బంగ్లాదేశ్ ఏర్పడ్డాక, ఆ దేశంలో అధిక శాతం ప్రజలు మాట్లాడే బెంగాలీ భాషని కూడా అధికార భాషగా ప్రకటించాలని చేసిన ఉద్యమం గుర్తుగా 26 సంవత్సరాల క్రితం 21 ఫిబ్రవరిని అంతర్జాతీయ మాతభాషా దినోత్సవంగా ప్రకటించారు. ఒకే మతానికి చెందిన దేశం నుంచి విడిపోయిన ప్రజలు మతపరమైన హక్కుల కోసం కాకుండా, తాము మాట్లాడే భాష ఉనికిని రక్షించుకోవడం కోసం ఉద్యమం చేశారు. మనుషులు పాటించే ఆచార వ్యవహారాలు, అవలంబించే మతాలూ ఊహ తెలిసాక అవగాహనకి వస్తాయి. కానీ, భావ వ్యక్తీకరణకి అవసరమైన భాష అమ్మ ఒడిలోనుంచే అబ్బుతుంది. గమనించవలసిన ఇంకో విషయం ఏమిటంటే, మన పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడులలో ప్రజలు అవలంబించే మతాలు ఏమైనా దాదాపుగా రాష్ట్ర ప్రజలందరూ వారి రాష్ట్ర భాష మాట్లాడతారు, అది గర్వకారణంగా భావిస్తారు. ఇప్పటికీ కేరళ, తమిళనాడులలో ఆయా భాషల్లో వచ్చే దినపత్రికలూ, వారపత్రికలతో సహా సాహిత్య పత్రికలని కొని చదువుతారు. దురదృష్ట్టవశాత్తూ, ఈ పాఠక ప్రాచుర్యం తెలుగు రాష్ట్రాల విషయంలో నిజమని చెప్పలేను.
భాష వ్యక్తి ఉనికికే కాదు, సమాజపు ఉనికికి కూడా ఆయువుపట్టు. సమాజ, జాతి ఏకీభావనకు భారతీయ భాషల ఆలంబన అవసరం. మిగతా దేశాల్లో లేని సంక్లిష్టత భారత దేశంలో ఉన్నది. అది బహుభాషా సౌరభం. మాతృభాషలో మాట్లాడడం వల్ల బుద్ధి బాగా వికసిస్తుందని, పిల్లలు మాతృభాషలో ప్రాథమిక విద్యనభ్యసిస్తే భవిష్యత్తులో బాగా రాణించగలరని, మాతృభాషలో ప్రావీణ్యం ఉన్న వారు వేరే భాషలు సునాయాసంగా నేర్చుకోగలరని, ఇలా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలలో తేలినట్టు చదువుతున్నాం, వింటున్నాం. ఇవన్నీ ముంజేతి కంకణానికి అద్దం ఎందుకన్న సామెతని గుర్తు చేస్తాయి.
భారత రాజ్యాంగం మాతృభాషలో ప్రాథమిక విద్యా బోధన జరగాలని నిర్దేశించినా, కొన్ని రాష్ట్రాలు ఆంగ్ల మాధ్యమంలో ప్రాథమిక విద్యాబోధనకే మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, పరిస్థితి అగమ్యగోచరమనే చెప్పాలి. తెలుగు మాధ్యమంలో బోధించే పాఠశాలలు మరుగవుతుండడం ఒక విపత్కర పరిణామాన్ని సూచిస్తోంది. అయినా సరే, ఆంగ్ల విద్య, ఆంగ్ల మాధ్యమంలో బోధనలో జరిగే చదువు కేవలం ఉన్నత సామాజిక వర్గ పురోగతికి కారణమని చెప్పే ఒక తప్పుడు ప్రచారం జరగడం విచారకరం. తెలుగు మాధ్యమంలో డిగ్రీ వరకూ చదువుకుని, తెలుగు సాహిత్యంలో ఉన్న ఎన్నో అపురూపమైన పాఠ్యాంశాలని చదువుకుని, ఉన్నత విద్యనభ్యసించి, వేర్వేరు రంగాల్లో నిష్ణాతులుగా రూపొంది ప్రపంచంలో వెలుగొందుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ప్రవాసులు, వారి వృత్తి ఏదైనాకానీ, తెలుగు సాహిత్యాధ్యయనంతో పాటు రచనా వ్యాసంగాన్ని కూడా అభిరుచిగా ఎంచుకుని కొనసాగిస్తున్నారు.
కూటి కోసం, ఉన్నత విద్య, ఉద్యోగ లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం ఎంతోమంది గత మూడు, నాలుగు దశాబ్దాలుగా భారతదేశం దాటి వేరువేరు దేశాలకు వలస వెళ్ళడం ఒక చారిత్రక పరిణామం. ఏదో కోల్పోతున్నామేమో అనే బాధ, ఆతృతతోనూ, సహజమైన భాషా సంస్క ృతుల పట్ల ఉన్న ప్రేమ, మక్కువ కారణంగా కొంతమంది నాయకత్వంలో తెలుగు సంఘాలు ఏర్పడి, తెలుగు వారు వారి ఆచార వ్యవహారాలని మరవకుండా, పండగలకీ, పబ్బాలకీ కలుస్తూ భాషా సంస్క ృతులను పరిరక్షించుకునే ప్రయత్నం అభినందనీయం. ఇళ్లలోనో, గుళ్ళలోనో నడిపే తెలుగు బడులకి వారాంతంలో వానలో, ఎండలో, మంచులో, మైళ్ల కొద్దీ ప్రయాణించి పిల్లలని తీసుకువెళ్ళి తెలుగు నేర్పించే ప్రయత్నం చేసే తెలుగు ప్రవాసులు ఎందరో ఉన్నారు. అప్రస్తుతం అనిపిస్తున్నా, సందర్భం కోసం ఒక విషయం చెప్పాలి. మా అమ్మాయి చిన్నప్పుడు ‘బాలభారతి’ అనే తెలుగు బడిని అమెరికాలో స్థాపించి సుమారు ఆరేళ్లు శ్రీమతి అరుణ గురజాడ, నేనూ నిర్వహించాం. ఈ సంస్థ ద్వారా శ్రీమతి సావిత్రి గారి హరి కథ, కార్టూనిస్ట్ మల్లిక్ గారి కార్టూన్ షశీతీసరష్ట్రశీజూ (పిల్లల కోసం), గరికిపాటి నరసింహారావు గారి పిల్లలనుద్దేశించిన ఉత్తేజపూరిత ప్రసంగం … ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి పిల్లలకి భాష పట్ల అభిరుచిని కలిగించే ప్రయత్నం చేశాము. కొందరు తల్లిదండ్రుల పని ఒత్తిడి, అనాసక్తి లాంటి కారణాల వల్ల ఇంట్లో పిల్లలకి తెలుగుభాష పట్ల ఆసక్తి కలిగించలేకపోవడం దురదృష్టకరమైనా, చాలామంది తెలుగువారు ఇంట్లో తెలుగు మాట్లాడడం వల్ల వారి పిల్లలకి తెలుగు నేర్చుకునే అవకాశం కలిగించారు, కలిగిస్తున్నారు. ఈ సందర్భంగా ‘మాతృభాష’ అనే కంటే, ‘ఇంటి భాష’ అనడం సబబేమో! కానీ, భాషాంతర వివాహాలు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఆంగ్ల భాష అమ్మ భాషగా అలరారుతుండడం గమనించదగ్గ విషయం. భారతదేశంలో కూడా ఈ పరిస్థితి అరుదు కాదు. కాబట్టి, అమ్మ భాష ఏదైనా, బిడ్డ నేర్చే భాష అమ్మ సంస్కారం మీదే ఆధార పడి ఉంటుంది. అందుకే, అమ్మకి మాతృభాష పట్ల మక్కువ చెక్కు చెదరకుండా ఉండాలి.
తెలుగు రాష్ట్రాల విషయానికి, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం విషయానికి వస్తే, తెలుగుభాష మనుగడ గురించి ఆందోళన కలుగుతుంది. తెలుగు మాధ్యమంలో ప్రాథమిక విద్యస్థాయిలో బోధనకి ప్రభుత్వమే అనానుకూల పరిస్థితి కలిపించడం, కొందరు తల్లిదండ్రులు, మేధావులు అన్నప్రాశన నుండే ఆంగ్లం పట్ట మొగ్గు చూపడం హర్షనీయం కాదు. ఏ భాషా మాధ్యమంలో చదివినా, మాతృభాషపై గౌరవం, మక్కువ, మాతృభాషలో ప్రావీణ్యం, మాతృ భాషలో ఉన్న సాహిత్యాన్ని, సారస్వతాన్నీ అధ్యయనం చేసే అభిరుచి కలిగి ఉండడం చాలా అవసరం. ఈ అవసరాన్ని తల్లిదండ్రులు, ప్రభుత్వాలు గుర్తించకపోవడం, నిర్లక్ష్యం చేయడం, చారిత్రికమైన తప్పిదమవుతుంది.
ఈనాటి సమాజంలో మాట్లాడే అవసరం, రాసే అవసరం అంతగా లేదు. సాంకేతికత, అధునాతన పరికరాల అందుబాటు కారణంగా ఏమి చెప్పాలన్నా, ఏమి రాయాలన్నా మౌఖికంగా కన్నా, పరోక్షంగా డిజిటల్ మాధ్యమాలలో ఏమోజీలనే బొమ్మల రూపంలో తెలియచేయడం సాధారణమయిపోయింది. ఇంకొంత కాలానికి భాషకి బదులు బొమ్మల ద్వారా జరిపే సంభాషణే విరివిగా కొనసాగే అవకాశం ఉంది – ఆదిమ మానవుడిలా!
ఈ పరిస్థితి చక్కపడాలంటే చేయవలసిన పనులు, కార్యక్రమాలు సూచిస్తూ పండంటి భాషకి పదహారు సూత్రాలనో, పన్నెండు సూత్రాలనో కొందరు విద్యావేత్తలు రాసిన వ్యాసాలు చూస్తుంటాం. కానీ, అంకితభావంతో కూడిన కార్యాచరణ లేకపోతే గట్టిమేల్ తలపెట్టని వట్టి మాటల నీటి మూటల్లా ఆలోచనలు అక్షరాలకే పరిమితమవుతాయి. తెలుగువారికి మాతృభాషకి సంబంధించిన సంకటంతోపాటు, వ్యావహారిక భాషా సంకటం కూడా తోడయింది. నన్నయ నుంచి నేటి వరకూ, గ్రాంథిక భాషలో రచనలు చేయాలా, లేక వ్యావహారిక భాషలో చేయాలా అన్న చర్చ కొనసాగుతూనే ఉంది. చదివే వారు, రాసేవారూ ఉన్నత సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్న కాలంలో వ్యావహారిక భాష నీచభాష అనే భావన నుంచి, సామాన్యులకి సైతం అర్ధమయ్యే భాషలా రూపాంతరం చెంది, ఎన్నో కవితా ప్రక్రియలకీ, కథా రూపాలకీ, నవలల ఆవిర్భావానికీ ఆలంబననిచ్చిన గురజాడ, గిడుగుల విశేష కృషి మరువరానిది. పండిత భిషక్కుల భాషా వైద్యం వికటించకముందే తెలుగు భాషను సామాన్య ప్రజల భావ ప్రకటనా పరికరంగా మార్చిన ‘వ్యవహార భాషా ప్రయోక్త’ ద్వయానికి తెలుగు జాతి ఋణపడి ఉంది.
– ఆచార్య కొవ్వలి గోపాలకృష్ణ, అమెరికా
+17329917742