ఆచార్య డా.కె.జి.వేణు. ఒక వైపు నాటికలు, నాటకాలు, కవితలు, విశ్లేషణలు, ఇతర సాహిత్యాంశాలు రచిస్తూనే తన సృజనాత్మకతతో పాతికకు పైగా కథలు రాశారు. అందులోని దాదాపు మూడొంతులు వివిధ పోటీల్లో ఏదో ఒక బహుమతిని గెల్చుకున్నవి కావడం విశేషం, అయితే కవిగా అతని శైలి, భాషలో కన్పించే తీవ్రత, ఆవేశం కథలలో ఎక్కడా కనిపించనీయకుండా, అంతా సానుకూల, సామరస్య సందేశాత్మక శైలిలో కథలు రాయడం విశేషం. ఆయన రాసిన కథల్లో బహుమతులు పొందిన వాటితో కలిపి, ఇరవై కథలతో ‘ఆనందతాండవం’ పేరుతో, ఇటీవలే ఓ కథా సంపుటి విడుదలైంది. తొలి కథ ‘ఆనందతాండవం’ చదివిన ప్రతి పాఠకుడు… పతాక సన్నివేశంతో అదంతా తమ కుటుంబంలోనే జరిగినంతగా ఆనందతాండవానికి లోనవుతారు. తల్లిదండ్రల మాటలను శ్రావణి లెక్కచేయక, తొందరపాటుతో, పెద్ద ఆపదలో చిక్కకోవలసిన తన వైవాహిక జీవితాన్ని, తన కళ్ళ ముందు జరిగిన సంఘటనతో, వివేచనాత్మక నిర్ణయం తీసుకున్న తీరు ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
అలాగే పిల్లల ఇష్టాయిష్టాలు, అభిరుచులతో సంబంధం లేకుండా, అంతా తన అదుపాజ్ఞలలో తన ‘కోరుకున్నట్లుగానే తన కొడుకును చదివించాలనుకుంటాడు శివన్నారాయణ. కానీ తన కొడుకు బాల్యంలో మాననీయ కోణంలో వ్యవహరించిన తీరుతో, తండ్రిగా తాను కూడా మారిన తీరు… ఈనాడు మన సమాజానికి ఒక హెచ్చరిక, ఒక సూచన … ఒక మహత్తర సందేశంగా మలిచారు రచయిత ‘నాన్నా! నన్నిలా పెంచండి’ కథలో. ఇక ‘చేదు చెరుకులు’ కథలో, తాను రైతుబిడ్డగా సాటిరైతు కష్టం పట్ల, ఆ ఉద్యోగి, సంస్కారవంతుడుగా, మానవతా దృక్పథంతో ప్రవర్తించిన విధానం, ప్రతి రైతు పక్షపాతికీ హృదయం ద్రవించేలా చేస్తుంది
‘రాజయ్య దేవుడయ్యాడు’ కథ.. నిజానికి ఈ కథ బీహార్ రాష్ట్రంలో ఒక సామాన్యుడు సాహసోపేతంగా చేసిన కార్యక్రమం. ఒక బక్కరైతు, తమ గ్రామాన్ని, బయటి ప్రపంచానికి దూరం చేస్తున్న ఒక కొండను ఒక్కడే సంవత్సరాల తరబడి తవ్వి ఒక మార్గం ఏర్పాటు చేస్తాడు. నిరంతర అధ్యయనశీలి అయిన డా. వేణు ఆ సంఘటనను గొప్ప కథగా మలచి, పాఠకుల మన్ననలు పొందారు. ఇటీవల ప్రజలను శాస్త్రీయ దృక్పథం కలిగిన ఎందరినో ప్రభావితం చేస్తున్న అవయవదానం, దేహదానం వంటి మానవీయ నిర్ణయాలను, మంచి కథగా మలిచిన కథ ‘మహాదాత’. సన్నిహితుల సంకుచితత్వాన్ని, స్వార్థపూరిత మనస్తత్వాలను ప్రతిబింబిస్తుంది ఈ కథ. కానీ అంతిమంగా, ఉపాధ్యాయుడు చెల్లూరి శ్రీనివాసరావు, తన అంతిమ సంస్కారానికి బదులు, అతను ఎంతో దార్శనికతతో తీసుకున్న దేహదాన నిర్ణయం ప్రకటించిన, శ్రీనివాసరావు భార్య జానకమ్మ ప్రకటన, కథలోని మిగిలిన పాత్రలనే కాదు… చదువుతున్న పాఠకుల్ని సైతం విస్మయపరుస్తుంది. తాత్కాళిక ప్రయోజనాన్ని గురించి ఆలోచించే వారి చెంప చెళ్ళుమనిపిస్తుంది.
మరో మంచి సందేశాత్మక కథ ‘ఆ బిడ్డ నాకు కావాలి’. కథ పేరునుబట్టి, చివరి వరకు పాఠకుల్ని ఉత్కంఠలో ముంచెత్తుంది ఈ కథ పతాక సన్నివేశంలో సుమతి తీసుకున్న నిర్ణయం ఎన్నో హృదయాలను ద్రవింపజేస్తుంది. సుమతి తల్లిదండ్రులే కాదు, పాఠకులు కూడా ఆమె విశాల హృదయానికి నమోవాకాలర్పించవలసిందే. ఈ కథతో పోటీపడే కథ ‘మా తల్లి బంగారం!’. ‘వివాహబంధం తెగిపోయిన’ సునంద ‘తన భవిష్యత్ కంటే, దుర్మార్గుడైన భర్త (మాజీ) తల్లి దండ్రులను ఆదరించి అక్కున చేర్చుకున్న తీరు అపూర్వం. ఊహించని మలుపులతో, రచయిత డా. వేణు కథను నడిపించారు. క్లైమాక్స్‌తో పాఠకుడి కళ్ళు చెమర్చేలా చేశారు.
భారతీయ కుటుంబ వ్యవస్థలో బంధువులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు ఎందరున్నా, ప్రథమస్థానం స్వంత కుటుంబ సభ్యులదే! పెరిగిన సాంకేతిక విద్యా పరిజ్ఞానంతో పిల్లలు విదేశాలలో స్థిరపడిపోతున్నారు. వారికి మనసున్నా, తరచూ స్వదేశానికి వచ్చి, తల్లిదండ్రులను చూడడం, చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారమై పోయింది. అందువల్ల వేలాదిమంది వృద్ధ్ధ తల్లిదండ్రులు ఒంటరి జీవితం లాంటిదే గడుపుతున్నారు. ఆ జంటలో ఒకరు మరణించి, మిగిలిన ఒక్కరే స్వదేశంలో ఒంటరిగా వుండవలసి వస్తే… ఆ పరిస్థితి దారుణం. అలాంటి జీవితాల్లో భర్తను కోల్పోయిన, ఒక భార్య, తల్లిగా తన పిల్లల ఆస్తికి సంరక్షరాలిగా వుంటూ, సరైన మానవ సంబంధాలు లేక, పడుతున్న వేదనను కొత్త కోణంలో ఆవిష్కరించిన కథ… ‘అవును నేను గయ్యారానే…’. పాఠకులకు, ముఖ్యంగా ఆ వయసు తల్లిదండ్రులకు కన్నీళ్ళు రప్పిస్తోంది ఈ కథ. మిగిలిన కథలు కూడా ఆసక్తికరంగా పాఠకుల అభిమానాన్ని చూరగొంటాయి. ఊపిరి సలపని సాహితీ, సాంస్క ృతిక రంగ సైనికులు డా. కె.జి. వేణు గారి కలం నుండి, మరిన్ని మంచి కథలు రావాలని, తెలుగు పాఠకలోకం ఎదురుచూస్తూ వుంటుంది. రూ.200 వెల ఉన్న ఈ పుస్తకం ప్రతులకోసం కలిమిశ్రీ – 92464 15150ని సంప్రదించొచ్చు.
– బి.వి. అప్పారావు
93470 39294
