీరుల, మహారాజుల జీవిత చరిత్రే చరిత్ర కాదని నిరూపించిన అరుదైన గ్రంథం. అతడు సంస్క త, ప్రాకత, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల మంచీ తెలుగులోకి ఎన్నో అనువాదాలు చేశాడు. విశ్వనాథ ‘ఏకవీర’ను మలయాళంలోకి అనువదించారు. కానీ, అతని శతాధిక గ్రంథాల్లో పుట్టపర్తి పేరు చెబితే జ్ఞాపకం వచ్చే గ్రంథం ‘శివతాండవం’. ఈ కావ్యాన్ని పుట్టపర్తి 1947లో రాసి అదే సంవత్సరం ‘భారతి’లో ధారావాహికంగా ప్రచురించాడు.” వల్లంపాటి అభిప్రాయం పుట్టపర్తి వారి ప్రభ ఎంతటిదో సూక్ష్మంగా తెలుసుకోవడానికి సులువుగా దోహదపడుతుంది.
డా.పుట్టపర్తి నాగపద్మిని త్వరలో ప్రచురించబోతున్న పుస్తకంలో వివరించిన నారాయణాచార్యుల బాల్యం నాటి విషయాలు చదువుతూ ఉంటే నాకు మా అనంతపురం జిల్లా అంతా కలయ తిరిగినట్టు అనిపించింది. నారాయణచార్యుల వారి నాన్న పెనుగొండలో ఉద్యోగం చేశారు. బుక్కపట్నంలో ఈయన వివాహం చేసుకున్నారు. నాగినాయన చెరువు గ్రామంలో నృత్యంపై మోజు పడ్డారు. కళ్యాణదుర్గంలో తల్లి మరణం… ఇలా ఈ సమాచారమంతా చదువుతూ ఉంటే నాకెందుకు ఆనందంగా ఉండదు? ‘లత’ పత్రికలో ప్రచురింపబడిన, ఇందులో పేర్కొన్న ఆయన జ్ఞాపకాలను చదువుతూ ఉంటే మొత్తం వెతికి పట్టుకుని, ఇప్పటికిప్పుడే చదవాలనిపిస్తోంది.
‘పుట్టపర్తి’ అనే ఇంటి పేరు, అనంతపురం జిల్లా, చిత్రావతి తీర ప్రాంతమైన చియ్యేడు గ్రామానికి చెందడం, ‘పెనుగొండ లక్ష్మి’ పేరుతో కావ్యం రాయడం … ఈ కారణాలతో వారంటే నాకు ఎంతో మానసిక సాన్నిహిత్యం. మాది అనంతపురం జిల్లా, అలాగే పెనుగొండ తాలూకా కావడం ఒక విషయం కాగా; నేను డిగ్రీ చదువుకున్నది పుట్టపర్తిలోని కాలేజీలో. సత్యసాయితో ముడిపడిన పుట్టపర్తి కాకుండా, దీనికి 25, 30 కిలోమీటర్ల దూరంలో మరో పుట్టపర్తి తెలుగు సరిహద్దు కన్నడ ప్రాంతమైన బాగేపల్లి సమీపంలో ఉంది. ఈ రెండు పుట్టపర్తి గ్రామాలు చిత్రావతీ నది తీరంలోనే ఉన్నాయి. ఈ రెండవ పుట్టపర్తి కూడా నాకు తెలుసు, ఎందుకంటే మా అమ్మ కంటే పెద్దదైన కమలమ్మ ఆ ఊరి కోడలే కనుక. ఆ పుట్టపర్తికి నేను హైస్కూల్లో చదివే కాలంలో రెండు, మూడుసార్లు వెళ్లాను కూడా.
పన్నెండేళ్ల వయసులో నారాయణాచార్యులు రాసిన ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యం తర్వాత తను విద్వాన్ కోర్స్ చదివే కాలంలో మద్రాసు విశ్వవిద్యాలయం సిలబస్‌లో ఉంచడం, ఆ పరీక్షలో నారాయణచార్యులు ఆ ప్రశ్న గురించే రాస్తూ మిగతావి రాయకపోవడం వల్ల పరీక్ష తప్పడం చాలా చమత్కారమైన దృష్టాంతం. ఈ ‘పెనుగొండ లక్ష్మి’ కావ్యంలో ముస్లిములు ఎంతో భక్తితో గౌరవించే బాబయ్య గోరీ గురించి వివరించిన సందర్భంలో నారాయణ చార్యులు రాసిన ఈ పద్యం కనబడుతుంది :
”కళలు శాస్త్రంబు రెండు నైక్యంబు జెంది
యేక రీతిగా నిలిచినదీ సమాధి
సత్యమందుకే దివ్యవర్చస్సు గలదు
అనుభవజ్ఞుని సుకవి వాక్యమ్ము వోలే”
ప్రఖ్యాత, పాశ్చాత్య విమర్శకులు సి.పి.స్నో తన ‘ది టు కల్చర్స్’ వ్యాసంలో వివరించిన లెక్కన 12 ఏళ్ల బాల నారాయణుడు ఇంత దార్శనికతతో కవిత్వాన్ని రాయడం ఏమిటి అద్భుతం గాక నారాయణచార్యులు మహాత్ముని జీవితం ఆధారంగా హరికథ కూడా చెప్పి రక్తి కట్టించేవారు.
– డా. నాగసూరి వేణుగోపాల్,
ఆకాశవాణి పూర్వ సంచాలకులు, 94407 32392